అవినీతిలో యువ ఎస్‌ఐల స్పీడ్ | Sakshi
Sakshi News home page

అవినీతిలో యువ ఎస్‌ఐల స్పీడ్

Published Thu, Apr 14 2016 4:25 AM

అవినీతిలో యువ ఎస్‌ఐల స్పీడ్ - Sakshi

► దూకుడు
విధుల్లో బాధ్యతా రాహిత్యం
►  కేసుల నమోదులో ఏకపక్షం
ప్రోబేషన్ పీరియడ్‌లోనే లెక్కలేనన్ని ఆరోపణలు
►  వారం రోజుల క్రితం తలంటిన ఆదోని డీఎస్పీ
ఇప్పటికే పలువురు వీఆర్‌కు..

 
 
ఒంటిపైకి ఖాకీ చొక్కా వస్తే చాలు.. ఆ కిక్కే వేరు. ఇక భుజానికి రెండు స్టార్‌లు ఉంటే.. అబ్బో చెప్పక్కర్లేదు. భూమ్మీద కాళ్లు నిలవమన్నా నిలవ్వు. సినిమాల ప్రభావమో.. సీనియర్ల అడుగుజాడల్లో నడుద్దామనో.. కొత్త ఎస్‌ఐలు కొందరు దూకుడు మీదున్నారు. సమాజ సేవ చేయడం అటుంచితే.. అత్యాశ, ఆవేశం, అనుభవ లేమి వీరి
 పెడదోవకు కారణమవుతోంది.

 
 
 కర్నూలు: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న 2013వ బ్యాచ్‌కు చెందిన సుమారు 54 మంది ఎస్‌ఐలు అప్పుడే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల నమోదు సమయంలో ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉద్యోగాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ప్రొబేషన్ పూర్తి కాకముందే కొందరు ఎస్‌ఐల తీరు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలతో పది మందికి పైగా ఎస్‌ఐలు వీఆర్‌కు రావడం చూస్తే వీరి దూకుడు అర్థమవుతోంది. ఫిర్యాదుదారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం.. వివాదాలు.. సెటిల్‌మెంట్లు..స్థలాల విషయాల్లో స్టేషన్‌లోనే సివిల్ పంచాయితీలు చేయడం కొందరికి రివాజుగా మారింది. క్రైం రేటు ఎక్కువగా ఉండే స్టేషన్లలో అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. వారం రోజుల క్రితం ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని కొందరు యువ ఎస్‌ఐలను డీఎస్పీ శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చూస్తే వీరి పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.


 రాజీ పడరనుకుంటే..యువకులు, ఉత్సాహవంతులు శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తారని భావించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగులుతోంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకుండానే పలువురు ఎస్‌ఐలు ఆరోపణలపై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. గత ఎన్నికల సమయంలో నేతలకు అనుకూలంగా పనిచేయడంతో పాటు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే దారులు వెతుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో కాకపోయినా పక్క మండలాలకు వెళ్లి పంచాయతీలకు యత్నించి గతంలో ఇద్దరు యువ ఎస్‌ఐలు చిక్కుల్లో పడ్డారు. పైరవీకారులు స్టేషన్‌కు వెళ్తే సీటులో నుంచి లేచి మరీ స్వాగతిస్తున్నట్లు ఘటనలు జిల్లాలో కోకొల్లలు.


 తింటే తప్పేంటి?
 30 ఏళ్లకు పైగా బంగారు భవిష్యత్తు ఉందనే విషయం మర్చిపోయి ఏడాదో.. రెండేళ్లో అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు కొందరు యువ ఎస్‌ఐలు. తింటే తప్పేంటి..? అనే జాడ్యం వీరిలో కనిపిస్తోంది. శిక్షణ కాలంతో కలిపి ఎస్‌ఐలకు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత సబ్ డివిజన్ అధికారి ఇచ్చే పనితీరు నివేదిక ఆధారంగా ఎస్పీ వీరి ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేస్తారు. ఈలోగా మాండేటరీ కోర్సులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న ఎస్‌ఐలు ఎవరు కూడా మాండేటరీ కోర్సులు పూర్తి చేయకుండానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. గతంలో ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్‌ఐలపైనా అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు పడటం తెలిసిందే.


 చర్యలు తీసుకుంటున్నా..  షరా మామూలే..
 పారదర్శక పాలన, ప్రజామిత్ర పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరయ్యేందుకు జిల్లా పోలీసు బాస్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవినీతి మరకలు, ఆరోపణలు పోలీసు శాఖ పరువు బజారునపడుతోంది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ అనే తేడా లేకుండా కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తూ.. అక్రమార్కుల ఆట కట్టించేందుకు డీఐజీ స్థాయిలో పట్టు బిగిస్తున్నా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి లోపిస్తోంది.


 పోలీసులంటే.. వాళ్లు
 ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఁకొత్తగా* విధుల్లో చేరినప్పుడు తమ పనితీరుతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొందరు పోలీసు అధికారుల పేరు చెబితే అక్రమార్కులకు ఇప్పటికీ వణుకే. సిఫారసు చేయడానికి స్టేషన్‌కు వెళ్లాలంటే కూడా ఆలోచించే పరిస్థితి. కొన్ని తరహా నేరాల్లో రాజీ పడకపోవడం వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒకరిద్దరిని పక్కనపెడితే.. పరిస్థితి భిన్నంగా ఉంది.
 
 
  కొన్ని ఉదాహరణలు
 
నందవరం ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
గత నెలలో జొన్నిగిరి ఎస్‌ఐని కూడా వివిధ ఆరోపణలతో శ్రీశైలం బందోబస్తు విధుల్లో ఉండగానే వీఆర్‌కు రప్పించారు. మరో ఐదుగురు యువ ఎస్‌ఐలపైనా విచారణ జరుగుతోంది.
ఓ యువతి కిడ్నాప్ కేసులో భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో జిల్లా సరిహద్దు స్టేషన్‌లో పని చేస్తున్న ఓ యువ ఎస్‌ఐ శాఖాపరమైన చర్యలకు లోనయ్యాడు.
వివిధ ఆరోపణలో చార్జిమెమోలు అందుకున్న ఎస్‌ఐల సంఖ్య కూడా అధికంగానే ఉంది.

Advertisement
Advertisement