ఫీజుల ఒత్తిడి.. నారాయణ విద్యార్థినికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

ఫీజుల ఒత్తిడి.. నారాయణ విద్యార్థినికి అస్వస్థత

Published Thu, Jan 31 2019 8:57 AM

Narayana College Student Illness With Management harassment - Sakshi

శ్రీకాకుళం  , కాశీబుగ్గ: కాశీబుగ్గ నారాయణ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గేదెల వెన్నెల కళాశాల యాజమాన్యం తీరుతో అస్వస్థతకు గురైంది. వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారిథికి చెందిన గేదెల మన్మధరావు, రాజేశ్వరిల కుమార్తె వెన్నెలను కళాశాల యాజమాన్యం ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసింది. అయితే తిత్లీ ధాటికి ఉన్నదంతా పోవడంతో తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థిని తీవ్ర ఒత్తిడికి గురై ఇంటి వద్ద స్పృహ కోల్పోయింది.

వెంటనే స్థానికులు ఆ మెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల నేతలు కళాశాల వద్ద ఆందోళన చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్‌కుమార్, సీఐటీయూ నెయ్యిల గణపతి, జిల్లా అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు, ప్రగతిశీల కార్మిక సంఘ నాయకులు పుచ్చ దుర్యోధన, గ్రామస్తురాలు అరుణ, కొర్రాయి నీలకంఠం తదితరులు కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావును నిలదీశారు. అయితే అటువైపు నుంచి మాత్రం సరైన సమాధానం రాలేదు.

ఆమె మూడు రోజులుగా రావడం లేదు
ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న వెన్నెల మూడు రోజులుగా కాలేజీకి రావడం లేదు. ఆమె డయాబెటిక్‌ పేషెంట్‌. ఇన్సులిన్‌ లేకపోవడం వల్ల పడిపోయింది. ఆమెపై ప్రత్యేకించి ఒత్తిడి చేయలేదు. అందరినీ అడిగినట్టే అడిగాం.– తిరుపతిరావు, ఏజీఎం,నారాయణ విద్యాసంస్థ

Advertisement
 
Advertisement