న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనా?

న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనా? - Sakshi


దళిత విద్యార్థులు దుందుడుకు భాషను వాడుతున్నంత మాత్రాన వారిని నేరస్తులుగా భావించకూడదు. వారి నినాదాలపై ఆగ్రహించడానికి బదులుగా ప్రభుత్వం వారితో చర్చలు జరపటం ముఖ్యం. ప్రభుత్వం ఈ దిశగా అడుగులేయడానికి ప్రయత్నించనంత కాలం... అత్యంత క్రూరంగా మనం అణచివేస్తున్న వారు, ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రజల్లో ప్రోత్సహించేలా మాట్లాడుతూ, రాస్తూ ఉండటమే కాకుండా అలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటే మనం ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

 

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 1931 అక్టోబర్‌లో అంబేడ్కర్ గురించి మాట్లా డుతూ, ‘‘కటువుగా, దూకుడుగా ఉండటానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. ఆయన తన్ను తాను నియంత్రించుకోవలసిన అంశం ఏమంటే మన తలలు బద్దలు చేయకుండా ఉండటమే’’ అన్నారు. తనపై, తన కమ్యూనిటీపై జరుగు తున్న  దౌర్జన్యాలపై అంబేద్కర్ తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో గాంధీ అలా అన్నారు. తాను ఉపయోగిస్తున్న పదాల విషయంలో అంబేద్కర్ చాలా కఠినంగా ఉంటాడని ప్రతీతి.

 

 ఇప్పుడు మరొక కళాశాలలో జరిగిన నిరసన కార్యక్రమం పాలక పార్టీ ఆగ్రహాన్ని చవిచూడటం గురించి నేను ఆలోచిస్తున్నాను. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసన తెలిపిన విద్యా ర్థులపై ఢిల్లీలో పోలీసులు దేశద్రోహ ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ‘తమ ప్రభుత్వంపై ప్రజలు అవిధేయత ప్రకటించేలా మాట్లాడటం, రాయడం లేదా వారిని ప్రోత్సహించేలా ఏైవైనా చర్యలు చేపట్టడం ద్వారా చేసే నేరమే’ దేశద్రోహం అంటున్నారు.

 

 విద్యార్థులను రాజ్యాంగ వ్యతిరేకులుగా, జాతి వ్యతిరేకులుగా పేర్కొంటూ తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ మనీష్ గిర్రీ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ‘అలాంటి అవమానకరమైన, దేశ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవాల’ని కోరుతూ గిర్రీ.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలకు ఉత్తరం రాశారు. యాకుబ్ మెమొన్‌ను ఉరితీయడంపై హైదరాబాద్‌లో నిరసన తెలిపిన విద్యార్థులపై బీజేపీ కఠినంగా వ్యవహరించిన ఘటన ఢిల్లీలో పునరావృతమైంది. నిరసన తెలిపిన విద్యార్థులలో ఒకరు తనకు తాను ఉరివేసుకున్న విషాదంతో హైదరాబాద్ ఉదంతం ముగిసింది. అలాంటి నిరసన చర్యను తాను అనుమతించలేదని చెప్పిన జేఎన్‌యూ ఒక విచారణ కమిటీని ఏర్పర్చింది కానీ, కమిటీలో ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య ఇక్కడా ఎదురైంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఏ సభ్యుడూ ఈ కమిటీలో లేరని విద్యార్థి సంఘం పేర్కొంది.

 

 బీజేపీకి ఇక్కడ మరొక అవకాశం ఉంది. విద్యార్థులపై నేరారోపణ చేయడానికి బదులుగా, సమస్యను అర్థం చేసుకోవడానికి అది ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇది కులంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. మెమొన్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో దళితులు ఎందుకు నిరసన తెలిపారు? జేఎన్‌యూలో ముస్లింలపై ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఒక కమిటీ తమపై ఒక తీర్పు చెబుతున్నప్పుడు దాంట్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని విద్యార్థులు ఎందుకు పట్టుబడుతున్నారు? భారతదేశం చాలావరకు దళితులు, ముస్లింల కోసమే ఉరిశిక్షను పరిమితం చేసి ఉంచింద న్నది వాస్తవం.

