భళా... భారత బౌలర్లు | Sakshi
Sakshi News home page

భళా... భారత బౌలర్లు

Published Sun, Sep 3 2017 1:21 AM

భళా... భారత బౌలర్లు

సునీల్‌ గావస్కర్‌
ఈ సిరీస్‌లో భారత్‌ శ్రీలంకతో అద్భుతంగా ఆడుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో లంక బలమైన ప్రత్యర్థి కాదు. బౌలింగ్‌ పేలవంగా ఉంది. అంతర్జాతీయ స్థాయికి అదేమాత్రం సరితూగదు. కానీ... బ్యాటింగ్‌లో కొందరు మేటి ఆటగాళ్లున్నారు. అయితే వీరిని భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. బ్యాటింగ్‌ పిచ్‌లపై కూడా వారికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ తీసిన బౌలర్లను తప్పకుండా అభినందించాల్సిందే. నాలుగో వన్డేలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చెలరేగిన తీరు అద్భుతం. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో... వైవిధ్యమైన యార్కర్లతో లంక బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. వారి ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.

కొత్త కుర్రాడు శార్దుల్‌ ఠాకూర్‌ కూడా ఫ్లాట్‌ పిచ్‌పై చక్కగా రాణించాడు. కుల్దీప్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యా ఇలా అందరూ కలిసి లంక ఇన్నింగ్స్‌ను కూల్చారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌తో పాటు, కేదార్‌ జాదవ్, యజువేంద్ర చహల్‌ను డగౌట్‌కు పరిమితం చేసి రాహుల్‌కు మరో అవకాశమిచ్చారు. అయితే వెస్టిండీస్‌ సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రహానేను మరోసారి పక్కన బెట్టడం ఆశ్చర్యపరిచింది. రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ కోహ్లి భాగస్వామ్యం భారీస్కోరుకు బాట వేసింది. కోహ్లి నిష్క్రమణ తర్వాత హార్దిక్‌ పాండ్యాకు బదులుగా రాహుల్‌ను బరిలోకి దించి ఉంటే అతను క్రీజులో నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం ఉండేది.

అయితే కోహ్లి, రోహిత్‌ల సెంచరీలతో పాండ్యా, రాహుల్‌ల వైఫల్యం లెక్కలోకి రాలేదు. ధనంజయ అద్భుతమైన డెలివరికి రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ఏదేమైనా ఆటగాడిపై నమ్మకముంచడం మంచి పనే కానీ... ఇందుకోసం ఓ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ (రహానే)ను కాదని ఇవ్వడం మాత్రం తగని పని. మొత్తానికి లంక పర్యటనలో భారత ఆటగాళ్లంతా తమ ప్రతిభను చాటుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌ ఇలా అన్ని రంగాల్లో సత్తా కనబరిచారు.

Advertisement
Advertisement