వైద్యం చేతకాక చేయి తీసేశాడు | Sakshi
Sakshi News home page

వైద్యం చేతకాక చేయి తీసేశాడు

Published Thu, Jan 29 2015 6:44 PM

వైద్యం చేతకాక చేయి తీసేశాడు - Sakshi

డాక్టర్లు శస్త్రచికిత్సల సందర్భంగా కడుపులో కత్తెర్లు మర్చిపోవడం, గుండెలో గుర్తులేక సూదులు వదిలేయడం గతించిన చరిత్ర, ఇప్పటి డాక్టర్లు వృత్తిని దైవంగా భావించి అప్రమత్తంగా తమ విధులు నిర్వహిస్తున్నారని భావిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో ఓ డాక్టర్  వైద్యం చేతకాక ఏకంగా ఓ నాలుగేళ్ల చిన్నారి చేతినే తీసేశాడు. నావడా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజుల క్రితమే ఈ ఘోరం జరిగింది. దీన్ని తట్టుకోలేకపోయిన ఆ చిన్నారి తండ్రి ఉదయ్ ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం... నావడా జిల్లాలోని విశ్వన్‌పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ ప్రసాద్ నాలుగేళ్ల కూతురు ఆంచల్ కుమారికి నెలరోజుల క్రితం ఓ ప్రమాదంలో ఎడమచేయి విరిగి వాచింది. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా డాక్టర్ అరవింద్ కుమార్ వైద్యం చేస్తూ వచ్చారు. నెలరోజులైనా విరిగిన ఎముక అతుక్కోకపోగా వాపు కాస్తా ఇన్‌ఫెక్షన్‌కు దారితీసింది. డాక్టర్ మారు మాట్లాడకుండా ఆ చిన్నారి ఎడమ చేతిని శస్త్రచికిత్సతో తొలగించేశాడు. ఈ నిర్వాకంతో మండిపడిన ఆ చిన్నారి తండ్రి, ఇతర బంధువులు గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడంతో డాక్టర్ వ్యవహారం మీడియా దృష్టికి వచ్చింది.

Advertisement
 
Advertisement