నిధులు ఫోన్ల పాలు | Sakshi
Sakshi News home page

నిధులు ఫోన్ల పాలు

Published Mon, Aug 29 2016 12:15 AM

నిధులు ఫోన్ల పాలు

  • గ్రేటర్‌ కార్పొరేటర్లకు స్మార్ట్‌ మెుబైళ్లు
  • ప్రజాధనాన్ని పంచిన జీడబ్ల్యూఎంసీ
  • ఒక్కో సెల్‌ ఖరీదు రూ.11,200 
  • 60 ఫోన్లకు రూ.6.72 లక్షల ఖర్చు 
  • సాక్షి, హన్మకొండ : గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారు.. ఆ తర్వాత చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కార్పొరేటర్లుగా గెలవడానికి లక్షలు ఖర్చు చేసిన ప్రజాప్రతినిధులు... వరంగల్‌ మహానగరపాలక సంస్థ నిధులు తమ సొంతమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడడం అలవాటైన అధికారులు కూడా.. కార్పొరేటర్లను ‘సంతృప్తి’ పరిచే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏదో ఒక రూపంలో ఈ పనులు చేస్తూనే ఉన్నారు. ఇలా కార్పొరేటర్ల మెప్పు పొందేందుకు వరంగల్‌ మహానగరపాలక సంస్థ అధికారులు మరో పని చేశారు. 
     
    గ్రేటర్‌ వరంగల్‌లో 58 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిలో  కొందరు కోటీశ్వరులు, మరి కొందరు లక్షాధికారులు ఉన్నారు. అందరికీ ఖరీదైన సెల్‌ఫోన్లు ఉన్నాయి. కార్పొరేటర్లుగా గెలిచి.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లకు సిమ్‌కార్డులు ఇచ్చింది. అందరు ఫోన్లు ఉన్నవారే కావడంతో ఈ సిమ్‌కార్డులు ఉపయోగపడతాయని సామాన్యులు భావించారు. అయితే గ్రేటర్‌ అధికారులు, కార్పొరేటర్లు మాత్రం మరోలా ఆలోచించారు. ప్రజాధనం ఎలా వాడుకోవాలనే పథకాన్ని రచించారు. సిమ్‌కార్డులు ఇచ్చిన అందరికీ మొబైల్‌ ఫోన్లు కావాలని నిర్ణయించారు. గ్రేటర్‌ వరంగల్‌ అంటే హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరం. మొబైల్‌ ఫోన్లు కూడా అదే స్థాయిలో ఉండాలని అధికారులు ‘ఉన్నతంగా’ ఆలోచించారు. కార్పొరేటర్లకు, గ్రేటర్‌ కమిషనర్‌ క్యాంపు క్లర్క్‌కు, పర్యావరణ విభాగం ఇంజనీర్‌కు ఒకటి చొప్పున 60 సామ్‌సంగ్‌–జే5 మోడల్‌ సెల్‌ ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్‌కు రూ.11,200 చొప్పున రూ.6.72 లక్షలు ఖర్చు చేశారు. 
     
    సీల్డు కవరు టెండరు ద్వారా...
    కార్పొరేటర్లకు మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై విషయంలో అధికారులు తమకు నచ్చిన ప్రక్రియ అనుసరించారు. ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతి కాకుండా సీల్డ్‌ కవరు విధానంలో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతి అయితే కార్పొరేషన్‌ ఖజనాపై భారం తగ్గేది. చీపుర్లు, స్టేషనరీ, రేడియం జాకెట్లు వంటి తక్కువ ఖర్చు అయ్యే వస్తువులకు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతిలో స్పందన లేదని పేర్కొంటున్న అధికారులు వాటికి సీల్డ్‌ కవరు టెండర్లు నిర్వహించారు. అయితే మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే సామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్ల కొనుగోలు విషయంలోనూ సీల్డ్‌ కవర్‌ టెండర్లనే అమలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కార్పొరేటర్లకు ఫోన్లు ఇచ్చినప్పుడు తమకూ ఏదో ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఇలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
 
Advertisement