సుజనా బకాయిలు రూ.316 కోట్లు!

సుజనా బకాయిలు రూ.316 కోట్లు! - Sakshi

  • ఆయన్ను రక్షించటానికే కేంద్రమంత్రిని చేశారా?: కాంగ్రెస్

  •  సెంట్రల్ బ్యాంకు ఇచ్చిన అప్పును సుజనా చౌదరి తీర్చలేదు

  •  కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కేంద్ర మంత్రి సుజనా

  • సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన ప్రధాన నరేంద్ర మోదీ పలువురు కళంకితులను కేబినెట్లో చేర్చుకోవడంపై సమాధానమివ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో నేరస్తులు లేకుండా చూస్తానని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన మోదీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ధ్వజమెత్తారు. 66 మంది సభ్యులున్న కేంద్ర మంత్రివర్గంలో 15 నుంచి 16 మంది కళంకిత మంత్రులున్నారని ఆరోపించారు.



    తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన టీడీపీ నేత వై.సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ.వందల కోట్ల బకాయి పడినట్లు వెల్లడించారు. బ్యాంకు అప్పును తీర్చని ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘నిన్న మంత్రివర్గంలో చేరిన వైఎస్ చౌదరి(సుజనా) వెబ్‌సైట్‌ను మేం పరిశీలించాం. అందులో ఒకవైపు సుజనా మరొక వైపు ప్రధాని నరేంద్రమోదీ చిరునవ్వులు చిందిస్తున్నారు. దాని పక్కనే చౌదరి సంస్థ సుజనా టవర్స్ గురించి ఉంది.



    సుజనా టవర్స్ అధినేత అయిన సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు రూ. 316 కోట్లు బకాయి పడ్డారు. ఆ బ్యాంకు జాబితాలో ఇవి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఇచ్చిన అప్పులు నిరర్థక ఆస్తులుగా మారటానికి కారకుడైనందుకేనా మీరు సుజనా చౌదరికి మంత్రి పదవి ఇచ్చారు? సెంట్రల్ బ్యాంకుకు బకాయి పడ్డ టాప్ 20 మంది జాబితాలో ఆయన 8వ స్థానంలో ఉన్నారు.



    సుజనాను రక్షించేందుకే మీరు మంత్రిని చేశారా? పదవి ఇచ్చే ముందు మోదీ ఈ వివరాలు తెలుసుకున్నారా? ప్రజలు నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నారు..’ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ‘మంత్రి రామ్‌శంకర్ కతారియాపై 23 క్రిమినల్ కేసులున్నాయి. మరో మంత్రి గిరిరాజ్‌సింగ్ ఇంట్లో దొంగతనానికి గురైన సొమ్ములో నుంచి రూ. 1.25 కోట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఆయన  అవినీతిపరుడు కాదంటారా?’ అని మాకెన్ ప్రశ్నించారు.



    ‘ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అదనంగా సమాచార ప్రసార శాఖ ఇచ్చారు. ఆర్థిక శాఖకు, సమాచార శాఖకుసంబంధం ఏమిటి? కొందరు వ్యాపారవేత్తలు మీడియా సంస్థలను కొనుగోలు చేయడం తప్ప ఆ రెండింటి మధ్య మరో సంబంధం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశాఖ నుంచి హర్షవర్ధన్‌ను, రైల్వే శాఖ నుంచి సదానంద గౌడను తప్పించడానికి కారణం చెప్పాలని మాకెన్ డిమాండ్ చేశారు. ‘అవినీతిపరులనా? లేక అసమర్ధులనా? వారిని ఎందుకు మార్చారో మోదీ చెప్పాలన్నారు.

     

    రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు: సుజనా




    తనపై వచ్చిన ఆరోపణలను ఆదివారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుజనా చౌదరి ఖండించారు. బ్యాంకులను తాను రుణాలను కట్టకుండా ఎగవేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించటాన్ని తోసిపుచ్చారు. ఇందులో నిజం లేదని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top