గంటా-అయ్యన్న మధ్య మరో వార్

గంటా-అయ్యన్న మధ్య మరో వార్ - Sakshi


భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయ్యన్న రిసార్ట్

* దానిని భూసేకరణ పరిధిలోకి తెచ్చిన మంత్రి శ్రీనివాసరావు

* అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం హామీ


సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ్యవహారం ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపింది. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ పేరుతో తనను ఆర్థికంగా బలహీనపరిచేందుకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు.



తాను కొన్ని సంవత్సరాల క్రితం సంపాదించుకున్న ఆస్తులను భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భూ సేకరణ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా మంత్రి గంటా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఈ విషయమై వెంటనే స్పందించాలని సీఎంను కోరారు. వివరాల్లోకి వెళితే... గంటా, అయ్యన్నపాత్రుడు విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి మధ్య తొలినుంచీ విభేదాలున్నాయి. ఇరువురి మధ్యా పలుమార్లు వివాదాలు పెచ్చుమీరడంతో  సీఎం ఇద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసినా అది పొసగ లేదు. అది పెద్దదై ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.



ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందిన సన్‌రే విలేజ్ రిసార్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పరిధిలోకి తెచ్చేందుకు గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులు భాగస్వాములుగా ఉన్న ఈ రిసార్ట్ ప్రతిపాదిత భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మరో మంత్రి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ విషయంలో మంత్రులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలు మంత్రివర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.



ఉత్తరాంధ్ర మంత్రులకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటాకు ఈ పని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు వాటా కలిగిన సన్‌రే విలేజ్ రిసార్ట్‌ను కూడా భూ సేకరణ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా గంటా ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ రిసార్ట్‌ను కూడా భూ సేకరణ పరిధిలోకి తీసుకొస్తూ చర్యలు తీసుకున్నారు.



వాస్తవానికి గంటా ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు మంత్రి అయ్యన్న విదేశీ పర్యటనలో ఉన్నారు. వచ్చిన తర్వాత  విషయం తెలుసుకున్న అయ్యన్నపాత్రుడు మంగళవారం, బుధవారాల్లో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో అపాయింట్‌మెంట్ తీసుకుని ఈ అంశమై ఫిర్యాదు చేశారు. తన  కుటుంబసభ్యుల భాగస్వామ్యం ఉన్న రిసార్ట్‌ను వెంటనే భూ సేకరణ పరిధి నుంచి తొలగించాల్సిందిగా ఆయ్యన్నపాత్రుడు సీఎంకు విజ్ఞప్తి చేయటంతో... అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top