నందికొండ పోదామా.. | Sakshi
Sakshi News home page

నందికొండ పోదామా..

Published Tue, Feb 25 2014 4:21 AM

నందికొండ పోదామా..

 నందికొండ.. అది ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేల... బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతం.. కృష్ణమ్మ పరవళ్ల నడుమ.. ఎత్తయిన కొండల మధ్య విస్తరించి ఉన్నదే నాగార్జునకొండ.  దానిపై నెలకొల్పిన మ్యూజియంలో ఇక్ష్వాకులు, శాతవాహన కాలం నాటి చరిత్రకు సాక్ష్యాలైన అనేక కళాఖండాలు దర్శనమిస్తాయి.
 

 

నాగార్జునసాగర్ జలాశయంలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రాంతమే నాగార్జున కొండ(నందికొండ). ఈ కొండపై 1966లో మ్యూజియం ప్రారంభించారు. ఇందులో 1923 నుంచి 1960 వరకు సాగిన తవ్వకాల్లో దొరికిన క్రీస్తు శకం 3,4 శతాబ్దాలకు చెందిన ఇక్ష్వాకులు, శాతవాహనుల కాలం నాటి శిల్పాలు, శిలాఫలకాలు, చారిత్రక వస్తువులను భద్రపరిచారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తుశకం మూడో శతాబ్దం వరకు నాగార్జునకొండ దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ భౌద్ధకేంద్రంగా విరాజిల్లింది.

 

ఇది ప్రముఖ బౌద్ధతాత్వికుడు, దార్శనికుడు ఆచార్య నాగార్జునుడి పేరిట ప్రసిద్ధికెక్కింది. మహాయాన బౌద్ధమతధర్మ వ్యాప్తికి ఇక్కడి విజ్ఞాన కేంద్రం ఎంతో దోహద పడింది. చైనా, శ్రీలంక దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి ధార్మిక విద్యాభ్యాసం చేసేవారని చరిత్ర చెబుతోంది. నాగార్జున విశ్వవిద్యాలయం, చైత్యగృహాలు, స్థూపాలు, మంటపాలు, విహారాలు, పాలరాతి కట్టడాలు, బౌద్ధశిల్పాలు ఇక్కడి తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిలో స్థూపాల్ని పోలిన తొమ్మిది నిర్మాణాలు చెప్పుకోదగినవి. ఇవి చక్రాకారంలో నిర్మితం కావడం విశేషం. ఇందులోమహాచైత్యం అత్యంత ప్రముఖమైనది.

 

  1955లో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం వల్ల వీటిపై పెద్ద జలాశయం ఏర్పడింది. ఆ చారిత్రక అవశేషాలను పరి రక్షించేందుకు నందికొండకు తరలించి మ్యూజియంలో భద్రపరిచారు. అయితే వీటిలో కొన్ని శిల్పాలు, విశేషాలను మద్రాస్ మ్యూజియానికి, మరికొన్నింటిని బ్రిటిష్‌వారు లండన్ మ్యూజియానికి తరలించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement