అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్‌!  | Sakshi
Sakshi News home page

అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్‌! 

Published Thu, Feb 25 2021 8:25 AM

Initial Registration For New Fancy Number - Sakshi

గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్‌ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్‌ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్‌లైన్‌ చేసి దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్‌ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. 

సేవలు ప్రారంభం..
ఫ్యాన్సీ నంబర్‌ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్‌ నంబర్‌కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్‌ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌ నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. 

సద్వినియోగం చేసుకోవాలి 
వాహనాల రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 
– పురుషోత్తంరెడ్డి, డీటీఓ

Advertisement
Advertisement