నిమ్మల భూ కిరికిరి

నిమ్మల భూ కిరికిరి


–  పేద రైతుకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు

– అన్ని విధాలా సహకరించిన  రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు

– లబోదిబోమంటున్న బాధితుడు


––––––––––––––––––––––––––

ఈ భూమి  గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 476లో ఉంది. మొత్తం విస్తీర్ణం 13.30 ఎకరాలు. 44వ జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. దీంతో ఎకరా ఎంతలేదన్నా  రూ.25 లక్షలకు పైమాటే. గతంలో ఈ భూమితో పాటు మిగిలిన భూములనూ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) కోసం సేకరించారు. అయితే.. పట్టా భూమి అని తేలడంతో రెవెన్యూ అధికారులు సెజ్‌ పరిధి నుంచి తప్పించారు. ఆ తర్వాత లొసుగులను ఆధారంగా చేసుకుని అధికార పార్టీకి చెందిన  హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయులు నిమ్మల శిరీష్, అంబరీష్‌ తమ వశం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల సహకారంతో  భూముల రికార్డులనే మార్చి.. ఇందులోని 4.66 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ (డాక్యుమెంట్‌ నం: 3761/16) చేయించుకున్నారు.



గోరంట్ల : గోరంట్ల మండలంలో ఇటీవల భూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. పేదల అమాయకత్వాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఈ అక్రమాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు తేలడం గమనార్హం. గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 476లో ఉన్న 13.30 ఎకరాల భూమిని 1920వ సంవత్సరంలో తమ్మినాయనిపల్లికి చెందిన వడ్డే సుంకుడు అనే వ్యక్తికి ప్రభుత్వం పంపిణీ చేసింది. తదనంతరం అతని కుమారుడైన వడ్డే సుంకన్న అలియాస్‌ ఎద్దుల ఆయప్పకు సంక్రమించింది. అతను అదే గ్రామానికి చెందిన∙కుమ్మర మల్లయ్య, కుమ్మర ఈరన్నలకు విక్రయించాడు.



రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు నంబర్లు 263/1973, 264/1973. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటూ ఉండేవారు. అయితే.. 2011లో  ఇందులోని  8.64 ఎకరాల భూమిని గోరంట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు చెన్నకష్ణారెడ్డి, ధర్మవరం పట్టణానికి చెందిన కదిరప్ప కలిసి కొనుగోలు చేశారు. మరో 1.33 ఎకరాలను కదిరప్ప ఒక్కరే కొన్నారు. మిగిలిన 3.33 ఎకరాలను కుమ్మర మల్లయ్య రెండో భార్య మల్లక్క కుమారుడు మల్లేశప్ప సాగు చేస్తున్నాడు. 2013లో పట్టాదారు పాసుపుస్తకాన్ని (1బీ నంబర్‌  2579) కూడా పొందారు. ఆ తర్వాత వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేయించుకున్నారు.



ఆర్డీఓ కోర్టు తీర్పూ వారి పక్షమే..

 బూదిలి, వడిగేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 5,733.60 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ భూములను  ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) కోసం సేకరించాలని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ (కర్నూలు) కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌కు 2008 మే 30న లేఖ (ఆర్‌సీ నంబర్‌ : జెడ్‌ఓ/ఏపీఐఐసీ–కేఎన్‌ఎల్‌/ఐపీ 2277/08) వచ్చింది. 476 సర్వేనంబర్‌లోని 13.30 ఎకరాలు పట్టా భూమిగా గుర్తించి..భూసేకరణ నుంచి మినహాయించారు.



అయితే.. 2014లో అప్పటి తహశీల్దార్‌ ఈ భూమి కూడా ప్రభుత్వానిదేనని, స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీనిపై భూమిని కొనుగోలు చేసిన చెన్నకష్ణారెడ్డి, కదిరప్పతో పాటు అనుభవంలో ఉన్న మల్లేశప్ప ఆర్డీఓ కోర్టులో అప్పీలు చేశారు. ఈ భూమి వారికే చెందుతుందని ఆర్డీఓ కోర్టు 2015 జూలై 22న తీర్పు ఇచ్చింది.



‘నిమ్మల’ంగా ఏమార్చారు!

కదిరప్ప కొన్న 1.33 ఎకరాలు, మల్లేశప్ప ఆధీనంలోని 3.33 ఎకరాలు కలిపి మొత్తం 4.66 ఎకరాల భూమి చుట్టూ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు రాళ్లు పాతించారు. దీన్ని గమనించిన బాధిత రైతుతో పాటు భూమిని కొన్న వ్యక్తులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత నెల 30న వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించగా సుంకన్న అలియాస్‌ ఎద్దుల ఆయప్ప భార్య అంజినమ్మ పేరిట వివరాలు నమోదై ఉన్నాయి. అలాగే ఈ నెల ఒకటిన ఎంపీ తనయులు నిమ్మల శిరీష్‌ , అంబరీష్‌  చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో  రిజిస్ట్రేషన్‌ (డాక్యుమెంట్‌ నంబర్‌ 3761/2016) పొందారు. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా సెక్షన్‌  22(ఏ) అనెగ్జర్‌ 5 కిందకు వచ్చే ఈ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలంటే  కలెక్టర్‌ ఎన్‌ఓసీ అవసరం. అయినప్పటికీ చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసేశారు.

 

తహశీల్దార్‌ ఏమంటున్నారంటే..

రిజిస్ట్రేషన్‌ విషయం తన దష్టికి రాలేదని గోరంట్ల తహసీల్దార్‌ హసీనా సుల్తాన్‌ చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం  సంబంధిత వీఆర్‌ఓ నమోదు చేశారని, అతనిపై శాఖ పరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. మరి డిజిటల్‌ కీ మీరేలా ఇచ్చారని  అడగ్గా.. ఆమె సమాధానం దాటవేశారు.



న్యాయం చేయాలి

భూములను కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులకు అనుకూలంగా  వ్యవహరించడంతో నాకు అన్యాయం జరిగింది. నా 3.33 ఎకరాల భూమిని మరొకరి పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి..వారి నుంచి ఎంపీ తనయులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఎంపీ స్థాయి వారితో సామాన్యుణ్ని ఏవిధంగా పోరాడగలను?! అధికారుల నిర్వాకం వల్ల మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

– మల్లేశప్ప, బాధిత రైతు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top