బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది?

బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది? - Sakshi


మయన్మార్ (బర్మా)లో నల్లడబ్బును సమూలంగా నిర్మూలించాలనే సదాశయంతో 1987లో అప్పటి దేశ నాయకుడు నే విన్ దేశ కరెన్సీ కియత్‌లోని పెద్ద నోట్లను రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒక్కసారి వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతోపాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రోజువారి కూడు కోసం కావాల్సిన ఉప్పు, పప్పుల కొనుగోలు కూడా కష్టమైంది.


పదివేల మంది కాల్చివేత..!

అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలకు వస్తుమార్పిడి విధానం (బార్టర్) అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసానంగా బియ్యం, అలాగే కూరగాయల ఎగుమతులు పట్టణాలకు నిలిచిపోయి అక్కడ తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పట్టణ ప్రాంతంలో సరకుల దోపిడీలు, అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపు చేయడానికి సైనికులు జరిపిన కాల్పుల్లో పదివేలకు మందికిపైగా ప్రజలు మరణించారు.



ఎన్నో మంచి పనులు చేశారు..!

 అంతకుముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన నే విన్ 1987లో యాభై, వంద రూపాయల కియత్ నోట్లను రద్దు చేసినప్పుడు పాలకపక్ష ‘బర్మ సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ’కి చైర్మన్‌గా కొనసాగుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. పాలకపక్ష సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఆర్మీ చీఫ్ కమాండర్‌గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. సోషలిజం కార్యక్రమం కింద ఆయన ఎన్నో మంచి ప్రజా సంక్షేమ పనులు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను జాతీయం చేయడంతోపాటు పలు ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేసి  ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలను తీసుకొచ్చి పేదలకు మేలు చేశారు.


నల్లకుబేరుల పని పట్టాలి..

 ఇలాంటి సోషలిస్టు భావాలు కలిగిన ఆయన నల్ల కుబేరుల పీచమణచాలనే ఉద్దేశంతో యాభై, వంద కియత్ నోట్లను అనూహ్యంగా రద్దు చేసి వాటి స్థానంలో 49, 90 కియత్ నోట్లను తీసుకొచ్చారు. ఈ కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడడం వల్ల నే విన్‌కు చెడ్డ పేరు వచ్చింది. 1963లో ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ 50, 100 నోట్లను రద్దు చేశారు. అప్పడు కూడా ఆయన ఆశించిన ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటిలాగా కాకూడదనే ఉద్దేశంతో 1987లో సంఖ్యా శాస్త్రం విశ్వసించే నే విన్ ఓ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యుడిని సంప్రతించారు. తొమ్మిదో నెంబర్ కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో 50, 100 నోట్ల స్థానాల్లో 49, 90 నోట్లను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో నియత ఆర్థిక వ్యవస్థ 50 శాతం దెబ్బతింది. అనియత వ్యవస్థ అంటే ప్రజల్లో నగదు సర్కులేషన్ సరిగ్గా 86 శాతం పడిపోయి, జాతీయ స్థూల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి.


చివరికి రాజీనామా!

కేవలం జ్యోతిష్యుడు మాట నమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పాలకపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో 1988, జూలై 23వ తేదీన పార్టీ చైర్మన్ పదవికి నే విన్ రాజీనామా చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top