లోకేష్ రోడ్‌షోలో లడాయి

లోకేష్ రోడ్‌షోలో లడాయి - Sakshi


టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ  పరస్పర దాడులు  పెబ్బేరులో ఉద్రిక్తం


  • లోకేష్ వాహనంపై మామిడిపళ్లు, వాటర్ బాటిళ్లు విసిరిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు

  • పోలీస్‌స్టేషన్ ఎదుటే బీజేపీ నేత టవేరా వాహనం అద్దాలూ ధ్వంసం

  • ప్రతిగా టీఆర్‌ఎస్ నేత కారుకు నిప్పంటించిన టీడీపీ కార్యకర్తలు


పెబ్బేరు,న్యూస్‌లైన్:  టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివ రాలు.. అలంపూర్ వైపు నుంచి వచ్చిన లోకేష్‌రోడ్‌షో రాత్రి   పెబ్బేరుకు చేరుకుంది.  ఈ సందర్భంగా లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్త ఎల్లారెడ్డి మరి కొందరు వాటర్ బాటిళ్లు, మామిడిపళ్లను విసిరారు. దీంతో లోకేష్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. ఎల్లారెడ్డిని పట్టుకోగా, టీడీపీ కార్యకర్తలు చితకబాదారు.

 

 పోలీసులు అతడిని రక్షించి అతి కష్టంమీద పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొద్దిసేపు మాత్రమే ప్రసంగించిన లోకేష్ వెంటనే కొత్తకోట వైపునకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన వెంటనే టీడీపీ కార్యకర్తలు సభాస్థలంలోనే ఉన్న ఎల్లారెడ్డి ఇండికా కారును పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇండికా కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు వనపర్తి వైపు వెళ్తున్న బీజేపీ నేతకు చెందిన టవేరా వాహనం అద్దాలను పోలీస్‌స్టేషన్ ఎదుటే ధ్వంసం చేశారు. పోలీసులు అప్రమత్తమై దుకాణాలను బంద్ చేయించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన ఎల్లారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడతామని పెబ్బేరు ఎస్.ఐ. మహేశ్వరరావు తెలిపారు.

 

రెచ్చగొట్టి మరీ వెళ్లిన లోకేష్

మహబూబ్‌నగర్‌లోని 43వ జాతీయ రహదారి సాక్షిగా.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టారు. ‘నాన్నకు  నేను ఒక్కడినే కొడుకును. నాకు ఆరు లక్షల మంది టీడీపీ కార్యకర్తలు కుటుంబసభ్యులు. నాపై దాడికి దిగితే వారు సహించరు’ అంటూ పరోక్షంగా వారిని రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేసి అక్కడ నుంచి కదిలారు. ఈ నేపథ్యంలో లోకేశ్ వెళ్లిన ఐదు నిమిషాలకే టీఆర్‌ఎస్ స్థానిక నాయకుడు పెద్ద ఎల్లారెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు తగుల పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి అది బూడిదైంది.

 

లోకేష్ వెళ్తూ టీడీపీ నేతలకు ఏవో ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, ప్రత్యర్థి పార్టీ వారు బీరు సీసాలు విసరడంతో నాగర్‌కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి బక్కని నర్సింహులు గాయపడ్డారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి ఆయన్ను శంషాబాద్‌లోని ట్రెడెంట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు మీడియా దృశ్యాలను పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో అడుగు పెట్టిన తొలి పర్యటనలోనే నారా లోకే ష్ దాడులకు ఉసిగొల్పడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top