'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి'

'వచ్చే ఎన్నికల్లో బాబుకు ఒకటి, పప్పుకొకటి' - Sakshi


గుంటూరు: 'వెన్నుపోటే చంద్రబాబు ఊపిరి. మోసమే ఆయన శ్వాస. పిచ్చిపట్టి తిరుగుతున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిది' అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనపై నిప్పులు చెరిగారు. వైఎస్‌ హయాంలో కొనసాగిన సుభిక్ష పరిపాలనను గుర్తు చేశారు. రాజకీయాలన్నా, నాయకులన్నా చులకన భావం ఉన్న రోజుల్లో తొలి సంతకంతోనే మాట నిలబెట్టుకొని ప్రజలను ఆకర్షితులను చేసిన ఏకైక గొప్ప నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు.



ఇచ్చిన వాగ్దానాలనే కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడని కొనియాడారు. కానీ, ఇప్పుడు మాత్రం ఒక హామీ ఇస్తే ఏవిధంగానైనా మోసం చేయవచ్చని, వెన్నుపోటే ఊపిరిగా, మోసమే శ్వాసగా, 600ల హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన నీచమైన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రైతాంగాన్ని, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను, రూ. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి అని రైతాంగాన్ని మోసం చేసిన అతిపెద్ద వెన్నుపోటుదారు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 2019లో ఎన్నికల కోసం రాష్ట్రమంతటా ఎదురు చూస్తుందన్నారు.



అంతకంటే ముందు చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని, పిచ్చిపట్టి తిరుగుతూ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. నోబుల్‌ ప్రైజ్‌ అని, మద్యం తాగండని పరివిధాలుగా మాట్లాడుతూ మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని చెప్పారు. దయచేసి చేసి ఆయన పిచ్చి ఆసుపత్రికి వెళ్లి మైండ్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై ఎన్ని దాడులు చేసినా వైయస్‌ జగన్‌ సహనం, ఓపికతో ఉన్నారని, ఆయన కన్నెర్ర జేస్తే అధికారంలో ఉన్నా రాష్ట్రంలో టీడీపీ జెండా కూడా ఉండదని హెచ్చరించారు.



2019 తరువాత చంద్రబాబు చెప్పినట్లుగా ఒకే పార్టీ ఉంటుందని, వైయస్‌ఆర్‌ సీపీ అని స్పష్టం చేశారు. 2019 తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 173 స్థానాలు గెలుచుకొని, టీడీపీకి రెండే సీట్లు ఇస్తుందని ఒకటి చంద్రబాబుకు, రెండు పప్పు(లోకేశ్‌)కు ఇస్తామని తెలిపారు. శాసనసభలో ఒక కామెడీ ఆర్టిస్టు కూడా ఉండాలని, అది లోకేష్ అయితే బావుంటుందని చెప్పారు. ప్రస్తుతం కారు కూతలు కూస్తున్నవారందరికీ త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top