జయలలిత మృతిపై విచారణకు సిద్ధం: అపోలో చైర్మన్‌ | Sakshi
Sakshi News home page

జయలలిత మృతిపై విచారణకు సిద్ధం: అపోలో చైర్మన్‌

Published Sat, Feb 4 2017 8:39 AM

జయలలిత మృతిపై విచారణకు సిద్ధం: అపోలో చైర్మన్‌ - Sakshi

చెన్నై: అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్‌ 5న కన్నుమూశారు. అయితే ఆమెకు అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే చీఫ్‌ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ కొంతమంది ఈ విషయంపై మాట్లాడుతూనేఉన్నారు. అలాంటివాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రతాప్‌ సి రెడ్డి అన్నారు. శుక్రవారం చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని, ప్రసంగించిన ఆయన.. విచారణ జరిపితేగనుక, మాజీ సీఎం మరణానికి సంబంధించిన అన్నివివరాలను అందజేస్తామని చెప్పారు. ఈ విషయంలో దాగుడుమూతలకు తావులేదని తెలిపారు. తాను మొదటి నుంచి చెపుతున్నట్లే.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత గుండెపోటుకు గురికావడం వల్లే జయ చనిపోయారని మరోసారి స్పష్టంచేశారు. చికిత్సలో భాగంగా జయలలిత కాళ్లు తొలిగించారనే వార్తలు నిజం కావని ప్రతాప్‌.సి.రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement