థియేటర్లలో ‘నందమూరి’ పోరు!

థియేటర్లలో ‘నందమూరి’ పోరు! - Sakshi


♦ నాన్నకు ప్రేమతో సినిమాను దెబ్బతీసేలా ‘డిక్టేటర్’ ప్లాన్

♦ జూ. ఎన్టీఆర్‌ను టార్గెట్‌గా థియేటర్ యజమానులకు బెదిరింపులు

 

 సాక్షి, విజయవాడ బ్యూరో: నందమూరి కుటుంబ పోరు థియేటర్ల వరకు పాకింది. నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్లు దొరక్కుండా చేసి జూనియర్ జోరును తగ్గించాలని ‘డిక్టేటర్’ ప్లానింగ్ అమల్లోకి వచ్చింది. దీనికి శుక్రవారం నుంచే తెరవెనుక ఒత్తిళ్లు మొదలయ్యాయి. బాలయ్య తరఫున ఆయన అల్లుడు లోకేష్  రంగంలోకి దిగినట్లు తెలిసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు బుక్‌చేసుకున్న ధియేటర్లను బాలయ్య సినిమాకు మార్చేలా అధికార పార్టీ నేతలు సామ,దాన,భేద,దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.



బాలయ్య ‘డిక్టేటర్’  ఈ నెల 14న విడుదల కానుంది. వాటితో పాటు నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ 15న విడుదల అవుతుంది. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ వారసులైన బాలయ్య, జూ. ఎన్టీఆర్‌ల సినిమాలు వివాదాలకు కేంద్రంగా మారాయి. ఇద్దరూ సంక్రాంతి సినిమాల బరిలో దిగుతుండటంతో పందెం కోళ్లు మాదిరి కత్తులు దూసే పరిస్థితి నెలకొంది.



 నెల్లూరు, ప్రకాశంలో రచ్చకెక్కిన పోరు..: నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో నాన్నకు ప్రేమతో సినిమాకు బుక్ చేసుకున్న పలు ధియేటర్లను మార్చి వాటిలో డిక్టేటర్ ఆడించాలని అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు చేయడంతో నందమూరి హీరోల సినిమా పోరు రచ్చకెక్కింది. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రధాన సెంటర్‌లోని రెండు ధియేటర్లలో ఒక దానిని నాన్నకు ప్రేమతో, మరో దానిని నాగార్జున సినిమాకు బుక్‌చేశారు. జూనియర్ సినిమాకు బుక్‌చేసిన ధియేటర్‌ను డిక్టేటర్‌కు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెంచారు. దీంతో జూనియర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. నెల్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొందని జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ శుక్రవారం నుంచి ఇదే తరహా ఒత్తిళ్లు మొదలయ్యాయి.



 థియేటర్ల వివరాలు సేకరించి  భయపెట్టే యత్నాలు..

 రాయలసీమ ప్రాంతంలో బాలయ్య సినిమాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా కంటే 39 ధియేటర్లు అదనంగా బుక్ చేసుకున్నట్లు చెబుతున్నారు. అయినా సంతృప్తి పడని బాలయ్య అనుయాయులు నాన్నకు ప్రేమతో సినిమా ఆడే థియేటర్ల వివరాలు సేకరించి రాజకీయంగా కక్ష సాధింపులకు రంగం సిద్ధం చేసే పనిలో పడ్డారు. సీడెడ్‌లో నాన్నకు ప్రేమతో సినిమాను రిలీజ్ చేయనున్న థియేటర్ పేరు, దాని యాజమాని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే నాన్నకు ప్రేమతో సినిమాకు ధియేటర్లు ఇచ్చిన వారు, ఇవ్వాలనుకున్న వారు కలవరపడుతున్నారు.



 ‘గోదా’వరిలో జూనియరే.. : ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం డిక్టేటర్ ఒత్తిళ్లు అంతగా పనిచేయకపోవడంతో నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్లు బాగానే దొరికాయి. జూనియర్ సినిమాకే కలెక్షన్లు బాగుంటాయని, అందుకే ఆయన సినిమాకే  ధియేటర్ల యజమానులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మొత్తానికి జూనియర్ సినిమాను దెబ్బతీయడం ద్వారా సినిమాల్లో అతని హవాకు చెక్ పెట్టడంతో పాటు నందమూరి వారసుల నుంచి రాజకీయంగాను మరో పోటీలేకుండా చేయాలనే అధికార పార్టీ ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయన్నది సంక్రాంతి బరిలోనే తేలనుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top