కళల బంగారులోకం!

కళల బంగారులోకం!


గోల్డెన్ త్రెషోల్డ్.. ఒకప్పుడు ‘కవికోకిల’కు బంగారు వాకిలి. ఇప్పుడు కవిసంగమమ్, కవిపుంగవుల కవితా లోగిలి. సాంస్కృతిక వికాసానికి కేంద్రం. థియేటర్ ఆర్ట్స్‌కు వేదిక. కళాభిమానులకు నెలవు. ఇంకా చెప్పాలంటే.. అదో కొత్త ‘బంగారులోకం’! గోల్డెన్ త్రెషోల్డ్ నేపథ్యమిది. స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు తన 13వ ఏటనే 1300 లైన్ల ఇంగ్లిష్ కవితాఖండికను రాశారు. దాని పేరే గోల్డెన్ త్రెషోల్డ్. 1896లో లండన్‌లో, 1905లో హైదరాబాద్ అబిడ్స్‌లోని తన నివాసంలో ఆ కవితాఖండిక ఆవిష్కృతమైంది. అప్పటి నుంచి ఆమె నివాసం ‘గోల్డెన్ త్రెషోల్డ్’గా మారింది. మరిప్పుడు..!

 

గోల్డెన్ త్రెషోల్డ్‌లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పురుడుపోసుకుంది. యూనివర్సిటీ గచ్చిబౌలికి తరలిన అనంతరం ‘సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్’ విభాగాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు. లలిత కళలు, నృత్యం, రంగస్థల కళలు, మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినీవిద్యార్థులతో ఈ ఆవరణ నిత్యం ‘కళ’కళలాడుతోంది! కదిలే థియేటర్! వేర్లు స్థిరంగా ఉంటాయి. శాఖలు విస్తరిస్తాయి. ఈ సూత్రంతో పనిచేస్తోంది ‘థియేటర్ ఔట్‌రీచ్’.



నగర సాంస్కృతిక వేదికగా గోల్డెన్ త్రెషోల్డ్‌కు గుర్తింపు తేవడంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ అనంతకృష్ణన్ నేతృత్వంలోని టీం కృషి చేస్తోంది. ఇక్కడి రంగస్థల కళల శాఖలో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా రూపొందారు.

 

నేషనల్ థియేటర్ ఆఫ్ డ్రామాకు చెందిన వివిధ రాష్ట్రాల బృందాలు గోల్డెన్ త్రెషోల్డ్‌లో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఇక్కడ రూపొందించిన అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, మిస్ మీనా, పతంజలి నాటకోత్సవం, అప్సా రెయిన్‌బో తదితర నాటికలను  రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు తీసుకెళ్లారు! ఆయా ప్రాంతాలలోని కళాకారులను, కళాభిమానులను గోల్డెన్ త్రెషోల్డ్‌కు ఆహ్వానిస్తున్నారు. ఆరుబయలు రంగస్థలం, సమావేశ మందిరం, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు అనువైన హాల్ తదితర సౌకర్యాలను వివరిస్తున్నారు. ్టజ్ఛ్చ్టిట్ఛౌఠ్టట్ఛ్చఛిజి.ఛిౌఝ ద్వారా తమను సంప్రదించవచ్చని నిర్వాహకులు  సూచిస్తున్నారు.

 

కళల ‘సంగమమ్’


దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఈ ఆవరణ ఏదో ఒక  సాంస్కృతిక కార్యక్రమానికి వేదిక అవుతోంది. ఫేస్‌బుక్‌లో దాదాపు మూడువేల మంది సభ్యులు, అంతకు రెట్టింపు సంఖ్యలో పాఠకులు గల కవిసంగమమ్ సంస్థ సభ్యులు ముఖాముఖి కలుసుకునేందుకు తెలుసుకునేందుకు వేదిక ‘గోల్డెన్ త్రెషోల్డ్’! నెలనెలా స్థానిక,  జాతీయ, అంతర్జాతీయ కవులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పిట్టలుగా తామొస్తే చెట్టులా ‘గోల్డెన్ త్రెషోల్డ్’ ఆదరిస్తోందని కవిసంగమమ్ బాధ్యుడు యాకూబ్ కితాబునిచ్చారు!

 

నాటకరంగం కోసం అంకితమై పృథ్వీ థియేటర్ (ముంబై) రంగశంకర (బెంగళూరు) శ్రీరామ్‌సెంటర్ (న్యూఢిల్లీ) తరహాలో గోల్డెన్ త్రెషోల్డ్‌ను ‘పెర్‌ఫార్మింగ్ ఆర్ట్’ కేంద్రంగా మలచాలని థియేటర్ ఔట్ రీచ్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పెద్ది రామారావు నేతృత్వంలోని  రాజీవ్ వెలిచేటి, రాజీవ్ కృష్ణన్, విష్ణువర్ధన్, నస్రీన్, భాషా తదితరుల బృందం కృషి చేస్తోంది.   

పున్నా కృష్ణమూర్తి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top