ఆమె అతడి పతకం.. అతడు ఆమె శిఖరం
పిల్లలు తృప్తి, జననిలతో రేణుకుమార్ దంపతులు అతడు...బంగారు పతకాన్ని సాధించాడు.అదేం గొప్ప? అంతకు ముందే...ఆమె ప్రేమను సాధించాడు!ఆమె...అతడి ప్రేమను అంగీకరించింది.అదేం గొప్ప?పెళ్లికి ముందే...అతడి కోసం వంట నేర్చుకుంది! ఇద్దరిలో ఎవరు గొప్ప?అలా చెప్పలేం.ప్రేమ లోతు తెలుసుకోవాలంటే...సంసార సాగరం ఈదాలి.
పిల్లలు తృప్తి, జననిలతో రేణుకుమార్ దంపతులు అతడు...బంగారు పతకాన్ని సాధించాడు.అదేం గొప్ప? అంతకు ముందే...ఆమె ప్రేమను సాధించాడు!ఆమె...అతడి ప్రేమను అంగీకరించింది.అదేం గొప్ప?పెళ్లికి ముందే...అతడి కోసం వంట నేర్చుకుంది! ఇద్దరిలో ఎవరు గొప్ప?అలా చెప్పలేం.ప్రేమ లోతు తెలుసుకోవాలంటే...సంసార సాగరం ఈదాలి.
ప్రేమ ఎత్తు తెలుసుకోవాలంటే...‘మనసే జతగా’ సాగాలి.
ఆ అబ్బాయిని చూసినవాళ్లందరూ ‘మరుగుజ్జు’ అంటూ జాలిచూపారు, కానీ ఆమె మాత్రం అతనిలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసింది. ఇంకేముంది మాట లు కలిశాయి, ఆపై మనసులూ కలిశాయి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండడానికి ‘మనసుల కలయికే’ ప్రధానం కానీ అందం, ఆస్తి ఇవేవీ ముఖ్యం కాదని పెద్దలకు సైతం నచ్చజెప్పారు. అయిష్టంగానే ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. పెళ్లైన తర్వాత తన మనసులోని ఆశయాలను ఆమె దగ్గర బయటపెట్టాడు. శ్రమిస్తే సాధించలేనిది లేదని ‘నీ వెంటనేనున్నాను’ అని అతనికి ధైర్యం చెప్పింది. అతని ఆశయాలకు ఆమె ఊతంగా మారి అతన్ని విజయాల బాటలో నడిపిస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం ఏడడుగులు వేసిన ఆ దంపతులే సునీత, రేణుకుమార్. భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో 2013-ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో జావెలిన్ త్రోలో బంగారుపతకంతో పాటు డిస్క్ త్రోలో సిల్వర్, షాట్‌పుట్‌లో కాంస్యం సాధించారు రేణు కుమార్. ఈ దంపతుల అన్యోన్య దాంపత్యంలోని సరిగమలివి.
మొదట్లో సందేహించాను...
మా ఇల్లు ‘బెంగళూరు కంఠీరవ’ స్టేడియం ఎదురుగా ఉండేది. అక్కడకు క్రీడాసాధన చేసే ఆటగాళ్లను ప్రతిరోజూ గమనించేవాడిని. అలా క్రీడలపై ఆసక్తి కలిగింది. పరిస్థితులు నా ఆసక్తి, ఆశయాల నుంచి నన్ను దూరం చేశాయి. నా తమ్ముడు, నేను మరుగుజ్జులుగా ఉండడం, అదే సమయంలో నాన్న చనిపోవడంతో అమ్మకు మతిస్థిమితం లేక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పడే మా బంధువులు... దొమ్ములూరు (బెంగళూరులోని ఒక ప్రాంతం) తీసుకువచ్చి పెంచారు. పదోతరగతి వరకూ చదువుకున్నాను. అటుపై చదువు సాగలేదు. అప్పటినుండి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ, నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించాను. ఆ సమయంలోనే మా కాలనీలోనే ఉండే సునీతతో పరిచయమైంది. ఎప్పుడూ ఆమెతో మాట్లాడాలని, ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలని అనిపించేది. ఏదో ఒక రకంగా మాట కలుపుతూ, స్నేహాన్ని పెంచుకున్నాను. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమెతో జీవితాన్ని పంచుకోవాలన్న నా తపనను చెబుదామనుకున్నాను. తను కాదంటుందేమోనని సందేహించాను. ఆమెను వదులుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే ఒకరోజు ధైర్యం చేసి ‘నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని చెప్పేశాను. మొదట్లో అవుననలేదు, కాదనలేదు. తర్వాత ఆరునెలలకు ఓకే చెప్పింది. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు’ అంటూ తన తొలిప్రేమ జ్ఞాపకాలను చెప్పారు రేణుకుమార్.
