వికటించిన వైద్యం.. వర్ధమాన నటి మృతి

జు టింగ్ చికిత్స పొందుతున్నప్పటి ఫొటో - Sakshi

బీజింగ్: వరుస అవకాశాలతో వృద్ధిలోకి వస్తోన్న యువ నటీమణి అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడి వైద్యం వికటించడంతో మృతిచెందిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనీస్ సినీపరిశ్రమలో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న 26 ఏళ్ల జు టింగ్ గతవారం కన్నుమూసినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. లింపథిక్ క్యాన్సర్ బారిన పడిన జు టింగ్.. జబ్బును నయం చేయించుకునేందుకు ఆధునిక వైద్యవిధానాన్ని కాదనుకుని సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారామె.

 

జులై 9న తనకు క్యాన్సర్ ఉందని ట్వీట్ చేసిన జు టింగ్.. తర్వాత కొద్ది రోజులకే 'కీమోథెరపీ అత్యంత బాధాకరం. నాకు తెలిసినవాళ్లలో క్యాన్సర్ బారిన పడిన కొద్దిమంది కీమో చేయించుకు ఎంత నరకం అనుభవించారో గుర్తుంది. అందుకే క్యాన్సర్ ఉందని తెలియగానే నేను కీమోథెరపీ కాకుండా చైనీస్ సంప్రదాయ వైద్యవిధానంలో కేన్సర్ ను తగ్గించుకోవాలనుకున్నా' అని మరో ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో చేరిన కప్ థెరపీ చేయించుకుంటున్న ఫొటో ఒకదానిని పోస్ట్ చేసి 'కొద్దిగా కొలుకుంటున్నాను'అని సమాచారం అందించింది. (తప్పక చదవండి: కప్పింగ్ చికిత్స.. ఓ నమ్మకం మాత్రమే)

 

అయితే ఆగస్టు 18 నాటికి జు టింగ్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 'ఈ విధానం(చైనీస్ వైద్యం)కూడా కీమోథెరపీలా బాధాకరంగానే ఉంది' అంటూ చివరి మెసేజ్ ను పోస్ట్ చేసిన కొద్దిరోజులకే ఆమె మృత్యువు ఒడిలోకి జారుకుంది. సెప్టెంబర్ 7న తన సహోదరి మరణించిందని, కప్పింగ్ థెరపీ, సూదులను శరీరంలోకి గుచ్చే పద్ధతి తదితర సంప్రదాయ విదానాలన్నీ బెడిసికొట్టడం వల్లే ఇలా జరిగిందని జు టింట్ సహోదరి విలేకరులకు తెలిపారు. దీంతో జు టింగ్ మరణం గురించి చైనా వ్యాప్తంగా చర్చ మొదలైంది. కీమోథెరపీ చేయుకుని ఉంటే ఆమె బతికి ఉండేదని, చైనీస్ వైద్యంలో పసలేదని కొందరు వాదిస్తున్నారు. కాగా, క్యాన్సర్ అత్యంత ప్రమాదకమైన వ్యాధిఅని, కీమోథెరపీ అయినా, చైనీస్ విధానంలోనైనా ఫలితాలను ఊహించలేమని మరికొందరు సోషల్ మీడియాలో పోట్లాడుకుంటున్నారు. స్వర్గంలోనైనా జు టింగ్ కు శాంతి లభించుగాక అని ఇంకొందరు ప్రార్థిస్తున్నారు.


 


 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top