నేనెప్పుడూ ఎవరితోనూలాలూచీ పడలేదు!


నేనెప్పుడూ ఎవరితోనూలాలూచీ పడలేదు!

 ఎల్లుండి 84వ వసంతంలో అడుగిడుతున్న సినారె...

 

 తెలుగు సాహితీ లోకానికి ఆయన ఆభరణం...

 కొన్ని దశాబ్దాలుగా కవికులానికి ఆచార్య పీఠం...

 తెలుగు జాతికి గర్వకారణమైన జ్ఞానపీఠం...

 ప్రతి ఏటా ఓ కావ్య వసంతాన్ని పూయించే కవితా వృక్షం...

 

 తెలంగాణ గడ్డలో పుట్టి, తెలుగు సాహితీ మాగాణిలో

 బంగారు పంటలు పండించిన ఆధునికాంధ్ర కవి, సినీ రవి ఆయన.

 సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంటే తెలిసిన వారు చాలా తక్కువ...

 సి. నారాయణరెడ్డి పేరు తెలియని తెలుగు వారు మాత్రం మరీ తక్కువ...

 

 తెలుగు... ఉర్దూ... సాహిత్యం... సంస్కృతి...

 భాష ఏదైనా, అంశమేదైనా...

 అది సినిమా పాటైనా... భాషా పరివేషమైనా

 బోధన, బాధ్యతల నిర్వహణ  అయినా... ఆయనది బహుముఖీన ప్రజ్ఞ

 

 కలం పట్టినా, గళం విప్పినా... ఆయనది నిత్య చైతన్యం... సత్య దర్శనం...

 ఎనభై నాలుగో ఏట కూడా నిరంతర రచనా వైదుష్యం...

 ఏది రాసినా, ‘సినారె... ఏమి రాసినారే’ అనిపించుకొన్న ఘనచరిత్ర ఆయన సొంతం.

 

 హలం పట్టడం మాని, కలం పట్టిన ఈ అవిశ్రాంత సాహితీ హాలికుని

 గతం... స్వగతం... ఆగతాల... నుంచి కొన్ని మల్లెలు... మెల్లలు...


 

 రెండు రోజుల్లో ఎనభై నాలుగో ఏట అడుగు పెడుతున్న సమయంలో వెనుతిరిగి చూస్తే, మీ మానసిక భావ సంచలనం?

 (నవ్వేస్తూ...) సంకల్పం, లక్ష్యం కలిగిన మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు. వయస్సును బట్టి శారీరక పరిణామాలు రావచ్చు. కానీ, మనస్సు యౌవనంలో లానే రచనోత్సాహంతో ఉరకలు వేస్తోంది. నేనిప్పుడు పాఠాలు చెప్పడం లేదు. సినిమా పాటలు కూడా ఇంచుమించు రాయడం లేదు. కానీ, నా కవితా రచన నిరంతరాయంగా సాగిపోతోంది. ఇప్పటికీ వారానికి రెండు కవితలు రాస్తా. పత్రికల్లో ప్రచురిస్తా. ప్రతి ఏటా నా పుట్టినరోజుకు అంతకు ముందు ఏడాదిగా రాసిన కవితలన్నిటినీ కలిపి సంపుటిగా తెస్తున్నా.

 

 చదువు లేని ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఇంతటి సాహితీ వారసత్వాన్ని అందుకొంటారనుకున్నారా?

 (నవ్వేస్తూ...) నేనే కాదు... ఎవరూ అనుకోని ఉండరు. మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేట. అమ్మానాన్నలైన బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు నేనొక్కణ్ణే సంతానం. ఉన్న వందెకరాలకు ఏకైక వారసుణ్ణి. మా అమ్మకు చదువు రాదు. మా నాన్నకు కొద్దిపాటి చదువు వచ్చు. మా ఊళ్ళో కనీసం బడి కూడా లేదు. మూడో తరగతి వరకు అరుగు మీద బడిలో చదువుకున్నా. తరువాత సిరిసిల్ల, కరీంనగర్‌లలో 10వ తరగతి దాకా చదివా. నిజామ్ ఏలుబడిలోని తెలంగాణలో అప్పుడంతా ఉర్దూ మీడియమ్ చదువే. హైదరాబాద్ వచ్చి, సోషియాలజీ, ఎకనామిక్స్, తెలుగుతో ఇంటర్, బి.ఏ చదివా. అదీ ఉర్దూ మీడియమే. తరువాత ఎం.ఏ - తెలుగు చేశా. తొలినాళ్ళలోనే ‘నాగార్జున సాగరం’, ‘కర్పూర వసంతరాయలు’, ‘విశ్వనాథ నాయడు’ లాంటి కావ్యాలతో సాహిత్యంలో పేరు తెచ్చుకున్నా.

 

 ఉర్దూ మీడియమ్‌లో చదివినా తెలుగు మీద ఇంత పట్టు సంపాదించడానికి మీ గురువుల బోధన కారణమనుకోవచ్చా?

 సృజనాత్మక శక్తి సహజాతం. నా మేధాక్షేత్రంలో భాషా బీజాలున్నాయి. అవి సహజ ప్రతిభతో అంకురించి, పైకి పొడుచుకొచ్చాయి. గురువులు తమ బోధన ద్వారా వాటిని వికసింపజేశారు. పుట్టి పెరిగిన పల్లె వాతావరణం, అక్కడి సంస్కృతి, జానపద గీతాల ప్రభావం నా మీద ఉంది.

 

 మరి సంగీతజ్ఞానం, లయతో రాసి పాడడమెలా అబ్బాయి?

 అదీ సహజాతమే. నేర్చుకుంటే శాస్త్రీయ సంగీతమొ స్తుంది. కానీ అసలు సంగీత జ్ఞానం పుట్టుకతో రావాల్సిందే.

 

 పుట్టినప్పుడు పెట్టిన పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అయితే, మరి మీరు సి. నారాయణరెడ్డి ఎలా అయ్యారు?

 నా ముందు పిల్లలు పుట్టిపోయారు. మా ఊళ్ళో కోమట్ల ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం జరుగుతుంటే, అక్కడకు వెళ్ళిన మా అమ్మ మొక్కుకుందట. తరువాత నేను పుట్టడంతో నాకు సత్యనారాయణరెడ్డి అని పేరు పెట్టారు. బడిలో చేరినప్పుడు అబ్దుల్ ఖాదర్ అని ఉర్దూ టీచర్ ఉండేవారు. ‘తుమ్హారా నామ్ క్యా హై’ అని అడిగారు. సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి అని చెప్పా. ఆయన వెంటనే, సింగిరెడ్డిని కాస్తా ‘సి’ అని, సత్యని కూడా తీసేసి, నా పేరు సి. నారాయణరెడ్డి చేశారు. అలాఈ పేరంతా మా టీచర్ ఘనత (నవ్వు).

 

 మీరూ తెలుగు ఆచార్యుడిగా నేటి ప్రముఖుల్లో చాలామందికి గురుత్వం వహించినట్లున్నారు!

 అవును. టి. సుబ్బిరామిరెడ్డి, పి.వి. నరసింహారావు కుమారుడు పి.వి. రంగారావు, మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి నా విద్యార్థులే. నా దగ్గర చదువుకొన్న చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒకానొక దశలో అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నన్ను శాఖాధ్యక్షుడిగా నియామకం చేస్తే, కాదన్నాను. ఎందుకంటే నాకు పరిపాలనా దృష్టి కన్నా బోధన దృష్టి ఎక్కువ. పిల్లలకు బోధించడంలో ఎంతో తృప్తి.

 

 కానీ, తర్వాత అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా, ఓపెన్, తెలుగు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా, ఇంకా అనేక బాధ్యతల్లో పాలనా నిర్వహణ చేశారు. అదీ అత్యంత సమర్థంగా...

 ఒక పదవిని కానీ, కార్యక్రమాన్ని కానీ చేపట్టిన తరువాత దాన్ని సమర్థంగా, సమగ్రంగా నిర్వహించాలి. లేదంటే, ఆ పదవిని విసర్జించాలి. అది నా దృక్పథం. అందుకే, ఏ పదవి వచ్చినా, ఆ బాధ్యతను చక్కగా నిర్వహించాను. ఇప్పటికీ, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, వారానికి రెండు రోజులు వెళ్ళి, వ్యవహారాలు చక్కబెట్టి వస్తున్నా.

 

 రాజ్యసభ సభ్యుడిగా చేశారు. లోక్‌సభకు పోటీ చేయలేదేం?

 కాసు బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ నుంచి పోటీ చేయమంటూ అవకాశమిస్తే, వద్దన్నా. నాకు ఎంతో సాన్నిహిత్యమున్న ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున పోటీ చేయమంటూ బలవంతపెట్టారు. ఆయన పట్టుదలకూ, ఒత్తిడికీ మరొకరైతే సులభంగా లొంగిపోయేవారు. కానీ, సున్నితంగా తోసిపుచ్చా. రాజ్యసభ సభ్యత్వమంటారా? కేంద్ర సర్కార్ నన్ను నామినేట్ చేసింది. దక్షిణాది నుంచి ఇలా రాజ్యసభకు నామినేటైన తొలి కవిననే గౌరవం దక్కింది. ప్రత్యక్ష రాజకీయాల మీద నాకెప్పుడూ విముఖతే!

 

 కానీ, పదవులతో రాజకీయాలు, అడ్డంకులు సృష్టించేవాళ్ళు సాధారణం. వాటినెలా ఎదుర్కొన్నారు?

 (గంభీరంగా) కవిగా వేరు, బాధ్యతల నిర్వహణలో ఉన్నప్పుడు వేరు. నాకు కార్యగతమైన పౌరుషం ఎక్కువ. పని పూర్తయ్యేదాకా విశ్రమించేవాణ్ణి కాదు. అందుకే, నాకెవరూ అడ్డు రాలేదు. ఎవరైనా అడ్డొచ్చినా లెక్క చేయలేదు.

 

 ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఒకే పార్టీకి చెందిన భిన్న వర్గాల వారు పగ్గాలు చేపట్టినా మిమ్మల్ని మాత్రం పదవులు వరిస్తూనే వచ్చాయి. అదెలా సాధ్యమైంది? మీకు చాలా లౌక్యమని...

 (అందుకుంటూ...) కొందరి విమర్శ. అంతేనా? నా గురించి నేను చెబితే, ఆత్మస్తుతిలా అనిపిస్తుంది. ఆత్మస్తుతికి పాల్పడే బలహీనత నాకు లేదు. అయితే, ఒకటి నిజం. పార్టీలకూ, వర్గాలకూ అతీతంగా వాళ్ళందరూ నన్ను అభిమానించినవారు, గౌరవించినవారు. అందుకే, ఎవరు అధికారంలోకి వచ్చినా నాకు బాధ్యతలు అప్పగించారు. నేను చినుకుకూ, చినుకుకూ మధ్య ఒడుపుగా కదులుతూ, తడవకుండా ముందుకు వెళ్ళా. అది ప్రస్థానం. దాన్ని ఆపలేదు... అదే సమయంలో నేనెప్పుడూ ఎవరితోనూ లాలూచీ పడలేదు.

 

 మీరు పైకి ధీరగంభీరంగా కనిపించినా, శిష్యవాత్సల్యం, ఆశ్రీత వత్సలత ఎక్కువ. దాన్ని బలహీనతగా చెప్పేవాళ్ళూ ఉన్నారు.

 లేదు. ఆచార్యుడిగా, ఏదైనా పదవిలో ఉన్నప్పుడు అధికారిగా నాదెప్పుడూ సమదృష్టే. రాగద్వేషాలు లేకుండా బాధ్యతలు నిర్వహించా. అయినా, సమర్థుల్ని సరైన స్థానంలో ఉంచితే తప్పేమిటి? తండ్రికి పుత్ర వాత్సల్యం ఉండదా?  

 

తెలుగు ఆచార్యుడిగా ఉన్న రోజుల్లోనే సినీ కవి అయ్యారు.  ఇటు బోధన, అటు సినీ రచన-ఎలా సమన్వయపరుచుకున్నారు?

 సెలవులుంటాయి. వాటిని బట్టి, ఫలానా రోజుల్లో మద్రాసులో ఉంటానని దర్శక, నిర్మాతలకు ముందే తెలియపరిచేవాణ్ణి. దాదాపు ప్రతి శనివారం సాయంత్రం మద్రాసుకు విమానంలో వెళ్ళేవాణ్ణి. ఆదివారం ఒకే రోజు మూడు సంస్థల వాళ్ళ పాటలు రాసేసేవాణ్ణి. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో దిగుతూనే, కారులో ఆ కావ్యం చదువుకుంటూ, నేరుగా వెళ్ళి, 10 గంటలకల్లా క్లాసు ఆరంభించేవాణ్ణి. నేను తెలుగు చెబుతుంటే, ఫిలాసఫీ విద్యార్థులు సైతం తమ క్లాసు ఎగ్గొట్టివచ్చి, నా పాఠం వినేవారు.  

 

 బోధన కన్నా ఎక్కువ డబ్బు, పేరు సినీ గీతరచన ద్వారా వస్తున్నప్పటికీ, అధ్యాపక ఉద్యోగం మీరు వదల్లేదు. కారణం?

 ముందే చెప్పినట్లుగా బోధన నాకు ఇష్టమైన విషయం. దానిలో నాకు తృప్తి ఉంది. నాకు ఈ డబ్బు లెక్కలు తెలియవు. అందుకే, పిల్లలకు పాఠాలు చెప్పడం వదలలేదు. నిర్మాత డి.వి.ఎస్. రాజు గారి లాంటి వాళ్ళు, ‘రెడ్డి గారూ! ఉద్యోగం వదిలేసి, ఇక్కడే మద్రాసులో ఉండండి. సినీ కవిగా స్థిరపడిపోదురు గాని!’ అని పదే పదే చెప్పినా, తోసిపుచ్చా.

 

 దశాబ్దాల క్రితం మీరు చేసిన పరిశోధన ‘ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు’ పదే పదే ముద్రణకు నోచుకుంది. దానికి బీజం ఎలా పడింది?

 నిజానికి, నాకు కవితా రచన మీద ఉన్న ఆసక్తి ఎన్నడూ పరిశోధన మీద లేదు. ప్రొఫెసర్ కావాలంటే పిహెచ్.డి. ఉండాలంటూ కృష్ణశాస్త్రి నాకు హితబోధ చేశారు. ‘కన్వెన్షన్ అండ్ రివోల్ట్ ఇన్ మోడరన్ ఇంగ్లీష్ పొయెట్రీ’ అనే గ్రంథం నన్ను చదవమన్నారు. అది సుమారుగా ఉంది. అయితే, దాన్ని మన ఆధునికాంధ్ర కవిత్వానికి వర్తింపజేస్తూ, పరిశోధన చేస్తే బాగుంటుందనిపించింది. అలా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి మార్గదర్శకత్వంలో కృషి చేసి, పిహెచ్.డి పట్టా పొందా. ఇవాళ ఆ రచన రిఫరెన్స్ గ్రంథమైంది.

 

 కానీ, పరిశోధన అనేది సృజనాత్మకతకు కొంత అడ్డంకి కదా! మరి, మీ సృజనాత్మకతను ఎలా కాపాడుకొన్నారు?

 సృజన చేస్తున్నప్పుడు పరిశోధన అంశాలు బుర్రలోకి రాకూడదు. అలాగే, పరిశోధిస్తున్నప్పుడు సృజనాత్మకతను ఆశ్రయించకూడదు. ఆ రెండూ రెండు వేర్వేరు పాయలు. వేటికవిగా ప్రవహించనివ్వాలి. నేను చేసింది అదే.

 

 మీరు కవిత్వం మొదలుపెట్టే సమయానికే అభ్యుదయ కవితా ఉద్యమం కూడా వచ్చేసింది. కానీ, మీరు వెనక్కివెళ్ళి గేయ కథాకావ్యాలతో మొదలుపెట్టి, తరువాత ఆధునికత వైపు వచ్చారు.  

 అప్పటికే సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ, భావ కవిత్వానికి రాయప్రోలు, అభ్యుదయ కవిత్వానికి శ్రీశ్రీ లాంటి మహాకవులున్నారు. నేనూ వాళ్ళ లాగానే రాస్తే, వారి వెనుక... అట్టడుగున పడిపోయేవాణ్ణి. వాళ్ళకు భిన్నంగా ఉండాలనే కథాత్మక గేయ కావ్యాలు రాశా. అందులో చారిత్రక అంశాలు తీసుకున్నా. గేయాన్ని కూడా ఖండ, త్రిశ్ర, మిశ్ర - ఇలా వేర్వేరు గతుల్లో రాశా. పద్యంలాగా గేయాన్ని నడిపాను. ఇవన్నీ నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తర్వాత ‘విశ్వంభర’, ‘మట్టి - మనిషి - ఆకాశం’ లాంటి వాటితో మానవుడే కథానాయకుడిగా ఆధునిక కావ్యాలు రాశాను.

 

 మీ మీద ప్రభావం చూపిన ఆధునిక కవులు ఎవరు?

 కళాశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో నేను అభిమానించిన ఆధునిక కవుల్లో విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి ఉన్నారు. తొలినాళ్ళలో ప్రణయ కవిత్వం రాసినప్పుడు నా మీద కృష్ణశాస్త్రి ప్రభావం స్వల్పంగా ఉంది. క్రమంగా ప్రయత్నపూర్వకంగా దాని నుంచి బయటకొచ్చాను. నాదైన మార్గం వెతుక్కున్నాను. ఇక, మానవీయ కవిత్వం రాయడానికి నాకు ప్రేరణ - గుఱ్ఱం జాషువా.

 

 కొన్ని వందల కవితలు రాశారు. ‘పద్మభూషణ్’తో సహా వేల గౌరవాలందుకున్నారు. తొలి కవిత, సన్మానం గుర్తున్నాయా?

 నేను ఇంటర్‌లో ఉండగా రాసిన ఓ కవిత జువ్వాది గౌతమరావు సంపాదకత్వంలోని అప్పటి ‘జనశక్తి’ వారపత్రికలో ప్రచురితమైంది. అది నాకు ఇప్పటికీ గుర్తే. ఇక, తొలినాళ్ళ చిరు సత్కారాలు మొదలు ఇవాళ్టి దాకా ఎన్నో జరిగాయి. అయితే, పిహెచ్.డి వచ్చిన సందర్భంలో 1961లో విజయవాడలో జరిగిన సభలో కవి మిత్రుడు రెంటాల గోపాలకృష్ణ, నటుడు గుమ్మడి తదితరులు అభినందించారు. వెంటనే గుంటూరులో పౌరసన్మానం చేశారు. జాషువా, కరుణశ్రీ, జమ్మలమడక తదితరులున్నారు. అదెన్నటికీ మర్చిపోలేను.

 

 కవి దాశరథితో మీది ప్రత్యేక అనుబంధం! ఆయనతో మీ సాన్నిహిత్యం, ఆయన మార్గదర్శకత్వం గురించి చెబుతారా?

 నేను బి.ఏ విద్యార్థిగా ఉన్నప్పుడే దాశరథితో నాకు పరిచయం. మా పరిచయం బాగా పెరిగి, స్నేహంగా పరిణమించింది. నన్ను ఆయన ‘తమ్ముడూ’ అనేవారు. నేనేమో ‘అగ్రజా!’ అని పిలిచేవాణ్ణి. తెలంగాణ రచయితల సంఘం పెట్టినప్పుడు ఆయన అధ్యక్షుడు. నేను కార్యదర్శిని. గజల్స్, రుబాయీలు, ఆధునిక కవితా రచనల్లో ఎవరి పద్ధతి వారిదే! ఆయన మార్గదర్శనం, ప్రభావం నా మీద లేవు.

 

 ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ కన్నా ముందే సురవరం వారి ‘గోలకొండ కవుల సంచిక’ వెలువడింది. అయినా, ‘వైతాళికులు’లో తెలంగాణ కవులకు స్థానం దక్కలేదని ఇటీవల ఓ వివాదం.

 ఎన్నో ఏళ్ళుగా తెలంగాణలో కవులున్నారనీ, కవిత్వముందనీ చెప్పడం కోసం వారందరివీ సేకరించి, సురవరం ప్రతాపరెడ్డి సంకలనం చేసినది - ‘గోలకొండ కవుల సంచిక’. కొద్ది నెలల తేడాలో వచ్చిన ‘వైతాళికులు’ పూర్తిగా నవ్యాంధ్ర కవుల కవితల సంకలనం. అప్పటి ఆధునికాంధ్ర కవుల రచనలను స్వీకరించి వేసిన సంకలనం. కాబట్టి, దానికీ, దీనికీ ముడిపెట్టలేం. అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఆధునిక తెలుగు కవులు రాలేదు. తెలంగాణ నుంచి వచ్చిన ఆధునిక తెలుగు కవుల్లో మొదటివాడు - దాశరథే.

 

 తెలంగాణ బిడ్డ అయ్యుండీ, 1969లో ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమ ఉద్ధృతి వేళ మీరు ఎన్టీఆర్ ‘తల్లా-పెళ్ళామా’లో ‘తెలుగు జాతి మనది..’ అంటూ సమైక్యవాద గీతం రాశారని...

 (మధ్యలోనే...) విమర్శ ఉంది. అంతేనా? ఎన్టీఆర్ ‘విశాలాంధ్ర’ వాది. ‘తల్లా-పెళ్ళామా’ చిత్రం తీస్తూ, ఎన్టీఆర్ గారు సినిమాలో కళాశాలలో జరిగే ఓ సమావేశంలో సందర్భోచితంగా, తెలుగుజాతి సమైక్యత మీద పాట రాయాలని నన్ను అడిగారు. ఒక కవిగా నన్ను పెట్టుకున్నారు కాబట్టి, దర్శక - నిర్మాత కోరింది నేను రాసి ఇచ్చాను. అంతే.  

 

 తర్వాత... అలా రాయకుండా ఉండాల్సిందనిపించిందా?

 (గంభీరంగా...) లేదు. ప్రత్యేక తెలంగాణవాదం అప్పటికే ఉంది. కానీ, నేనది సినిమా సందర్భాన్ని బట్టి రాశానని గ్రహించాలి. తర్వాత పరిణామాలతో, తెలంగాణ, ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా తెలుగువాళ్ళమంతా వెలగాలని, ‘తెలుగు జాతి మనది...‘రెండుగ’ వెలుగు జాతి మనది’ అన్నా. రాష్ట్రాలుగా రెండయ్యామే తప్ప, జాతిగా ఒక్కటే!

 

 కానీ ఇవాళ కళా - సాహిత్య రంగాల్లోనూ తెలియని విభజన వచ్చేసినట్లనిపిస్తోంది. విద్వేషాలొద్దంటూ రాయవచ్చుగా?

 ఆ విభజన మనుషుల్లో లేదు. మన రాజకీయ వర్గాల్లోనే ఉంది. విద్వేషాలు వద్దంటూ మానవతా గీతాలు ఎన్నో రాశా. ‘మానవుడు - దానవుడు’లోని ‘అణువూ అణువున వెలసిన దేవా’ సుప్రసిద్ధం. అది నాకెంతో ఇష్టమైన పాట!

 

 ‘అభ్యుదయ రచయితల సంఘం’లో సభ్యులుగా కొంత కృషి చేశారే తప్ప, ఇతర సాహిత్య, సామాజిక ఉద్యమాలు ప్రచలితంగా ఉన్నప్పుడు మీది దాదాపు మౌనముద్రే? ఎందుకలా?

 నాది మౌన ముద్ర కాదు... జ్ఞానముద్ర. ఏ ఉద్యమంతో సంబంధం లేకుండా సాగిన సృజనాత్మక ప్రయాణం.



కానీ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్లను కవిగా ఎదిరించినట్లు కనబడరు. ఇదంతా ‘డాలరైజేషన్’ అని మాత్రం అన్నట్లున్నారు.

 గ్లోబలైజేషన్ అంటే ఏమిటో నాకు తెలియదు. అది నన్ను అంటుకోలేదు. ప్రపంచం పట్ల ఒక ఒక విశ్వ దృక్పథం ఉన్నవారికి ఇవేవీ ఉండవు. నాది ‘వసుధైవ కుటుంబకమ్’ అని భావన. ఒక్క మాటలో చెప్పాలంటే, నాది ప్రగతిశీల మానవతావాదం. ‘విశ్వంభర’తో సహా నా కావ్యాలన్నిటిలో ఉన్న దదే. మానవుని పక్షాన నేను నిలబడడం వాటిలో చూడచ్చు.

 

 వేల సినీ గీతాలు రాసినా, మాటలు రెండే చిత్రాలకు రాశారేం?

 నేను ప్రాథమికంగా కవిని. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాట కాదనలేక ‘ఏకవీర’, ‘అక్బర్ సలీవ్‌ు అనార్కలీ’ చిత్రాలకు మాటలు రాశా. ఈ రెండు కథల్లో ఆ పాత్రలు, ఆ చారిత్రక నేపథ్యానికి తగ్గట్లు రాసిన మాటలు జనానికి అర్థం కాలేదు. మరే సినిమాకూ మాటలు రాసే పనీ పడలేదు.

 

 మీకు అత్యంత ఇష్టమైన ఒక పది పాటల్ని ఎంచమంటే?

 అప్పటికప్పుడు పాటలు చెబుతూ, రాస్తూ పోవడమే తప్ప, వాటిని లెక్కించడం, రాసినవి దాచుకోవడం నాకు అలవాటు లేదు. దాదాపు 3500 దాకా సినీ గీతాలు రాసినట్లు సినీ గీత చరిత్రకారుల అంచనా. అవన్నీ నా బిడ్డలే. వాటిలో దేని మీద ఎక్కువ ప్రేమ అంటే ఎలా చెప్పను!

 

 మీ కుటుంబం, పిల్లల గురించి చెబుతారా?

 ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టి పోయారు. దాంతో, మా ఆవిడ సుశీల గోదావరి నదిలో స్నానం చేసి, మొక్కుకుంది. ఆ తరువాత మాకు ఆడపిల్ల పుట్టింది. అలా మా పెద్దమ్మాయికి ‘గంగ’ అని పేరు పెట్టా. తరువాతి పిల్లలకు ‘యము న’, ‘సరస్వతి’, ‘కృష్ణవేణి’ అని పేర్లు పెట్టా. అలా మా ఇల్లు నాలుగు నదుల నిలయం. వారందరికీ పెళ్ళిళ్ళు చేసి, అల్లుళ్ళను కూడా ఇంటికే తెచ్చుకున్నాను. వాళ్ళ కొడుకులు, మునిమనుమలు, మునిమనుమరాళ్ళు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. ఎవరి గది వారిదే! ఎవరి వృత్తి, ప్రవృత్తి వారిదే!

 

 ఇంతకీ, ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఇప్పుడు మీ దృష్టి దేనిపై?

 (నవ్వేస్తూ...) గడియారం మీద! మధ్యాహ్న భోజన సమయమవుతోందిగా! (నవ్వులు...) ఇప్పుడు నా దృష్టి అంతా కవితా సృజన మీదే. అది ఇలాగే నిరంతరం సాగాలని నా కోరిక. కవిగా ఇన్ని దశాబ్దాలుగా చైతన్యశీలంగా ఉన్నందుకు ఆత్మతృప్తి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నా జీవితం ఎందుకున్నదీ అంటే, కవిత్వం రాయడం కోసమేనంటాను!

 

- రెంటాల జయదేవ

 కోఆర్డినేషన్ కర్టెసీ: సంజయ్ కిషోర్


 

 తెలుగులో విశ్వనాథ, మీరు (‘విశ్వంభర’-1988), రావూరి భరద్వాజ - మీ ముగ్గురికే ప్రతిష్ఠాత్మక ‘జ్ఞానపీఠ్’ దక్కింది. ఇతర భాషలతో పోలిస్తే తరచూ ఈ గౌరవం మనకు రావడం లేదేం?  
   

 అసలు నాకు వస్తుందని నేను కూడా అనుకోలేదు. అయితే, ‘విశ్వంభర’కు వచ్చింది. రావాల్సిన దానికి వచ్చింది. అది నాకు తృప్తినిచ్చింది. జ్ఞానపీఠం వచ్చిన ‘విశ్వంభర’, దాని భూమిక, ‘మట్టీ - మనిషి - ఆకాశం’ కావ్యం గురించి చెప్పాలంటే అదో పెద్ద కథ.

     

మీ రోజుల్లో తెలంగాణ కవులు, రచయితలు, సినీ జీవుల మీద సాహిత్య, సినీ రంగాల్లో  వివక్ష ఉండేదా? సాహిత్య, సినీరంగాల్లో అది కనిపించేదా? మీకెప్పుడైనా అనుభవమైందా?


 లేదు. ఎప్పుడూ వివక్ష లేదు, ఏమీ లేదు. అలాంటి అనుభవాలు నాకెప్పుడూ ఎదురు కాలేదు. అసలు అలాంటి ధోరణి ఉంటే నన్నెలా ఆదరించేవారు! నేనెలా ఇంత పైకొచ్చేవాణ్ణి!!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top