కొందామన్నా.. అమ్మేవారేరీ?


* విద్యుత్ కొనుగోలు టెండర్లకు స్పందన కరువు

* డిస్కంల అంచనాలు తలకిందులు

* 500 మెగావాట్ల తక్షణ టెండర్లకు బిడ్లు దాఖలైంది 10 మెగావాట్లకే

* బిడ్ వేసిన ఆ ఒక్క సంస్థ కూడా ఒప్పందంపై వెనుకడుగే!

* 2000 మెగావాట్ల వార్షిక టెండర్లకు 618 మెగావాట్ల సరఫరాకే బిడ్లు

* ఉత్తరాది సంస్థలు ముందుకొచ్చినా సరఫరాకు కారిడార్ కరువు

* తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా ప్రైవేటు కంపెనీలపై ఏపీ అధికారుల ఒత్తిడి.. రబీలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రం



సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే తీవ్ర విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న తెలంగాణ.. ఇప్పుడప్పుడే బయటపడే సూచనలు కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా... సరఫరా చేయడానికి విద్యుదుత్పత్తి సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో విద్యుత్ కొనుగోలు టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు పిలవటం ఆలస్యం కావటంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ సంస్థలు తమ చేజారకుండా కట్టడి చేయటంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సరఫరాకు ముందుకొచ్చిన కంపెనీలు కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖం చాటేశాయి. దీంతో రబీ సీజన్‌లో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మితిమీరిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.



కంగుతిన్న డిస్కమ్‌లు..

డిస్కమ్‌ల తరఫున టీఎస్ ఎస్‌పీడీసీఎల్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గత నెలలో టెండర్లు పిలిచింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో బిడ్లు ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు అక్టోబర్ చివరి వారం వరకు గడువు విధించింది. దీంతో రబీ అవసరాలకు విద్యుత్ కొరతను అధిగమించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఈ టెండర్లలో పాలుపంచుకునేందుకు ప్రైవేటు థర్మల్ విద్యుత్ సంస్థలు ముందుకు రాలేదు.



కేవలం ఒకే ఒక్క సంస్థ అది కూడా 10 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దీంతో డిస్కమ్‌ల అధికారులు కంగు తిన్నారు. గడువు ప్రకారం ఈ సంస్థ నవంబర్ ఒకటో తేదీ నుంచే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ డిస్కమ్‌తో ఒప్పందానికి ముందుకు రాలేదని సమాచారం. దీంతో 500 మెగావాట్ల కొనుగోలు లక్ష్యం నీరుగారిపోయింది.



వార్షిక కొనుగోళ్లదీ అదే దుస్థితి..

తక్షణ విద్యుత్ కొనుగోలు టెండర్లకు ముందే ఏడాది పాటు విద్యుత్ సరఫరా కోసం నిర్వహించిన టెండర్లు సైతం... కంపెనీల నిరాసక్తతతో చేదు ఫలితాలనే ఇచ్చాయి. రాష్ట్ర జెన్‌కో విద్యుత్ కేంద్రాలతో పాటు ప్రభుత్వ రంగంలోని విద్యుత్ కేంద్రాలు, కేంద్రం నుంచి వచ్చే వాటా పోగా... రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేసేందుకు ఏటా 2 వేల నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడం తప్పనిసరి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వచ్చే ఏడాది విద్యుత్ సరఫరా కోసం ముందుగానే టెండర్లను పిలవడం ఆనవాయితీ. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4,000 మెగావాట్ల సరఫరా కోసం టెండర్లు పిలవగా.. దాదాపు 2,000 మెగావాట్ల సరఫరాకు కంపెనీలు ముందుకొచ్చాయి.



ప్రస్తుతం ఆ ఒప్పందాల ప్రకారమే ఆయా కంపెనీల నుంచి రెండు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. విభజన తర్వాత ప్రక్రియ నత్తనడకన సాగింది. జూలైలోనే టెండర్లు పిలవాల్సి ఉంటే.. తెలంగాణ విద్యుత్ శాఖ ఆగస్టులో 2,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచింది. ఏపీ మాత్రం అప్పటికే 2,000 మెగావాట్లకు టెండర్లు పిలిచి, ఒకరోజు ముందే గడువును ముగించింది. దీంతో ఎక్కువ కంపెనీలు అక్కడ టెండర్లు దాఖలు చేయగా.. తెలంగాణలో నామమాత్రంగా దాఖలయ్యాయి. రాష్ట్ర పరిధిలోని కంపెనీలు కేవలం 288 మెగావాట్ల సరఫరాకు బిడ్లు దాఖలు చేయగా.. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీలు 330 మెగావాట్ల సరఫరాకు ముందుకొచ్చాయి.



ఉత్తరాది కంపెనీలు 1,500 మెగావాట్ల సరఫరాకు ముందుకొచ్చినా కారిడార్ సమస్య అడ్డు వచ్చింది. దీంతో మొత్తంగా కేవలం 618 మెగావాట్లు సరఫరా చేసేందుకు టెండర్లు వచ్చినట్లయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలకు టీఎస్ ఎస్‌పీడీసీఎల్ లెటర్ ఆఫ్ ఇండెంట్లు పంపించింది. ఈ కంపెనీలు 2015 జూన్ 1 నుంచి 2016 మే 30 వరకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది.



మోకాలడ్డుతున్న ఏపీ!

తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా.. మొత్తం తమకే సరఫరా చేసేలా ఏపీకి చెందిన ప్రైవేటు కంపెనీలపై అక్కడి విద్యుత్ విభాగం అధికారులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బిడ్లు దాఖలు చేసిన వాటిలో ఎన్ని కంపెనీలు ఒప్పందానికి ముందుకొస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దాంతో వచ్చే ఏడాది సైతం తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ఛేంజీల నుంచి ఏ రోజుకారోజు విద్యుత్ కొనుగోలు చేయక తప్పదని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ. 8 వరకూ చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసింది. దీనికి దాదాపు రూ. 2,500 కోట్ల వరకూ వెచ్చించింది. ఈ లెక్కన రబీలోనూ ఏరోజు కారోజు కొనుగోలు చేయాల్సిన అత్యవసర స్థితి ముంచుకురానుంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top