బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'

బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'

  • కొత్త నోట్లతో కమీషన్ దందా నడిపిన వారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ

  • తెలంగాణ, ఏపీల్లో వెయ్యికి పైగా బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి స్కామ్

  • అనుమానంతో ఆరా తీసిన ఆర్‌బీఐ

  • అక్రమాలు నిజమేనని నిర్ధారణ

  • నగదు మార్పిడికి వచ్చిన వారి ఐడీలను జిరాక్స్ తీసిన బ్యాంకు మేనేజర్లు

  • వాటినే మూడు నుంచి ఐదుసార్లు వాడి డబ్బులు విత్‌డ్రా

  • ఆ మొత్తం కమీషన్‌పై నల్లకుబేరులకు అందజేత

  • సీబీఐకి ఫిర్యాదు చేసిన రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి

  • సాక్షి, హైదరాబాద్

    పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన నగదు మార్పిడి లావాదేవీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుందని రిజర్వు బ్యాంక్ గుర్తించింది. అనుమానం ఉన్న ప్రాంతాలు, వాటి బ్యాంక్ శాఖలను గుర్తించి లీడ్ బ్యాంక్‌లను అప్రమత్తం చేసింది. నగదు మార్పిడికి సంబంధించి నవంబర్ 10-15 మధ్య జరిగిన లావాదేవీలకు చెందిన అన్ని రకాల డాక్యుమెంట్లు, సీసీ కెమెరాల ఫుటేజీలను తెప్పించుకోవాలని సంబంధిత బ్యాంకుల ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ముంబైలోని రిజర్వు బ్యాంక్ విజిలెన్‌‌స విభాగం పర్యవేక్షించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకుని ఏపీలోని అనేక ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో నగదు మార్పిడి పేరుతో భారీగా కొత్త రూ.2 వేల నోట్లను, రూ.100 నోట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలను సమర్పించింది.

     

     నవంబర్ 10-15 మధ్య బ్యాంకుకు ఒకరోజు నగదు మార్పిడికి వచ్చిన వారే వరుసగా మూడు రోజుల పాటు వచ్చి నగదు మార్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ల నుంచి తెప్పించిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమైంది. ఉదాహరణకు మొదటి రోజున రెండు వేల మంది నగదు మార్పిడి చేసుకుంటే వారిలో 1,000 మందికి సంబంధించిన ఐడీలను జిరాక్స్ తీసి, మళ్లీ వాటినే సమర్పించి బ్యాంక్ మేనేజర్లు నగదును విత్‌డ్రా చేశారు. నల్లకుబేరులు తెచ్చిన పాత నోట్లు తీసుకుని విత్‌డ్రా చేసిన ఈ కొత్త నగదును సమర్పించారు. ఇందుకుగాను నల్లకుబేరుల నుంచి సంబంధిత బ్యాంక్ సిబ్బందికి 20 నుంచి గరిష్టంగా 35 శాతం వరకు కమీషన్ లభించింది.

     

    వెయ్యికి పైగా శాఖల్లో స్కాం

    విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యికి పైగా వివిధ బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి కుంభకోణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించిన ఆర్‌బీఐ విజిలెన్‌‌స విభాగం చెన్నైలోని సీబీఐ కార్యాలయానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సీబీఐ విచారణ కోసం అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందజేసింది. ఆయా బ్యాంక్‌ల నుంచి నగదు మార్పిడి చేసుకున్న ఆధార్ ఇతర ఐడీ కార్డు హోల్డర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లను కూడా సమర్పించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. మచ్చుకు నగదు మార్పిడి చేసుకున్న కొందరు గుర్తింపు కార్డుదారులకు ఫోన్లు చేసి వారి నుంచి సమాధానాలు రాబట్టింది.

     

    జిరాక్స్‌లతో జిమ్మిక్కులు..

    నగదు మార్పిడికి వెళ్తే అందుకు సమర్పించే గుర్తింపు కార్డు పత్రం ఏదైనా దాని జిరాక్స్‌పై  తకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అదే సంతకంతో కూడిన జిరాక్స్ పత్రం ఇస్తే బ్యాంక్‌లు తిరస్కరించాలి. వారికి నగదు మార్పిడి చేయకూడదు. కానీ దేశవ్యాప్తంగా జరిగినట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అక్రమ తతంగం చోటు చేసుకుంది. మొదటి మూడు రోజులు వచ్చిన గుర్తింపు కార్డులనే జిరాక్స్ తీసి కొందరు బ్రాంచ్ మేనేజర్లు కొత్త రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు.


    బ్యాంకుల నుంచి రూ.10 వేలు నగదు తీసుకోవడమే గగనమైన పరిస్థితుల్లో లక్షలకు లక్షలు కొత్త ధనం కమీషన్ ప్రాతిపదికన సమరూరుస్తామంటూ అనేక మంది పుట్టుకొచ్చారు. కొన్నిచోట్ల రూ.2 వేల నోట్లు లక్షల్లో పోలీసులకు పట్టుబడ్డాయి. ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో రూ.50 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు కనిపించాయి. హైదరాబాద్ రిజర్వుబ్యాంక్‌లోని కొందరు అధికారులకు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. ఏటీఎంలకు తరలించేందుకు ఉద్దేశించిన నగదును బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ అధికారిని ఇప్పటికే విధుల నుంచి తప్పించారు.

     

    స్కాం విలువ ఎంత?

    దాదాపు వెయ్యికి పైగా బ్యాంక్ శాఖల్లో ఈ కుంభకోణం చోటుచేసుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మొత్తం సొమ్ము ఎంత ఉంటుందన్నది తెలియడం లేదు. రూ.2 వేల నోట్ల విషయంలో రిజర్వుబ్యాంక్ వద్ద కచ్చితమైన లెక్కలున్నా.. అప్పటికే బ్యాంక్‌ల వద్ద ఉన్న రూ.100 నోట్లపై స్పష్టత లేదు. మొత్తం రికార్డులు పరిశీలించి వాటిలో వాస్తవంగా ప్రజలు చేసుకున్న నగదు మార్పిడి ఎంత అన్నది ధృవీకరిస్తే గానీ ఈ స్కామ్ లోతు చెప్పలేమని అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని రెండు బ్యాంక్ శాఖల్లో జరిగిన లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

     

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్ శాఖల్లో కూడా ఇదే జరిగింది. దీంతో రిజర్వుబ్యాంక్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బ్యాంక్ యాజమాన్యాలకు లేఖలు రాసినట్లు తెలిసింది. అన్నీ ఒక కొలిక్కి వస్తే అక్రమార్కులను గుర్తించి వారు ఎవరికి నగదు సమకూర్చారనే వివరాలు రాబట్టాలన్నది కేంద్ర ఆర్థిక శాఖ వ్యూహంగా ఉంది. నగదు మార్పిడి అక్రమాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేరుగా సీబీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘‘ఇప్పటికిప్పుడే ఈ కేసు కొలిక్కి వస్తుందనుకోవడం లేదు. నెల లేదా మూడు మాసాలు పట్టొచ్చు.. కానీ ఏ ఒక్కరూ దీని నుంచి తప్పించుకోలేరు’’ అని సీబీఐ సీనియర్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం విచారణ అత్యంత గోప్యంగా ఉంటుందని, వివరాలు బయటకు వెల్లడించబోమని ఆయన పేర్కొన్నారు.

     

    సార్.. మీరు ఎన్నిసార్లు నోట్లు మార్చుకున్నారు?

    నల్లగొండలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జూలకంటి శ్రీనివాసరెడ్డి.. పెద్ద నోట్లు రద్దు తర్వాత పదో తేదీన తన వద్ద ఉన్న కొద్ది మొత్తంలోంచి రూ.4 వేలు మార్చుకునేందుకు ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు వెళ్లారు. భారీ క్యూలో నిలబడ్డ ఆయనకు నాలుగు గంటల తర్వాత రెండు రూ.2 వేల నోట్లు లభించాయి. మిగిలిన మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అకస్మాత్తుగా గత సోమవారం ఆయనకు చెన్నై నుంచి ఓ ఫోన్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారూ.. మీరు ఫలానా బ్యాంక్‌కు వెళ్లి పెద్దనోట్లు ఎన్ని సార్లు మార్చుకున్నారని అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. తాను ఒక్కసారే వెళ్లానని భయం భయంగా చెప్పాడు. మొదటి రోజు సమర్పించిన పత్రాన్ని జీరాక్స్ తీసి మరుసటి రోజు బ్యాంక్‌కు వెళ్లి ఇవ్వ లేదా? అని అడగ్గా.. లేదని సమాధానం చెప్పాడు. ‘థ్యాంక్స్ అండీ..’ అని అవతలి నుంచి ఫోన్ కట్ అయింది.

     

    ఇలా జిరాక్స్ పత్రాలు సమర్పించి నగదు పొందిన అనేక మందిని అధికారులు ఇలా ఫోన్ల ద్వారా విచారిస్తున్నారు. తదుపరి సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తారు. వారు ఏ రోజున బ్యాంక్‌కు వచ్చిందీ రానిదీ ఆ ఫుటేజ్‌లో ఉంటుంది. ఇక ఎక్కడ ఎంత మొత్తంలో అక్రమార్కులకు చేరిందన్న దానిపై రిజర్వుబ్యాంక్ నగరాలు, పట్టణాల వారీగా వర్గీకరణ చేసింది. రూ.3 కోట్లు అంతకంటే ఎక్కువ బ్లాక్ మార్కెట్‌కు చేరిన వాటిలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. రూ.2 కోట్ల మొత్తం బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లిన జాబితాలో వరంగల్, కరీంనగర్, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, శ్రీకాకుళం, కడప, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. రూ.కోటి అంతకంటే తక్కువ కాజేసిన జాబితాలో రాజమండ్రి, ఒంగోలు, నల్లగొండ, నంద్యాల, మంచిర్యాల, ఖమ్మం వంటివి ఉన్నారుు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top