'అమెరికా ఉపాధ్యక్షుడికి నల్లగొండ దోస్తు'

'అమెరికా ఉపాధ్యక్షుడికి నల్లగొండ దోస్తు' - Sakshi


వాషింగ్టన్‌: దక్షిణాసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ కీలకంగా మారుతున్న దేశం భారత్‌. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్ పరిపాలనా కాలంలో భారతదేశానికి అమెరికాకు మధ్య సంబంధాలు మరింత పెరుగుతాయని ట్రంప్‌ పరిపాలన వర్గం భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుందని పక్కా సమాచారం. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ప్రస్తుతం అమెరికాకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న మైక్‌ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడు రాజు చింతల.



తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు చెందిన రాజు చింతల గత పదేళ్లుగా మైక్‌ పెన్స్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఇండియానా గవర్నర్‌గా మైక్‌ పెన్స్‌ అవతరించేవరకు కూడా రాజు చింతల పెన్స్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇండియానా నుంచి వాషింగ్టన్‌లో దిగారు. వాషింగ్టన్‌లో కొలువు దీరనున్న కొత్త అమెరికా ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో రాజు చింతల పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే..



'దక్షిణాసియా దేశాల్లో అమెరికా తరుపున కీలక పాత్ర ఒక్క భారత్‌ మాత్రమే పోషించగలదని అమెరికా భావిస్తోంది. పైగా అత్యంత వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను అమెరికా భావిస్తోంది. ట్రంప్‌ ఆధ్వర్యంలో కచ్చితంగా భారత్‌, అమెరికాల మధ్య బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ విభాగంలో.. అలాగే ఉగ్రవాదం విషయంలో కూడా ట్రంప్‌ భారత్‌తో కలిసి ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఐసిస్‌ను తుదముట్టించేందు ట్రంప్‌ కూడా సన్నద్ధమవుతున్నారు. మైక్‌ పెన్స్‌ ఈ ఏడాది భారత్‌లో పర్యటించాలని అనుకుంటున్నారు. దాని ద్వారా భారత్‌లో అమెరికా ఎగుమతులకు మరింత ఊపునివ్వాలని భావిస్తున్నారు' అని ఆయన చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top