 

 దేశంలో 75 శాతం మరణ దండనలు, ఉగ్రవాద చర్యలకు గాను విధించిన మరణ శిక్షల్లో 93.5 శాతం వరకు దళితులు, ముస్లింలే ఉన్నారని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడు ప్రచురించనున్న అధ్యయనం సూచిస్తోంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న సమస్య ఏమిటంటే పక్షపాత ధోరణే. మాలెగావ్ బాంబు దాడుల కేసు చెబుతున్నట్లుగా అగ్రవర్ణ హిందువులు పాల్గొన్న ఉగ్రవాద చర్యలపై ప్రభుత్వం కఠినచర్య తీసుకున్న దాఖలాలు లేవు. రాజీవ్‌గాంధీ హంతకులు తమపై విధించిన ఉరిశిక్ష అమలుకు దశాబ్దాలుగా ఎదురు చూస్తుండగా, పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హంతకుడిని ఉరితీయడంలోనూ మన పాలక వ్యవస్థ ఎలాంటి ఆతృతనూ ప్రదర్శించి ఉండలేదు. కానీ ఉగ్రవాద ఆరోపణ లతోటే వీరికీ ఉరిశిక్ష విధించారు. ఒకే విధమైన చట్టాలతో దేశంలో నేరస్థులపై నిర్ణయాలు చేయడం లేదన్నదే వాస్తవం. 95మంది గుజరాతీలను నిలువునా ఊచకోత కోసిన మాయాబెన్ కొద్నాని వంటివారిని కనీసం జైల్లో కూడా ఉంచలేదన్న విషయాన్ని పక్కన బెడదాం.

 

 ఇక్కడ రెండో విషయం ఏమిటంటే ఆర్థికం. దళితులు, ముస్లింలు పేదరికానికి పర్యాయపదాలు ట్రయల్ కోర్టు దశలో అఫ్జల్ గురుకు దాదాపుగా న్యాయ సహాయం లభించలేదు. ఈ వాస్తవాల ప్రాతిపదికన దళితులు, ముస్లింలు వారి మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తమ నిరసనను వ్యక్తీకరించడానికి వారికి పూర్తి హక్కు ఉంది. వారు అదుపు తప్పిన వారిగా, స్థిమితం కోల్పోయిన వారిగానూ కనిపించవచ్చు కానీ, వారు వాస్తవం ప్రాతిపదికపైనే వాదిస్తున్నారు. భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరించిన వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీకి ఉత్తరాలు సంధించింది బీజేపీ ఎంపీలే.

 

 మనది సంపూర్ణమైన, లోపరహితమైన సమాజమనీ, దానికి ప్రతి ఒక్కరూ విధేయులై ఉండాలనే కాల్పనిక భ్రమలను భారతీయులందరూ అందిపుచ్చుకో వాలని అగ్రకులాల్లోని మనం బలవంతం చేస్తున్నాం. హిందుత్వ సమాజమే ప్రధానంగా మధ్యతరగతి, అగ్రవర్ణాలతో కూడుకున్నది. తనకున్న సౌకర్యాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని గ్రహిస్తున్నందున, వీరు రిజర్వేషన్లు అనే భావననే అసహ్యించుకుంటున్నారు. గర్హిస్తున్నారు.

 

 అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సైతం రిజర్వేషన్లను సమర్థించడం లేదు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ప్రకటనలు ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పుట్టి ముంచిన విషయం తెలిసిందే.ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని స్పందన ఎలా ఉంది? ప్రతిపక్షం కట్టుకథ లల్లుతోందని, అబద్దాలాడు తోందని ఆరోపించడానికే మోదీ పరిమితమయ్యారు. కాని క్షేత్రస్థాయిలో వాస్తవాలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ దళితులు నోరు విప్పుతున్నారు, వారి హక్కుల కోసం నిలబడుతున్నారు. దీంట్లో ఎలాంటి తప్పూ లేదు. దుందుడుకు భాషను వాడుతున్నంత మాత్రాన వారిని నేరస్తులుగా భావించకూడదు. నేడు వారు సంధిస్తున్న నినాదాలకు వ్యతిరేకంగా స్పందించడా నికి, ఆగ్రహించడానికి బదులుగా ప్రభుత్వం వారితో చర్చలు జరపటం, వారి వాదనను కనీసం వినడానికైనా ప్రయత్నించడం ముఖ్యం.

 

 మొదట హైదరాబాద్‌లో, ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో హిందుత్వ నేతలు ప్రదర్శిస్తున్న అసంబద్ధ ప్రతీకార చర్య లను... ఈ కథనం మొదట్లో పేర్కొన్నట్లుగా, అంబేడ్కర్ ఉపయోగించిన పదాల కాఠిన్యంపై గాంధీజీ ప్రదర్శించిన విజ్ఞతతో సరిపోల్చి చూడండి.



ఈ సమస్యలపై మనం కాస్త పరిపక్వతతో కూడిన అవగాహనను ప్రదర్శిం చాలి. ప్రభుత్వం ఈ దిశగా అడుగులేయడానికి ప్రయత్నించనంత కాలం... అత్యంత క్రూరంగా, పాశవికంగా మనం అణచివేస్తున్న వారు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అవిధేయతను ప్రోత్సహించేలా మాట్లాడుతూ, రాస్తూ ఉండటమే కాకుండా అలాంటి చర్యలకు భవిష్యత్తులో కూడా పాల్పడుతూనే ఉంటే మనం ఏమాత్రం ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

 - ఆకార్ పటేల్

 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top