డీఎస్పీని కొట్టిచంపారు!

డీఎస్పీని కొట్టిచంపారు! - Sakshi

శ్రీనగర్‌లో మసీదు ముందే కిరాతకం

- శుక్రవారం ప్రార్థనలకు భద్రతగా వచ్చిన డీఎస్పీ

పరిస్థితులు సమీక్షిస్తుండగా ఒక్కసారిగా దాడి

 

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని మసీదు ముందే ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. శ్రీనగర్‌లోని చారిత్రక జామియా మసీదు ముందు భద్రతకోసం వచ్చిన ఓ డీఎస్పీ అధికారిని బట్టలూడదీసి మరీ కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసింది. రంజాన్‌లో పవిత్రమైన చివరి శుక్రవారం మసీదు ముందే ఇలాంటి దారుణమైన ఘటన యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. పోలీసులతో ఇలా అమానుషంగా, అవమానకరంగా వ్యవహరిస్తుంటే.. ఇంకెంతకాలం వాళ్లు ఓపికగా ఉంటారన్నారు. పోలీసుల సహనం నశిస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటన ఇస్లాం మత విశ్వాసాలు, విలువలకు పూర్తి విరుద్ధమని వేర్పాటువాద నేత మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.

 

అసలేం జరిగింది?

రంజాన్‌ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మసీదు నుంచి ప్రార్థనలు చేసిన వారంతా బయటకు వస్తున్నారు. మసీదు వద్ద  శుక్రవారం  ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. డీఎస్పీ మహ్మద్‌ అయూబ్‌ పండిత్‌ కూడా ప్రార్థనామందిరం లోపల భద్రతను సమీక్షించి బయటకు వస్తున్నారు. అంతలోనే అక్కడున్న కొందరు యువకులు డీఎస్పీపై ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అయూబ్‌ బట్టలూడదీసి మరీ చితగ్గొట్టారు. చచ్చిపోతున్నాను వదలమని అర్థించినా వదలకుండా కొట్టి చంపారు. అయితే తనను తాను రక్షించుకునేందుకు అయూబ్‌ మూడు రౌండ్లు కాల్పులు జరిపారని దీంతో ముగ్గురికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

భద్రతకోసం వచ్చి వారిచేతుల్లోనే!

మసీదు లోపలినుంచి వస్తున్నవారి ఫొటోలను తీస్తున్నసమయంలో దాడి జరిగినట్లు తెలిసింది. తమను ఫొటో తీయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు డీఎస్పీపై దాడికి పాల్పడ్డారని.. వీరినుంచి తననుతాను కాపాడుకునేందుకు అయూబ్‌ తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులై డీఎస్పీని కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావటంలేదు. ‘మసీదుకు వచ్చే వారి రక్షణ కోసమే అయూబ్‌ విధులు నిర్వహిస్తున్నారు. కానీ తమ భద్రతకోసం వచ్చిన పోలీసు అధికారినే కొట్టి చంపటం దురదృష్టకరం’ అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మసీదులో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని ప్రాథమిక విచారణ అనంతరంవెల్లడించారు. డీఎస్పీని కొట్టి చంపిన తర్వాత అక్కడున్న పోలీసు ఔట్‌పోస్టులనూ ధ్వంసం చేశారు. పోలీసు బలగాలు రంగంలోకి దిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాయి. డీఎస్పీ హత్యకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయగా.. మరొ వ్యక్తిని గుర్తించినట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వైద్‌ తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. ‘డీఎస్పీ ఆత్మరక్షణ కోసమే మూడురౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. అది అతని హక్కు’ అని డీజీపీ పేర్కొన్నారు. 

 

వారి సహనం నశిస్తే అడ్డుకోలేం: ముఫ్తీ

హత్యకుగురైన డీఎస్పీ మృతదేహం వద్ద జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. ‘ఇంతకన్నా మరో అవమానకరమైన విషయం వేరొకటి ఉంటుందా? మా ప్రజలతో వ్యవహరిస్తున్నామన్న  ఆలోచనతోనే పోలీసులంతా చాలా ఓపికగా ఉన్నారు. డీఎస్పీ ప్రజలను కాపాడే బాధ్యతలోనే మసీదుకెళ్లారు. సొంతపనిమీద కాదు. కానీ ఇలా వీరు ఓపికగా ఎంతకాలం ఉండాలి? వారి సహనం నశిస్తే పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి’ అని హెచ్చరించారు. డీఎస్పీని కొట్టి చంపిన వారు నరకానికి పోతారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన దిగజారుడుతనానికి పరాకాష్ట అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పేర్కొన్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top