అన్నీ తానే అయ్యాడు...
రేణు మాటల్లో నిరాశ కనిపించేది కాదు. అదే నన్ను ప్రేమించేలా చేసిందేమో! రేణు ప్రేమను అంగీకరించిన తర్వాత అందరిలాగ సినిమాలు, పార్కులు మామూలే. అయితే ఇవన్నీ ఇద్దరి ఇంటిలో తెలియకుండానే జరిగేవి. కొన్నాళ్ల తర్వాత ధైర్యం చేసి మా తల్లిదండ్రులకు విషయం చెప్పేశాను. అయిష్టంగానే వారు పెళ్లికి అంగీకరించారు. అమ్మానాన్నల ప్రేమకు దూరమైన నన్ను... రేణు అన్నీ తానై చూసుకున్నాడు. మా పెళ్లైన మూడేళ్ల తరువాత నేను అమ్మను కాబోతున్నానని తెలిసింది. ఈ వార్త మా ఇద్దరిలో ఎంత సంతోషాన్ని కలిగించిందో అంతే భయాన్ని కూడా నింపింది. డాక్టర్‌ను కలిసి పరీక్షలన్నీ జరిపిన తర్వాత, బిడ్డ ఆరోగ్యంగానే ఉందని తెలుసుకోవడంతో ఆ భయం పోయింది. బిడ్డ జన్మించిన తర్వాత కూడా చూడటానికి ఎవరూ రాలేదు.
మంచంపై బాలింతగా ఉన్న నాకు అమ్మలా సపర్యలు చేశాడు (ఈ మాటలు చెబుతున్నప్పుడు సునీత కళ్లలో చిన్న నీటి పొర తొంగి చూసింది)... అంటూ తన భర్త తనపై చూపిన అనురాగాన్ని చెప్పుకొచ్చారు సునీత. వెంటనే రేణుకుమార్ అందుకుని... ‘కుటుంబం కోసం తాను చేసిన త్యాగం ముందు నేను చేసింది చాలా తక్కువ. నా శరీర ఆకృతిని అనుసరించి చిన్నచిన్న పనులు మాత్రమే చేయగలిగేవాడిని. వచ్చే డబ్బులు సరిపోయేవి కావు. ఇలాంటి సమయంలో కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకుంది సునీత. తను నాకు అందించిన భరోసా, ప్రేమలతో పోలిస్తే నేను చేసింది, చేస్తున్నది చాలా తక్కువే’ అని రేణు అంటున్నప్పుడు, అతని కళ్లలో సునీతపై ఉన్న అనురాగంతో పాటు ఆమె పట్ల ఉన్న కృతజ్ఞతాభావం కూడా కనిపించింది.
సరదానే ఉపాధిగా మారింది...
సరదా కోసం నేర్చుకున్న కొన్ని విషయాలు చాలామందికి ఉపాధి మార్గాలుగా మారతాయి. రేణుకుమార్, సునీత దంపతుల విషయంలోనూ అదే జరిగింది. ఈ విషయాన్ని సునీత వివరిస్తూ...‘మా ఇంట్లో నేనొక్కదాన్నే అమ్మాయిని కావడంతో గారాబంగా చూసుకునేవారు. స్కూలు అయిపోగానే స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. అందుకే నాకు ఇంటి పని, వంటపని అస్సలు తెలిసేది కాదు. మా పక్కింట్లోనే ఉన్న రేణు వాళ్ల అక్కతో మా అమ్మ ఒకసారి, నాకు పనులేవీ రావని, వంట అస్సలు చేతకాదని, రేపు పెళ్లి చేస్తే ఎలా చేయాలో తెలియడం లేదని చెప్పింది. ఈ మాటలన్నీ రేణు వినేశాడు. ‘ వంట రాని అమ్మాయిని పెళ్లి చేసుకోను’ అని చెప్పి వెళ్లిపోయాడు. రేణు అన్న మాటలకు ముందు బాధపడినా ఆ తరువాత నాలో పట్టుదల పెరిగింది. మా అమ్మ దగ్గరికెళ్లి వంట నేర్పమన్నాను. వంటల పుస్తకం తెచ్చుకొని రకరకాల వంటలు బట్టీపట్టేశాను. రెండు వారాలు తిరిగేసరికి ఓ పెద్ద క్యారేజ్‌లో నేను చేసిన వంటలను రేణుకు పంపాను. నా వంటలన్నీ బాగున్నాయని మెచ్చుకున్నాడు. అలా రేణు కోసం నేను నేర్చుకున్న వంట మాకు ఉపాధిగా మారింది. వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాను’ అని చెప్పారు సునీత.
నగలు తాకట్టు పెట్టి....
మా ఆర్థిక పరిస్థితి కొంత కుదుట పడగానే ఆటలపై ఉన్న ఆసక్తి గురించి సునీతకు చెప్పాను. తను నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. ఇంటికి దగ్గరగా ఉన్న చిన్న గ్రౌండ్‌లోనే షాట్‌పుట్, డిస్క్ త్రో, బ్యాడ్మింటన్, పరుగు పందాల్లో సాధన ప్రారంభించాను. ఇంతలో మాలాంటివారి కోసం ప్రపంచ క్రీడాపోటీలు జరుగుతున్నాయని తెలుసుకుని కోచ్ సహాయంతో సాధన పెంచాను. నాతో పాటు నా తమ్ముడు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొనేవాడు. సమయానికి డబ్బులు అందకపోవడంతో 2009లో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాం. ఆ సమయంలో నా భార్య ఇచ్చిన ధైర్యం మరువలేనిది. 2013లో మళ్లీ మిచిగాన్‌లో ప్రపంచ డ్వార్ఫ్ క్రీడాపోటీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో పాల్గొనేందుకు విమాన టికెట్టు ఖర్చులను ప్రభుత్వం ఇచ్చినా... వీసా తదితర ఖర్చుల కోసం సునీత తన మంగళసూత్రంతో సహా నగలను తాకట్టు పెట్టి సుమారు 40 వేలు సమకూర్చింది. అప్పుడే అనుకున్నాను... నేను పతకాలతోనే తిరిగిరావాలని. ఈ ఏడాది నేను మిచిగాన్‌లో మూడు పతకాలు గెలవడానికి నాభార్య సునీతే కారణమని గర్వంగా చెబుతాను.
బాధ్యతగా భావించా!
ఆయన ఆశలను నెరవేర్చడం నా బాధ్యతగా భావించాను. నా భర్త క్రీడల్లో పాల్గొనాలి, డబ్బులేకపోవడం వల్ల ఆయన ఆశయాలు ఆగిపోకూడదనే అలోచనతో నేను నగలను తాకట్టుపెట్టి డబ్బు సమకూర్చాను. నా వారికి నేను చేసుకోవడం గొప్పేమీ కాదు’ అంటూ తమ మధ్య ఉన్న సఖ్యతను తెలియజేశారు సునీత.
చెంప ఛెళ్లుమనిపించా...
మా మొదటిపాప కడుపులో ఉన్నప్పుడు, పూర్తిగా నెలలు నిండి, నొప్పులు వస్తున్నట్లు అనిపించేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్లాం. కానీ కాన్పు కాలేదు. అలా మూడు రోజుల పాటు వరుసగా హాస్పిటల్‌కి వెళ్లడం, కాన్పు కాకుండానే వెనక్కిరావడం. నాలుగోసారి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. రేణును ఒకసారి చూడాలని డాక్టర్‌తో చెబితే ఆయన్ను పిలిపించారు. నేను నొప్పులతో విలవిల్లాడుతుంటే... ‘కంగారు పడాల్సిందేమీ లేదు. ఇంతకుముందులాగే ఇప్పుడు కూడా కాన్పు కాకుండానే డాక్టర్‌గారు ఇంటికి పంపించేస్తారులే’ అన్నాడు. అంతే! ఆయన చెంప చెళ్లుమనిపించాను.
తను హాస్యానికే అన్నా నాకు మాత్రం కోపం వచ్చింది. తను ఆ సమయంలో అలా మాట్లాడినందుకు, ఆ తర్వాత చాలా బాధపడ్డాడు. నేను తొందర పడినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇప్పుడు వీరి ముందున్న లక్ష్యం ఒక్కటే... ఇద్దరు బిడ్డల్నీ చక్కగా చదివించుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమలా తమ బిడ్డలు కూడా చదువుకు దూరం కాకూడదు. ఆ ఆశయంతోనే శ్రమిస్తున్నామని చెప్పారు సునీత, రేణుకుమార్.
- బేల్దార్ సజ్జేంద్ర కిషోర్, స్టాఫ్ రిపోర్టర్, బెంగళూరు
ఫొటోలు: ధనుంజయ టి.కె.
భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు వారి మధ్య అనుబంధాన్ని మరింత పెంచాలి గానీ అగాధాన్ని సృష్టించకూడదు. గలగలా నవ్వేస్తూ మాట్లాడితే ఎంత పెద్ద గొడవ అయినా చల్లబడిపోతుంది.
- రేణుకుమార్
నాకు కాస్త కోపం ఎక్కువ. తప్పు నా వైపున ఉన్నా కూడా ఒక్కొక్కసారి మావారే నన్ను దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తారు. తనమాటలతో నా కోపాన్ని ఇట్టే పోగొట్టేస్తారు.
- సునీత


