అదిగో భద్రాద్రి..


రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రణాళిక    

 - భక్తుల మదిని దోచేలా ఆధునీకరణ పనులు

- రెండు వేల మందికి సరిపడా వసతి ఏర్పాట్లు  

భద్రాచలం


 

భారతా వనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైనది భద్రాచల క్షేత్రం.  గోదావరి నదీ తీరాన శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేతంగా వెలిసిన ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఓ వైపు గోదావరి గలగలలు మరో వైపు చారిత్రిక నేపథ్యం గల పర్ణశాల కుటీరం... ఇంకో వైపు పాపికొండల సోయగాలు ఇలా ప్రకృతి రమణీయతతో కూడిన భద్రాచలం ప్రాంతాన్ని ఒక్క సారైనా చూడాల్సిందే...గోదావరి స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంత సేదతీరాల్సిందే..   



త్రేతాయుగమున దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేయుచున్న సీతారాములకు, ఒకనాటి విహార సమయాన విశ్రాంతి స్థానమైన ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి, వారి అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల, బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి ,మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యంలో ఘోరతపస్సు నాచరించెను.


 


ఆ తప ప్రభావంతో శ్రీమన్నారాయునుడు మరలా శ్రీ రామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంక చక్ర దనుర్భాణములను దరించి, వామాంకమున(ఎడమ తొడపై) సీతతో, వామ పార్శమున(ఎడమ ప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. పిమ్మట భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆభద్రుని హృదయ స్థానమున వెలిసెను. భద్రుని కొండ అయినందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు. స్వామికి భద్రాద్రి రాముడని, వైకుంఠము నుంచి సాక్షాత్తుగా అవతరించుట చేత వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు ‘అ’కార ‘ఉ’కార ‘మ’కార స్వరూపములు అయినందున ఓంకార రాముడని, శంఖ చక్ర దనుర్భాణములు ధరించుటచే రామ నారాయణుడు అని కూడా పేర్లు కలవు.   




దశాబ్దాల కోవెలకు ఎన్నో మార్పులు...

  16వ శతాబ్ధంలో భద్రాద్రిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆ నాటి నుంచి నేటి వరకు ఎన్నో మార్పులను సంతరించుకుంది. భద్రుని ఘోర తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుడు శంకు, చక్ర, ధనుర్బాణాలతో చదుర్భుజ రామునిగా కొండపై సాక్షాత్కరించారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు పుట్టలో ఉన్న శ్రీరామున్ని చూసి తాటాకు పందిరి వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో పాల్వంచ పరగణా తహశీల్దార్‌గా ఉన్న కంచర్ల గోపన్న ఆరు లక్షల రామమాడలు వెచ్చించి రామాలయాన్ని నిర్మించారు. 1958లో భద్రాద్రి రామాలయం ధర్మాదాయ శాఖ పరిధిలోనికి వచ్చింది. దీంతో 1960లో తొలిసిరిగా రామాలయాన్ని పునరుద్దరించే కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి కల్లూరి చంద్రమౌళి చేపట్టారు. ఈ క్రమంలోనే రాజగోపురం, కల్యాణ మండపం, చిత్రకూట మండపం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వీటిని సంప్రదాయోక్తంగా ప్రారంభించారు. అనంతర కాలంలో ఆలయాభివృద్ధి పేరిట పరిసర ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ప్రధానంగా చెప్పదగ్గ భద్రాచలం తాజాగా కొత్తగూడెం జిల్లాలో కొంగెత్తుగా రూపాంతరం చెందుబోతోంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.100 కోట్లు మంజూరైతే ఆలయం మరింతగా అభివృద్ధి చెందనుంది.  




భక్తుల మది దోచేలా ఆధునీకరణ..

రాములోరి క్షేత్రమున్న కొత్తగూడెం జిల్లా దేశవ్యాప్తంగా కీర్తిగడించనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన రూ.100 కోట్లతో భక్తుల మదిని దోచేలా ఆలయాన్ని ఆధునీకరించేందుకు దేవాదాయశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.  




రెండో ప్రాకార మండపం..

 రామాలయంలో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపానికి బయట మరో ప్రాకార మండపం నిర్మించేందుకు దేవస్థానం అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా పోర్టికో మాదిరిగా సుమారు 30 అడుగులకు పైగా బయటకు జరిపి ప్రాకారాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. స్వామి వారి వెండిరథ సేవ, ఇతర పూజాది కార్యక్రమాలన్నీ దీనిలో జరిగేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రాకారం ముందుకు జరుగుతున్నందున మాడవీధులు కూడా విస్తరించాల్సి ఉంటుంది.  



లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాభివృద్ధి..

 రామాలయానికి ఎదురుగా ఉన్న  పురాతన లక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రామాలయం నుంచి నేరుగా లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి వెళ్లేలా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో అటుగా వెళ్లే వారికి గోదావరి అందాలు కనువిందు చేయనున్నాయి.



భక్తుల వసతికి పెద్ద పీట..

 భద్రాచలం వచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా వసతి కల్పించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్నీ కలుపుకొని 200 గదులు అందుబాటులో ఉన్నాయి.  శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల సమయంలో ఇవి సరిపోక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.100 కోట్లలో వసతి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించేలా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 15 వేల నుంచి 20 వేల మంది వేచి ఉండేలా గదులు, సత్రాలు, కల్యాణ మండపాలను నిర్మించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులు యోచిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top