57 విదేశీ పర్యటనలు | Sakshi
Sakshi News home page

57 విదేశీ పర్యటనలు

Published Fri, May 26 2017 1:39 AM

57 విదేశీ పర్యటనలు - Sakshi

ప్రధాని పదవిని చేపట్టాక మోదీ మొత్తం 57 విదేశీ పర్యటనలు చేశారు. అమెరికాకు ఏకంగా నాలుగుసార్లు వెళ్లారు. నేపాల్, జపాన్, రష్యా, ఆఫ్గనిస్థాన్, చైనాలకు రెండేసిమార్లు వెళ్లారు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ పర్యటించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో మోదీ మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ నెల 29 నుంచి మరో నాలుగుదేశాల పర్యటనకు వెళ్లనున్నారు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్‌లకు మోదీ వెళ్లనున్నారు.

క్షిపణి సాంకేతికత నియంత్రణ సంస్థ (ఎంటీసీఆర్‌)లో భారత్‌ 35వ సభ్యదేశంగా 2016 జూన్‌లో చేరింది. అమెరికా, ఫ్రాన్స్‌ల మద్దతుతో భారత్‌ ఇందులో సభ్యదేశమైంది.
జీశాట్‌–9 ఉపగ్రహ ప్రయోగం ద్వారా సార్క్‌ సభ్యదేశాలతో సంబంధాలు బలపడ్డాయి. పాకిస్థాన్‌ ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకోబోమని చెప్పింది.
బంగ్లాదేశ్‌తో భూమి బదలాయింపుతో ఒప్పందంతో దశాబ్దాల సరిహద్దు వివాదం ముగిసింది. తమ భూభాగంలో ఉన్న 111 గ్రామాలు లేదా ఆవాసాలను భారత్‌... బంగ్లాదేశ్‌కు బదలాయింది. బదులుగా బంగ్లాదేశ్‌ తమ ఆధీనంలోని 53 గ్రామాలకు భారత్‌కు ఇచ్చింది.
సల్మా డ్యామ్‌ను నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా ఆఫ్గనిస్థాన్‌లో సంబంధాలు బలోపేతమయ్యాయి.
  చైనా జలాంతర్గామిని శ్రీలంకకు సమీపంలో నిలిపేందుకు అనుమతి నిరాకరించాలని చెప్పి లంకను ఒప్పించింది. భారత్‌ ఆందోళనను గౌరవించాలని చెప్పి కొలంబోను ఒప్పించింది.
2015లో భారత్‌– ఆఫ్రికా ఫోరమ్‌ సమ్మిట్‌లో ఏకంగా 58 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిద్వారా ఆఫ్రికా దేశాలతో సంబంధాలు బలపడ్డాయి.
పాకిస్తాన్‌కు మిత్రదేశాలుగా పరిగణించే సౌదీ అరేబియా, యూఏఈలలో మోదీ పర్యటించి ఆరబ్‌ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చారు.
భారత పౌర అణుఇంధన అవసరాల నిమిత్తం యురేనియంను మన దేశానికి ఎగుమతి చేసేలా ఆస్ట్రేలియాను ఒప్పించింది.

పెరుగుతున్న చైనా ప్రాబల్యం
దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. సిల్క్‌ రోడ్డు వంటి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా క్రమేపి తమ ప్రాభవాన్ని పెంచుకుంటోంది. 2016లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు జిన్‌సింగ్‌ 24 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెడతామని (అప్పు, ఇతరత్రా సహాయం కూడా ఇందులో ఉంది) హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌ త్రివిద దళాలు చైనా ఆయుధాలను వాడుతున్నాయి. నేపాల్‌కు భారత్‌ సహాయం తగ్గిపోయింది. మరోవైపు పాకిస్థాన్‌కు చైనా సహాయం పెరుగుతోంది. ఆ దేశ మౌలిక సదుపాయాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2014లో భారత్‌లో పర్యటించారు. అనంతరం 2015లో మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ రెండు పర్యటన మూలంగా రాజకీయంగా, ఆర్థికంగా గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. సరిహద్దు వివాదంపై చర్చలు స్తంభించాయి. పైగా అంతర్జాతీయ వేదికల్లో భారత్‌కు తరచుగా చైనా అడ్డుతగులుతోంది. అణుసరఫరా దేశాల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ చేరికను చైనా పదేపదే అడ్డుకుంటోంది. 48 దేశాల ఈ గ్రూపులో చేరితే పౌర అణుఇంధన అవసరాలు సులువుగా తీరుతాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై భారత్‌ సంతకం చేయనందున... ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఎలా ఇస్తారని చైనా ప్రశ్నిస్తోంది.

