సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!

సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు! - Sakshi

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొదలైన దాడులు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అన్నానగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరో ఆరుచోట్ల కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. టీటీడీ సభ్యుడు శేఖరరెడ్డి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన తర్వాత ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సీఎస్ ఇంటిపై దాడులు జరగడం విశేషం. సమన్లు జారీ చేసి మరీ ఈ దాడులు చేస్తున్నారు. 

 

గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేఖరరెడ్డి ఇంటిపై దాడి తర్వాత పలువురిపై దాడులు జరగొచ్చని సమాచారం ఉంది. కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం రామ్మోహనరావు ఇంట్లో రెండు బృందాలు, మిగిలినచోట్ల మరిన్ని బృందాలు ఉన్నాయి. 

 

అన్నానగర్‌లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్‌ నంబరులో ఉన్న ఆయన ఇంటికి తొలుత సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చారు. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. టీటీడీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే సమాచారం అందిన తర్వాతే ఐటీ విభాగం అధికారులు చురుగ్గా స్పందించినట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను శాఖతో పాటు ఇతర శాఖలు అందించిన సమాచారం ఆధారంగానే సీఎస్ ఇంటి మీద ఆదాయపన్ను దాడులు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

 

రాష్ట్రానికే అవమానం: స్టాలిన్


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఐటీ దాడులు జరగడం అంటే అది తమిళనాడు రాష్ట్రానికే అవమానమని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. 


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top