పుస్తకాలొస్తున్నాయ్‌.. | Sakshi
Sakshi News home page

పుస్తకాలొస్తున్నాయ్‌..

Published Mon, May 20 2024 6:25 AM

పుస్త

ఖమ్మంసహకారనగర్‌: నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సైతం విద్యా వ్యవస్థకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. గతంలో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్య, నోట్‌ పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాకు పలు పుస్తకాలు చేరుతున్నాయి. నాటి ప్రభుత్వం మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మిగతా పాఠశాలలపై దృష్టి సారించింది.

తొలిరోజే పుస్తకాలు..

2024 – 25 విద్యా సంవత్సరం జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలిరోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో విద్యాశాఖ పరిధిలో 1,232 పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 68,653 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ఆధారంగా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చేరుస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో 6,84,740 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా.. ఇందులో పార్ట్‌ –1కు సంబంధించి 5,17,274, పార్ట్‌ –2కు సంబంధించి 1,67,466 పుస్తకాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు పార్ట్‌ –1కు సంబంధించిన 2,15,920 పాఠ్య పుస్తకాలు రాగా.. మిగతా 4,68,820 పుస్తకాలు త్వరలో జిల్లాకు చేరనున్నాయి. గతేడాది నుంచి నోట్‌ పుస్తకాలు కూడా ఇస్తుండగా, 2023 – 24 విద్యా సంవత్సరంలో 4,19,885 నోట్‌ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సారి కూడా అదే స్థాయిలో రానున్నాయి. కాగా ఇప్పటి వరకు 79,300 నోట్‌ పుస్తకాలు రాగా.. ఇందులో వైట్‌ నోట్‌ బుక్స్‌ 64,300, రూల్‌ నోట్‌ బుక్స్‌ 15వేలు ఉన్నాయి. మిగతావి త్వరలో జిల్లాకు రానున్నాయి.

జిల్లాకు 6,84,274

పాఠ్యపుస్తకాలు అవసరం

ఇప్పటికే 2 లక్షల వరకు సిద్ధం..

మిగతావి కూడా త్వరలోనే

వస్తాయంటున్న యంత్రాంగం

బడి తెరిచే రోజునే పుస్తకాలు

అందించేలా కార్యాచరణ

విద్యార్థులకు ఎంతో ఉపయోగం..

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్కూళ్ల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎంతగానో ఉపయోగకరమనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పుస్తకాలు కూడా సకాలంలో అందితే వారు తొలినాళ్ల నుంచే చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి

పాఠశాలలు వచ్చే నెల 12 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. తొలిరోజుల్లో పుస్తకాలు అందించటం ద్వారా విద్యార్థులకు పాఠాలు వినటంతో పాటు చదువుకునేందుకు వీలుంటుంది. ఇప్పటి వరకు 2,15,920 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగతావి కూడా త్వరలో రానున్నాయి.

– ఈ.సోమశేఖర శర్మ,

జిల్లా విద్యాశాఖాధికారి

పుస్తకాలొస్తున్నాయ్‌..
1/2

పుస్తకాలొస్తున్నాయ్‌..

పుస్తకాలొస్తున్నాయ్‌..
2/2

పుస్తకాలొస్తున్నాయ్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement