అల్లుడి గురించి అత్తే చెప్పాలి: లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు - Sakshi


గుంటూరు : టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రెండోరోజు ప్లీనరీ సమావేశాల్లో వైఎస్‌ఆర్‌ సీపీ శ్రేణులపై దాడులపై పార్టీ నేత పార్థసారధి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమె బలపరిచారు.


ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ... తన భర్తకు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారణమై, చంద్రబాబు అన్యాయానికి బలైన తనను వైఎస్‌ఆర్‌ సీపీ తల్లిలా ఆదరించిందన్నారు.  ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, ఆయన ఆకస్మిక మరణ వార్త విని తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వైఎస్‌ఆర్‌ మరణించినా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.



అల్లుడి గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలని... తన భర్త ఎన్టీఆర్‌తోనే చంద్రబాబు హత్యా రాజకీయాలు ప్రారంభించారని లక్ష్మీ పార్వతి అన్నారు. అలాగే వంగవీటి రంగా హత్యకేసులోను బాబు పాత్ర ఉందని ఆరోపించారు. అంతేకాకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఇక కాపు ఉద్యమాన్ని అణచివేయాలన్న కుట్ర చేస్తున్నారని, ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.



తాను వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ’అలిపిరి’  ప్రమాదం నుంచి బయటపడ్డానని చంద్రబాబు ఓ సభలో చెప్పారని లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా  గుర్తు చేస్తూ... ‘వెంకటేశ్వరస్వామి ఓ భక్తుడి కలలో కనిపించి ...అనేక పాపాలు చేసిన చంద్రబాబు నా సన్నిధిలో చనిపోతే.. తనకు చెడ్డపేరు వస్తుందనే’ అతడిని ప్రాణాలతో బయటపడేలా చేశానని’  చెప్పారన్నారు. 


చంద్రబాబులాంటి దుష్టుడి పాలనలో.... ప్రజలకు సుఖశాంతులు ఉండవని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే ....అక్కడ కరువేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాపాలకు ఆయన కుమారుడు లోకేశ్‌ రూపంలో ఫలితాన్ని అనుభవిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి వైఎస్‌ఆర్‌ సీపీతోనే  సాధ్యమన్న లక్ష్మీపార్వతి....వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. చంద్రబాబు దుష్ట పాలన అంతానికి అందరు ముందుకు రావాలని, ఆయన్ని ఇంటికి పంపి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని లక్ష్మీపార్వతి అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top