రాజధాని రైతుకు భరోసా | ysrcp gives support to the farmers | Sakshi
Sakshi News home page

రాజధాని రైతుకు భరోసా

Nov 14 2014 1:21 AM | Updated on Jul 25 2018 4:07 PM

రాజధాని రైతుకు భరోసా - Sakshi

రాజధాని రైతుకు భరోసా

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతు..

గుంటూరు సిటీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం జరిపిన పర్యటన బాధిత రైతుల్లో భరోసా నింపింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేతల వైఖరితో ఆందోళన చెందుతున్న ఆయా గ్రామాల రైతుల్లో నమ్మకాన్ని కలగజేసింది.

నాయకులంతా మూకుమ్మడిగా తమ గ్రామాలకు తరలి రావడం, జోరు వానలో కూడా బురదలో నడుస్తూ సారవంతమైన తమ పొలాల్లో పర్యటించడం వారిలో నూతనోత్తేజాన్ని రేకెత్తించింది. రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సహించబోమని వైఎస్సార్ సీపీ నేతలు సంఘటితంగా స్పష్టం చేయడంతో వారికి తమ భూములపై, భవితపై నమ్మకం కుదిరింది. ఉదయం ఉండవల్లి నుంచి ప్రారంభమైన కమిటీ పర్యటన పెనుమాక, నిడమర్రు గ్రామాల్లో సాగింది.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్థసారథి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కోన రఘుపతి, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, రైతు నేత ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు గ్రామాల్లో పర్యటించారు.

అక్కడి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులను అంచనా వేశారు. రైతుల ఆవేదనను ఆలకించారు.

తొలుత రాజధాని నిర్మాణానికి పొలాలిచ్చే అంశంపై ఉండవల్లి ఉగ్రరూపం దాల్చింది. ఊరు ఊరంతా ఉవ్వెత్తున విరుచుకుపడింది. ప్రాణాలైనా ఇస్తాం కానీ పొలాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ‘మా సమాధులపై సింగపూర్ కడతారా?’ అని ప్రశ్నించింది.
 
పెనుమాక పెనుకేక పెట్టింది. లాఠీలు, తూటాలకు బెదరనంది. ప్రభుత్వ ప్యాకేజీలకు లొంగనంది. ప్రభుత్వం తమ పొలాల జోలికొస్తే తరిమి తరిమి కొడతానంది.
 
నిడమర్రు చిర్రు బుర్రులాడింది. ఎకరం కూడా ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించింది. కావాలంటే ఎకరానికో రూ.లక్ష చొప్పున రాజధాని నిర్మాణానికి చందా ఇస్తానంది. సారవంతమైన తమ పొలాలు వదిలేసి వేరే ఎక్కడైనా నిర్మించుకోవాలని హితవు పలికింది.
 
కమిటీ నేతల ఎదుట రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పసిడి రాశులు పండించే భూములను చిన్నాభిన్నం చేసే చంద్రబాబునాయుడు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని మనవి చేసుకున్నారు.
 
ఈ సమయంలో తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదనీ, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే తామీ పర్యటనకు వచ్చామనీ, ఇందులో రాజకీయానికి తావు లేదనీ చెప్పిన వైఎస్సార్ సీపీ నేతల మాటలకు స్థానిక రైతుల్లో అనూహ్య స్పందన కనిపించింది.
 
ఇంతటితో ఆగబోమని, దఫదఫాలుగా పర్యటిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదనీ పదే పదే చెప్పడంతో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు ప్రజలు, రైతులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా హక్కుల కమిటీ ముందుంచారు. ఆయా గ్రామాల రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
 
తిరుగుబాటు చేస్తాం..

మావి సారవంతమైన భూములు. తరతరాలుగా పొలాలను నమ్ముకుని బతుకుతున్నాం. అమ్ముకుని కాదు. ఎట్టి పరిస్థితుల్లో గజం భూమి కూడా ఇచ్చేది లేదు. మాకు ఏ ప్యాకేజీలూ అక్కర్లేదు. కాదూ కూడదని లాక్కునే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తాం. అప్పుడు మమ్మల్ని చంపి మా సమాధులపై సింగపూర్ తరహా రాజధాని కట్టుకోమనండి.
- పి.శంకర్‌రెడ్డి, రైతు, ఉండవల్లి

లాఠీలు, తూటాలకు బెదరం
ప్రభుత్వ భూములు అనేకం ఉండగా రాజధాని నిర్మాణానికి రైతుల భూములే కావాల్సి వచ్చాయా? వారు కావాలన్నా మేము ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేము. వాళ్లు ఒప్పుకున్నారు, వీళ్లు ఒప్పుకున్నారు అంటూ ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తోంది. ఈ మాయ మాటలు మేము నమ్మం. అలాగని బల ప్రయోగం చేసినా బెదరం. లాఠీలు, తూటాలకు భయపడి ప్రభుత్వానికి లొంగిపోయే ప్రసక్తే లేదు.
- కోటిరెడ్డి, పెనుమాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement