Hyundai Motor Company Opened A New Research And Development Center At Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

Hyundai Motor Company: హైదరాబాద్‌ కేంద్రంగా ‘హ్యుందాయ్‌’

Published Wed, Aug 9 2023 2:17 AM

 Hyundai Motor Company opened a new research and development center at Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్‌ హ్యుందాయ్‌ మోటార్‌ భారత్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్‌గా భారత్‌ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్‌ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది.

ఈవీలు, అటానమస్‌ సహా భవిష్యత్‌ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రిసర్చ్, డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్‌ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్‌ రికగి్నషన్‌ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్‌యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్‌ తెలిపింది. 2022–23లో భారత్‌లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్‌ కార్లు అమ్ముడయ్యాయి. 

భవిష్యత్‌ వ్యూహంపై.. 
‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్‌ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్‌–కియా నమ్యాంగ్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌తో కలిసి భారత మార్కెట్‌ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్‌ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ యూసన్‌ ఛంగ్‌ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు.  

భారీ లక్ష్యంతో.. 
ఎస్‌యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్‌ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్‌ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్‌ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్‌ (పర్పస్‌ బిల్ట్‌ వెహికల్స్‌) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్‌లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్‌ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్‌  తెలిపింది. 

Advertisement
Advertisement