మాట తప్పడం మా రక్తంలో లేదు: వైఎస్‌ షర్మిల




గుంటూరు : ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు ఆడటం తమకు చేతకాదని వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల పక్షమని, ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమన్నారు. రుణమాఫీ చేస్తామని ఒక్క అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే వైస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  2014లో అధికారంలో వచ్చి ఉండేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వైఎస్‌ షర్మిల హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  అధికారం కోసం ఇచ్చిన మాట తప్పడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మంచిదని జగనన్న మాటలు తనకింకా గుర్తున్నాయన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం వైఎస్‌ రాజశేఖరరెడ్డి నైజం అయితే... అది తన అన్న జగన్‌ సిద్ధాంతమన్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, అయితే ఆ మెజార్టీ చంద్రబాబు విశ్వసనీయతను చూసి కాదని, తప్పుడు వాగ్ధానాలు చేస్తే ఆ మెజార్టీ వచ్చిందని వైఎస్‌ షర్మిల అన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.  



చంద్రబాబు అవినీతి ఖ్యాతి ఒక్క రాష్ట్రంలోనే కాదని, దేశమంతా పాకిందని వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. ఆయన దుర్మార్గం ప్రధాని మోదీకి కూడా అర్థమై పోయిందన్నారు. ఇక చంద్రబాబు పప్పులు ఉడకవని, ఆయన ఇంట్లో ఉన్న ఒక్క పప్పు తప్ప అని అన్నారు. దేవుడి దృష్టిలో కూడా చంద్రబాబు పాపం పండిపోయిందన్నారు. ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలని, అది ఆయనకు ఎప్పుడూ లేదన్నారు. చంద్రబాబుకు తెలిసిందల్లా వెన్నుపోటు పొడవటమే అన్నారు.  ఆయనవి దిగజారుడు రాజకీయాలే అని వైఎస్‌ షర్మిల విమర్శించారు.



ఫ్యాను గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని, వాళ్లతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఉచ్ఛం.. నీచం లేకుండా బాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు.. అని వ్యాఖ్యానించారు. అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు అని, బ్రీఫ్‌డ్‌ మీ అని ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి ఆయన అని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.



 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం  రాజన్న మీద అభిమానం.. జగనన్న మీద ఉన్న నమ్మకమే అన్నారు. ఈ బలం మరే పార్టీకి లేదని, ఒక్క వైఎస్‌ఆర్‌ సీపీకే సొంతమన్నారు. ప్రజల అండ,సహకారంతో పాటు దేవుడి దయ పుష్కలంగా ఉన్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ...అప్పుడు బాణంలా దూసుకుపోదామని వైఎస్‌ షర్మిల...పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయేది రాజన్న రాజ్యమని, ఆ లక్ష్యాన్ని సాధించబోయేది జగనన్న పోరాటమని, అది తథ్యమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top