నేడు రెండో ’ప్రజాప్రస్థానం’

ఇడుపులపాయలో పార్టీ సీజీసీ సమావేశంలో మాట్లాడుతున్న విజయమ్మ - Sakshi


 ఇడుపులపాయలో వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

 తొలుత వైఎస్, మృతి చెందిన

 పార్టీ నేతలకు సంతాప ప్రకటన

 ఆపై విజయమ్మ ప్రారంభోపన్యాసం, షర్మిల ప్రసంగం

 పలు అంశాలపై తీర్మానాలు..

 కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా నేడే

 ప్లీనరీ ముగింపు సందర్భంగా అధ్యక్షుడి సందేశం




 సాక్షి, హైదరాబాద్: ఆవిర్భావం నుంచీ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. పోరుబాటలో తన భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకునే దిశగా ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో రెండో ప్లీనరీ నిర్వహించనుంది. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8.30 గంటలకే ప్రతినిధుల నమోదు ప్రారంభం కానుంది. ప్లీనరీలో మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాపం తెలియజేస్తారు. ఆ తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, రైతు శ్రేయస్సు, ఆర్థిక అంశాలు తదితరాలపై పలు తీర్మానాలను ప్రవేశపెడతారు. సమావేశం మధ్యలో.. ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆమోదిస్తారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతనంగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడి సందేశం ఉంటుంది.  



 ఆవిర్భావం నుంచి గెలుపుబాటే..



 2010 ఫిబ్రవరి 10న పార్టీ ఆవిర్భావం తర్వాత అతి తక్కువ సమయంలో జరిగిన కడప పార్లమెంటు, పులివెందుల శాసన సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో రెండు చోట్లా పార్టీ అభ్యర్థులే గెలిచారు. కడప పార్లమెంటు స్థానంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పులివెందుల శాసనసభా స్థానంలో వైఎస్ విజయమ్మ గెలుపొందారు. దేశంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందిన అరుదైన ఎంపీగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తంగా 16 ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీ విజయఢంకా మోగించింది. 2012 ఏడాది ఆరంభంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే స్థానాన్ని పార్టీ గెలుపొందింది. అదే ఏడాదిలో 18 ఎమ్మెల్యే స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది.



 విభజనను నిక్కచ్చిగా నిలదీసిన పార్టీ



 రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ పోరాటం చేసిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలిచింది. ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడంతో పాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలసి విభజన వల్ల కలిగే నష్టాలను విన్నవించింది. దీంతోపాటు జాతీయ పార్టీల అధ్యక్షులను, అగ్రనేతలను జగన్ కలిసి 371డీ సవరణకు మద్దతు కూడగట్టారు. విభజనతో రాష్ర్టం నీటి సమస్యలతోపాటు అభివృద్ధిలో ఎదుర్కొనే సవాళ్లను వివరించారు.



 జగన్ ప్రభంజనాన్ని చాటుతున్న సర్వేలు



 వైఎస్సార్ కాంగ్రెస్, పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల మద్దతు దక్కుతున్న విధానాన్ని ఇటీవల పలు ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన సర్వేలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఇటీవల జాతీయ ఆంగ్ల వార్తా చానల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ చేసిన సర్వేలో రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీమాంధ్రలో ఏకంగా 48 శాతం మంది వైఎస్సార్ సీపీకే ఓటేస్తారని పేర్కొంది. ఆ స్థాయి ఓట ్లతో పార్టీ సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి 25 శాతం ఓట్లు దక్కుతాయని తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీకి 20కిపైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. లోక్‌నీతి-ఐబీఎన్ నేషనల్ ట్రాకర్ పోల్ ఫలితాలు ఇదే తరహా విశ్లేషణ చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11-19 పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చిచెప్పింది.

 

 నేడు అధ్యక్షుడి ఎన్నిక: ఉమ్మారెడ్డి



 వేంపల్లె, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామవళి ప్రకారం ప్రతి మూడేళ్లకొకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలతోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా జరగాల్సి ఉందని ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో భాగంగా శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇడుపులపాయలో మొదలైంది. ఈ మేరకు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన సీజీసీ సభ్యులు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధ్యక్షుడి నామినేషన్ పత్రాలను సీజీసీ సభ్యులకు అందజేశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటలవరకు సీజీసీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, 3 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ, 4 నుంచి 4.30 గంటల వరకు వాటి పరిశీలన, 5 గంటలకు ఆమోదిత నామినేషన్ల ప్రకటన, 5గంటల నుంచి 5.30 వరకు నామినేషన్ల ఉప సంహరణ, 6 గంటలకు తుది జాబితా ప్రకటన విడుదల జరిగిందని ఆయన వివరించారు. మొత్తం 13 సెట్ల నామినేషన్లను సీజీసీ సభ్యులు దాఖలు చేశారని, ఒకే వ్యక్తిని వాటిలో ప్రతిపాదించారని తెలిపారు. అన్ని నామినేషన్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయన్నారు.

 

 చర్చలో పాల్గొని ఉంటే నైజం తెలిసేది



 విభజన బిల్లుపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడకపోవడంపై విజయమ్మ వ్యాఖ్య




 పులివెందుల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి ఉంటే.. ఆయన నైజం బయటపడేదని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలమంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ సమైక్య పార్టీ అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాష్ట్ర విభజనకు సంపూర్ణంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యత కోసం మొదటినుంచి రాజీలేని పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి.. విభజన బిల్లును పార్లమెంటుకు పంపవద్దని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇడుపులపాయలోని అతిథి గృహంలో శనివారం మధ్యాహ్నం జరిగిన పార్టీ సీజీసీ సభ్యులు, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె ప్రసంగించారు. ముఖ్యాంశాలు..


  •     సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఓట్లు, సీట్ల రాజకీయానికి తెర తీశారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి నిర్ణయించుకున్నారు.

  •     బిల్లును అడ్డుకొనేందుకు అసెంబ్లీలో అన్నివిధాలా నిరంతరం పోరాటం చేశాం.  సీడబ్ల్యుసీలో తెలంగాణా ప్రకటన వెలువడకమునుపే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. రాజ్యాంగం సంక్షోభం సృష్టించడానికి ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండు చేసినా కాంగ్రెస్, టీడీపీలు ముందుకురాలేదు. బిల్లు వెనక్కి పంపాలని రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చాం. దేశంలోని అన్ని పార్టీల నాయకులను వైఎస్ జగన్ కలసి విభజనను వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే చరిత్ర క్షమించదని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించాం.

  •     రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించి ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ఎందుకు తెచ్చారో.. ఎందుకు వెనక్కి పంపారో సీఎం సమాధానం చెప్పాలి. ఆరోగ్యం బాగా లేదంటూ మొదటిరోజు అసెంబ్లీకి రాకుండా సీఎం తప్పించుకున్నారు. సభ్యులందరూ మాట్లాడాక.. సభ నాయకుడుగా చివరగా మాట్లాడాల్సిన సీఎం మధ్యలోనే మాట్లాడి చంద్రబాబుకు లోపాయికారిగా సహకరించారు.

  •     2009 ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోవడం చూసి చంద్రబాబుకు మతిభ్రమించింది. ఎక్కడికెళ్లినా.. చివరకు వరదబాధిత ప్రాంతాలకు పరామర్శకు వెళ్లినా వైఎస్‌ఆర్, జగన్‌లనే విమర్శిస్తూ ముందుకెళుతున్నారు.

  •     పస్తుత రాజకీయాల్లో మాటమీద నిలబడి ప్రజలకు మంచి చేసే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. కాచే చెట్టుకే రాళ్లు పడుతాయన్నట్లు.. గెలిచే పార్టీ మనదే కాబట్టి అందరు మనల్నే టార్గెట్ చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారు.

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top