జూన్‌లో జరిగే సమావేశంలోనూ భారత్‌ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని మంగళవారం సంకేతాలు ఇచ్చింది. అమెరికా, రష్యా, బ్రిటన్‌ తదితర దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తున్నా... చైనా ‘నో’ చెబుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి కూడా చైనా సుముఖంగా లేదు. ఆర్థికంగా, సైనికంగా బలమైన చైనాకు చెక్‌ పెట్టడానికి భారత్‌తో మిత్రుత్వం నెరుపుతోంది అమెరికా. జపాన్‌తో భారత్‌ సంబంధాలు బాగా ఉండటానికి కూడా చైనాను నిలువరించాలనే వ్యూహమే కారణం.

చైనాను ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ భారత్‌ కూడా వదులుకోవడం లేదు. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్‌ బెల్ట్‌– వన్‌ రోడ్‌’ ప్రాజెక్టుకు భారత్‌ ససేమిరా అంటోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ సిల్క్‌ రోడ్డులో భారత్‌ కీలకం కానుంది. దక్షిణ చైనా సముద్రం ప్రాదేశిక జలాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్‌ వ్యతిరేకిస్తోంది. అలాగే ప్రవాసంలో ఉన్న టిబెట్‌ అథ్యాత్మిక నేత దలైలామాకు ఆశ్రయం కల్పిస్తోంది.

పాక్‌తో నిత్యం తలనొప్పులే...
మరోవైపు పాక్‌తో సంబంధాల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. 2015లో రష్యాలోని ఉఫాలో మోదీ, నవాజ్‌ షరీఫ్‌లు సమావేశమయ్యారు. తీవ్రవాదాన్ని రూపుమాపడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం 2015 డిసెంబరులో బ్యాంకాక్‌లో జరిగింది. 25న నవాజ్‌ షరీఫ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని... ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి మోదీ ఆకస్మికంగా లాహోర్‌కు వెళ్లారు. సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి... చర్చల్లో పురోగతి ఉంటుందని ఆశించిన సమయంలో 2016 జనవరి ఒకటో తేదీన పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది.

దాంతో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌పై ఆంక్షలు విధించాలని, అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఏకాకిని చేయాలనే వైఖరిని మోదీ ప్రభుత్వం తీసుకుంది. అనంతరం 2016 సెప్టెంబరు 18న ఉడి సైనిక శిబిరంపై తీవ్రవాద దాడి జరిగింది. 19 సైనికులు చనిపోయారు. తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి చొచ్చుకెళ్లి తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది (సర్జికల్‌ స్ట్రయిక్స్‌). పాక్‌ సైనికులు కూడా చనిపోయారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్‌ 19వ సమావేశం భారత్‌ బహిష్కరణతో రద్దయింది.తీవ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపడం, సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడి కాల్పులకు తెగబడటం... లాంటి వాటితో ఇరుదేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.

గూఢచర్యం అభియోగాలపై పాక్‌ మిలటరీ కోర్టు భారత్‌ మాజీ నావికాదళ అధికారి కులభూషణ్‌ జాదవ్‌కు మరణశిక్ష విధించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కులభూషణ్‌ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్‌ చేసి... ఉరిశిక్షపై ‘స్టే’ను పొందడం భారత్‌ సాధించిన విజయంగా చెప్పొచ్చు. అలాగే పాక్‌ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తోంది. దీని ఫలితంగానే అమెరికా వైఖరి మారింది. ట్రంప్‌ సర్కారు తాజా బడ్జెట్లో పాక్‌కు చేసే ఆర్థిక సహాయాన్ని రుణంగా మార్చింది.

(మరిన్ని వివరాలకు చదవండి )
(ఇండియా ఫస్ట్‌)
(మోదీ ప్రజల ప్రధానే..!)
(కొంచెం మోదం! కొంచెం ఖేదం!!)
(మోదీ మ్యానియా)

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement