వాస్తవాలు వదిలి సొల్లు మాట్లాడొద్దు

వాస్తవాలు వదిలి సొల్లు మాట్లాడొద్దు


తన కుల ప్రస్తావనపై కడియం మండిపాటు

నేను ఎస్సీ కాకపోతే ఎవరికైనా ఫిర్యాదు చేయండి




సాక్షి, హైదరాబాద్: ‘నేను ఎస్సీనే.. మాదిగను కాను.. బైండ్ల కులస్తున్ని, రాష్ట్రపతి ఎస్సీ కేటగిరీ కింద గుర్తించిన 56 కులాల్లో మాది ఒకటి. బడిలో చేరినప్పడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నాను.. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.. హైకోర్టులో కేసు వేయండి.. అనర్హత వేటు వేయించండి.. అంతే తప్ప సొల్లు మాట్లాడొద్దు. దిగజారుడుతనంతో ఇంత హీనమైన విమర్శలు చేయవద్దు.. మా అమ్మ చాలా బాధ పడింది.. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడతారా? అని అడిగింది. అందుకే స్పందిస్తున్నా.. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు సమావేశం పెట్టాను’ అని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.



కడియం శ్రీహరి ఎస్సీ కాదు.. బీసీ అని పేర్కొంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. వారుచేసే చౌకబారు విమర్శలను రికార్డు చేస్తున్నా.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు విమర్శలు చేసినందున, ఆ మాటలపై పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే చట్టపరంగా తీసుకోబోయే చర్యల్లో టీడీపీని, చంద్రబాబునాయుడిని భాగస్వామి చేస్తానని పేర్కొన్నారు. పార్టీపరంగా, రాజకీయంగా, సిద్ధాంతపరంగా, జరిగిన సంఘటనలపైనా మాట్లాడవచ్చు కానీ, ఇంత హీనంగా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. వారెంత నీచంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి ఎవరి వల్ల నష్టమో, ఎవరి వల్ల ఆదరణ కోల్పోతుందో ప్రజలకు తెలుసునన్నారు.



‘ఒకాయన అధికార పార్టీలోకి వచ్చి మంత్రి కావాలనుకున్నారని, మరొకాయన తెలంగాణ ప్రజల చేతిలో దెబ్బలు తిన్న కోపంతో మాట్లాడుతున్నారని’ విమర్శించారు. మంద కృష్ణ నన్ను మాదిగ కాదు అని అంటే.. మోత్కుపల్లి ఎస్సీనే కాదని అంటారు... తాను మాదిగ అని ఎక్కడా కై్లమ్ చేయలేదని, బైండ్ల అని మాత్రమే కై్లమ్ చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఏనుగంతటి వాడిని చేశారని, అది తట్టుకోలేకే టీడీపీ నాయకులు కుక్కల్లా మొరుగుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.



నేడు బాధ్యత ల స్వీకరణ..

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. డీఎస్సీ, ఇతర విద్యా సంబంధ అంశాలపై ఇప్పుడే స్పందించలేనని, శాఖాపరంగా సోమ లేదా మంగళవారం సమీక్ష నిర్వహించిన తరువాత ఆయా అంశాలపై స్పందిస్తానన్నారు. మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శిగా (విద్యాశాఖ) సతీష్‌కుమార్ కూడా శుక్రవారమే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top