అన్నీ ఉంటేనే అనుమతి | Sakshi
Sakshi News home page

అన్నీ ఉంటేనే అనుమతి

Published Thu, Apr 23 2020 4:13 AM

Inter board has decided to grant permits only to colleges that strictly follow to govt regulations - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్‌లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్‌లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేశారు.  

► రాష్ట్రంలో ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, జూనియర్‌ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్‌ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందించాలి.  గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది.   
► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్‌/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్‌స్పెక్షన్‌ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్‌లైన్‌లో సమర్పించాలి. 
► ‘హెచ్‌టీటీపీఎస్‌://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్‌వర్డ్‌ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. 
► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్‌స్పెక్షన్‌ ఫీజులను ఆన్‌లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్‌ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. 
► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. 
► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్‌సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. 
► భవనపు రిజిస్టర్డ్‌ లీజ్‌ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్‌ డీడ్‌లను పరిశీలిస్తారు.  
► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్‌ సౌండ్‌నెస్‌ సర్టిఫికెట్‌లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. 
► పార్కింగ్‌ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. 
► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. 

Advertisement
Advertisement