నేడు మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక | Sakshi
Sakshi News home page

నేడు మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

Published Thu, Mar 28 2024 12:47 AM

Arrangements complete within constituency of Mahabubnagar local bodies - Sakshi

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో ఏర్పాట్లు పూర్తి

10 పోలింగ్‌ స్టేషన్లు.. 1,439 మంది ఓటర్లు

కొడంగల్‌లో ఓటుహక్కు వినియోగించుకోనున్న సీఎం రేవంత్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్‌ జరగనుండగా.. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితోపాటు ఎక్స్‌ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తం 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియోగా కొడంగల్‌లో ఓటు వేయనున్నారు.

ఉపఎన్నికకు  మహబూబ్‌నగర్,  కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్‌ కార్యాలయాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్‌ ద్వారా ప్రజాప్రతినిధులు ఓట్లు వేయనున్నారు. బుధవారం ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి అన్ని పోలింగ్‌ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. వచ్చే నెల రెండో తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

నేరుగా పోలింగ్‌ కేంద్రాలకే..
పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు వచ్చిన ఉప ఎన్నిక కాగా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్‌ నుంచి యువ పారిశ్రామిక వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీ మాజీ చైర్మన్‌ నవీన్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకుని పట్టు సాధించాలని బీఆర్‌ఎస్‌.. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్‌ ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. ఓటర్లు చేజారొద్దనే ఉద్దేశంతో ఓటర్లను ఆయా పార్టీలు గోవా, ఊటీ, కొడైకెనాల్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించారు.

గురువారం పోలింగ్‌ జరగనుండగా.. బుధవా రం తెల్లవారుజామునే క్యాంపుల నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. రాత్రికి వారిని హైదరాబాద్‌లోని రిసార్ట్స్‌కు తరలించి.. గురువారం ఉదయం నేరుగా ప్రత్యేక బస్సుల్లో పోలింగ్‌ సెంటర్లకు తీసుకురానున్నారు. సంఖ్య ప్రకారం బీఆర్‌ఎస్‌ కు మెజారిటీ ఉన్నా, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణా మాల క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement