‘రియల్’ దెయ్యం | Sakshi
Sakshi News home page

‘రియల్’ దెయ్యం

Published Mon, Dec 28 2015 11:12 PM

‘రియల్’ దెయ్యం - Sakshi

అది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. కర్నాటక సరిహద్దులో ఉంటుంది.
నారాయణపేట పేరుకి మండల కేంద్రమే కానీ వెనుకబాటుతనం ఛాయలు ఏ మాత్రం వీడలేదు.
మండల కేంద్రమైన తర్వాత కొంత ఆధునికత తోడవుతూ పట్టణం విస్తరిస్తోంది. దాదాపుగా
పదిహేను వందల కుటుంబాలు జీవిస్తుంటాయి. పట్టణానికి దూరంగా పురాతన నివాస ప్రాంతం ఉంది.
అది నూటయాభై కుటుంబాలు నివసించే వాడ. ఆ వాడలో దాదాపుగా ఐదేళ్ల కిందట జరిగిందా సంఘటన.

 
సాయంత్రం అవుతుంటే అందరి కళ్లలో బెరుకు. భయంభయంగా గడుపుతున్నారు. సాధారణంగా ఏడు దాటితే రొటీన్ పనులన్నీ బంద్ అయి ఇళ్లకు చేరే సంస్కృతి వారిది. గూట్లో దీపం, నోట్లో ముద్ద అన్నట్లు సందె చీకట్లు అలుముకోగానే రోజు ముగిసిందనే లైఫ్‌స్టయిలే అక్కడ. అలాంటిది పొద్దు కొండల్లో పడుతోందంటే... అంటే సాయంత్రం ఐదింటికల్లా ఇంటిదారి పడుతున్నారు. ఎవరికైనా ఏ పక్క ఊరికో వెళ్లి రాత్రి ఎనిమిదింటికి- తొమ్మిదింటికి ఇల్లు చేరాల్సి వచ్చిందంటే చాలు. గుండె గొంతులోకి వచ్చినంత పనవుతుంది. దడదడలాగే గుండెను అరచేత్తో అదుముకుంటూ వచ్చి ఇంట్లో పడేవాళ్లు.

‘అమ్మా ట్యూషన్ నుంచి ఒక్కదానివే రాకు. నేనొచ్చి తీసుకొస్తా’ అంటూ కూతురికి జాగ్రత్తలు చెబుతున్నాడో తండ్రి. ‘దెయ్యం ఎలా ఉంటుంది నాన్నా! ఏం చేస్తుంది?’ అంటూ అమాయకంగా అడిగే ప్రశ్నలకు జవాబు ఆ తండ్రి దగ్గర లేదు. తన బిడ్డ లక్షణంగా ఉంటే తనకదే చాలు అనుకోవడమే అతడికి తెలిసింది. చీకటి పడక ముందే వీధులు నిర్మానుష్యంగా మారేవి.

ఒక్కొక్కరైతే పరుగుతో ఇంట్లోకి వస్తూనే కళ్లు తిరిగి పడిపోయేవాళ్లు. ఎవరో వెంబడించినట్లు అనిపించిందని, దూరంగా లీలగా ఓ రూపం కనిపించి ‘ఎక్కడికెళ్తున్నావు’ అని అరిచిందని చెప్పేవారు. మరికొంత మంది ‘తెల్ల దుస్తులు వేసుకున్న యువతి - ఇక్కడికి ఎందుకు వచ్చారు- అంటూ గద్దించింది’ అని చెప్పేవారు. ‘ఆ యువతి కళ్లు దేనికోసమే వెతుకుతున్నట్లు, తీవ్రమైన ఆశాభావం ఆ కళ్లలో గూడు కట్టుకున్నట్లు ఉండేవి. జుట్టు నిశీథిలా వీపంతా పరుచుకుని ఉంది’ ఇలాంటి అనేక కథనాలు. వాడవాడంతా భయం గుప్పెట్లో రోజు వెళ్లదీస్తోంది. ఊళ్లో దెయ్యం తిరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు. దెయ్యం అనే పదం లేకుండా పది మాటలు మాట్లాడడం లేదు. ఇంతకీ దెయ్యం ఎలా పుట్టిందంటే... ‘ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో మాకు తెలియదు కానీ ఆ ఖాళీ స్థలంలో ఉంటోంది’ అని ముక్తకంఠంతో చెప్పసాగారు.

దెయ్యం ఉంటున్నదిక్కడే!
ఇళ్ల మధ్య వందల ఏళ్ల నాటి కట్టడం. విశాలమైన ప్రహరీ, ఓ మూలగా చిన్న ఇల్లు. కప్పు కూలిపోయి, గోడల్లో నుంచి మొక్కలు పెరిగి, మట్టిదిబ్బలు, రాళ్లకుప్పలతో చూడడానికే భయంగొలిపేలా ఉందా ప్రదేశం. ఆవరణంతా పిచ్చిచెట్లు మొలిచాయి. ఎక్కడ అడుగుపెడితే ఏమవుతుందో అన్నట్లు తీగలు అల్లుకుపోయి ఉన్నాయి. పాములు, తేళ్లు యథేచ్చగా సంచరించే అవకాశం ఉంది. వాడలో అందరి వేళ్లూ ఆ జాగానే చూపిస్తున్నాయి. ‘ఆ యువతి ఇక్కడే ఉంటోంది. జన సంచారం తగ్గినప్పుడు వీధుల్లో తిరుగుతోంది. అప్పుడామెకు ఎవరు ఎదురు వచ్చినా భయపెడుతోంది’ ఇలా తమ అనుభవాలను కథలు కథలుగా చెప్తున్నారు.
 
‘రీల్’ దెయ్యంలాగానే!
ఆ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి యజమాని అక్కడే మంచం మీద కూర్చుని చూస్తున్నాడు. అతడిని పలకరించినప్పుడు... ‘అబ్బే! దయ్యమా ఇంకేమైనానా! నే రోజూ ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటా. నాకొక్కసారీ కనిపించందే’ అని తేలిగ్గా తీసిపారేశాడు. అక్కడ గుమిగూడిన ఆడవాళ్లను ‘మీరు చూశారా’ అని అడిగితే, తెల్లముఖం వేశారు. ఎలా ఉంటుంది దెయ్యం? అని అడిగితే... సినిమాల్లో కనబడినట్లు ఉంటుందని భయం వ్యక్తం చేశారు. స్థూలంగా తేలిందేమిటంటే... ‘మేము చూశామని చెప్పేవారి కంటే, ఫలానా వాళ్లకు కనిపించిందట’ అనేవాళ్లే ఎక్కువ.

ఆ ‘ఫలానా’ వాళ్లు ఎవరూ అంటే...
అందరి కళ్లూ ఏడెనిమిది మంది చుట్టూనే తిరుగుతున్నాయి. వారిలో ఎక్కువమంది ఆ జాగా పక్కనున్న ఇంటి వాళ్లే. వాళ్లు ‘మేము చూశామని స్థిరంగా చెబుతున్నారు. కానీ దయ్యం కనిపించిందనే ఆందోళన, భయం వారి మాటల్లో కానీ, స్వరంలో కానీ ఏ మాత్రం ధ్వనించడం లేదు. లీలగా దెయ్యాన్ని ఊహించుకుని, చూసినట్లు భ్రమించిన వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. స్పష్టంగా చూశామని చెప్తున్న వాళ్లు మాత్రం భయపడడం లేదు. విచిత్రమైన పరిస్థితి. ఇంత జరుగుతుంటే ఆ స్థలం యజమాని ఏమయ్యాడు? అని ఆరా తీస్తే...

 ‘రియల్’ దెయ్యమే!
 సెంటర్‌లో టీ దుకాణం నడుపుకుంటున్నాడు. పాత ఇంటిని పట్టించుకోకపోవడంతో శిథిలమైపోయింది. అతడికి దానిని అమ్మాల్సిన అవసరం రాలేదు. కొనేవాళ్లు  ఆసక్తి కొద్దీ అడిగితే అందనంత ధర చెప్పసాగాడు. ఆ ప్లాట్ పనికిరానిదని నిర్ధారించగలిగితే తక్కువ వెలకు సొంతం చేసుకోవచ్చనే దుర్బుద్ధి కలిగింది పక్కింటి వాళ్లకు. కుయుక్తితో పక్కింటి వాళ్లు అల్లిన కథనాన్ని ఖాళీజాగా యజమాని కూడా నమ్మేశాడు. చివరికి అంతా గొప్ప ఫిక్షన్ స్టోరీ అని తేలాక ఊపిరి పీల్చుకుని, ఆ స్థలాన్ని శుభ్రం చేసి ఓ గది కట్టేసి నివాసయోగ్యంగా మార్చుకున్నాడు.

మనుషుల్లో బలంగా నాటుకుపోయిన దెయ్యం భయం గురించి సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే... చిన్నప్పటి నుంచి విన్న సంగతులు, ముద్రపడిపోయిన విశ్వాసాలు మనిషి మనసుని ఆడుకుంటుంటాయి. ఆ బలహీనతలతో స్వార్థపరులు ఆటలాడుతుంటారు.
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఆ దెయ్యం ఇక కనిపించదు!
 స్థానిక వార్తాపత్రికల్లో వార్త ప్రచురితమైందని జనవిజ్ఞాన వేదిక మండల కమిటీ వాళ్లు మాకు తెలియచేశారు. హైదరాబాద్ నుంచి నేను వెళ్లాను. మా జిల్లా ప్రతినిధులు కూడా వచ్చారు. మొత్తం ఐదారుగురం కలిసి ఆ వాడంతా తిరిగాం. కనిపించిన వారితో మాట్లాడాం. ఆ పుకారును లేవదీసింది ఖాళీ జాగా పక్కన ఉన్న ఒక కుటుంబం. ప్రచారం చేసింది వారి స్నేహితులు, బంధువులు. వీరికి సలహా ఇచ్చింది ఓ మంత్రగాడు.

ఆ కుటుంబ యజమానిని పిలిచి ‘ఇదంతా నువ్వు చేసిందేనని మాకు తెలుసు. ఎందుకు చేశావో చెప్ప’మని నిలదీశాం. మొదట అతడు సహకరించలేదు. పోలీసుల జోక్యంతో నిజం ఒప్పుకున్నాడు. ఆ స్థలాన్ని తక్కువ ధరకు కొట్టేయడానికేనని ఒప్పుకున్నాడు. ఆ వాడలోని వారందరికీ ‘దెయ్యాలుండవని చెప్పి, ఇక దెయ్యం కనిపించదు’ అని ధైర్యం చెప్పాం. ఆ తర్వాత ఆ వాడలో ఎవరూ దెయ్యం కనిపించిందనలేదు.

 - రమేశ్,
 జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్
 
 అంతా భ్రాంతి..!
 మనిషి ఎమోషనల్ స్టేట్‌ని బట్టి ఇల్యూజన్స్ ప్రభావితం చేస్తాయి. దాహంతో ఉన్న వ్యక్తికి ఎడారిలో అడుగడుగునా ఎండమావులే కనిపిస్తాయి. చేతిలో నీళ్లు ఉంటే ఎండమావులు కనిపించవు. ఇదీ అలాగే. దెయ్యం విషయంలోనూ అంతే. ప్రీ ఫిక్సేషన్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. అందుకు చదువు, విజ్ఞానం లోపించడంతోపాటు చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ ‘తినకపోతే దెయ్యం పట్టుకెళ్తుందని భయపెట్టడం’ వంటివన్నీ కారణాలే. అలాగే ఇళ్లలో దెయ్యాల మీద చర్చ, దెయ్యాల సినిమాలు చూడడం వల్ల చదువుకున్న వారిలోనూ మైండ్ దెయ్యం ఉందనే భావంతో నిండిపోతుంది. కనిపించిన వాటిని దెయ్యంతో పోల్చుకుంటుంటారు. లైటు దగ్గర పురుగు కదిలినా దెయ్యం కదలినట్లు భ్రాంతికి లోనవుతుంటారు.
 - డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
 

Advertisement
Advertisement