ఎకో టూరిజమే లక్ష్యం ! | Sakshi
Sakshi News home page

ఎకో టూరిజమే లక్ష్యం !

Published Mon, May 20 2024 6:25 AM

ఎకో ట

● పర్యాటక కేంద్రాల అభివృద్ధికి డీపీఆర్‌ ● తద్వారా జిల్లా యువతకు ఉపాధి ● జంతువుల వేట, పోడు సాగుకు అడ్డుకట్ట ● హరితహారం ద్వారా 30 లక్షల మొక్కల పెంపకం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌

ఖమ్మంవన్‌టౌన్‌: ‘జిల్లాలో ఉన్న అడవులను సంరక్షించి జీవ వైవిధ్యానికి బాటలు వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. జిల్లాలో ఉన్న అడవుల విస్తీర్ణం ఏ మాత్రం తగ్గకుండా చూస్తూనే సింగరేణి, నగరపాలక సంస్థ, డీఆర్‌డీఓ, ఇతర ప్రభుత్వ సంస్థల, అధికారుల సహకారంతో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు హరితహారం ద్వారా ఏటా మొక్కలు నాటుతున్నాం. ఈ ఏడాది సైతం 31.06 లక్షలకు పైగా మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొక్కలు నాటేందుకు అటవీ నర్సరీల్లో సిద్ధం చేశాం. అడవులు, అడవుల్లో ఉండే జంతుజాతులను సంరక్షిస్తూనే ప్రజలు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎకో టూరిజం ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌లు ప్రభుత్వానికి పంపిస్తాం’ అని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ వెల్లడించారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..

మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు..

ఈ ఎండాకాలం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ వచ్చాం. ఇప్పటి వరకు జిల్లాలోని ఏ డివిజన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదు. ఎక్కువగా భూ అక్రమణదారులు, వేటగాళ్ల వల్ల, వాహనదారులు బీడీలు, సిగరెట్లు తాగి పడేయడం వల్లే అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అ దిశగా చైతన్యవంతం చేస్తున్నాం. ఇటీవల ఖమ్మం వెలుగుమట్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో అర్ధరాత్రి వేగంగా వీచిన గాలులతో మంటలు లేచాయి. సమాచారం అందగానే అప్రమత్తమై కలెక్టర్‌ వీ.పీ. గౌతమ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, మా ఎఫ్‌డీఓల సమన్వయంతో ఫైరింజన్‌, గ్రామపంచాయతీల వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా నీరు తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చాం.

వన్యప్రాణులకు

తాగునీటి వసతి

వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బంది, స్టైకింగ్‌ ఫోర్స్‌ నిత్యం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా బోర్లు వేశాం. వాటికి సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసి గుంతల్లో (సాసర్‌ పిట్లు) నీరు నింపుతాం. సహజంగా ఉండే వాగులు, వంకలలో ఉన్న నీరు ఎండిపోయినప్పు డు కృత్రిమంగా బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం.

పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై..

జిల్లాలో పులిగుండాల ప్రాజెక్ట్‌, నీలాద్రి దేవాలయం, నీలాద్రి అర్బన్‌ పార్క్‌, కనిగిరి హిల్‌ వ్యూ, పల్లెర్ల బావి వ్యూ పాయింట్‌, కాకతీయుల నాటి పురాతన దేవాలయాలను ఎకో టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు (డీపీఆర్‌) రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపించాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి సహాయ సహకారాలతో త్వరలోనే అనుమతులు సాధిస్తాం. ప్రజలు ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. ఈ ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

పులి, ఏనుగు తప్ప అన్నీ..

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులులు, ఏనుగులు తప్ప అన్ని జీవజాతులు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు మా బృందాలు నిరంతరం రెండు డివిజన్లలో ఉన్న అన్ని బీట్లలో గస్తీ తిరుగుతూ ఉంటాయి. వేటగాళ్ల బారిన వన్యప్రాణులు పడకుండా ఎవరైనా కొత్తగా, అనుమానాస్పదంగా కనిపించినా వారిని ప్రశ్నిస్తారు. అదేవిధంగా సరిహద్దుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో శాటిలైట్‌ లింకు ద్వారా సైరన్‌ వస్తుంది. ఆ వెంటనే మా సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. మధిర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొందరు వేటకు వస్తుండడంతో నిఘా మరింత పెంచాం.

అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

అడవుల సంరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. జిల్లాకు వచ్చే సరిహద్దులతో పాటు, ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని శాటిలైట్‌కు లింక్‌ చేశాం. దాని ద్వారా మొత్తం మానిటరింగ్‌ చేస్తున్నాం. విలువైన అటవీ సంపదను రక్షించేందుకు నిత్యం గస్తీ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోనే ఉండే విధంగా చూస్తున్నాం. పోడుదారులు పోడుకొట్టి అటవీ భూమిని అన్యాక్రాంతం చేయకుండా చూస్తున్నాం.

ఎకో టూరిజమే లక్ష్యం !
1/1

ఎకో టూరిజమే లక్ష్యం !

Advertisement
 
Advertisement
 
Advertisement