ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి

ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి


 ఊళ్లో మతాంతీకరణలు జరుగుతున్నాయి. ‘ఆలా హజ్రత్’- అంటే నిజామ్ ప్రభువు కాలంలో మాల మాదిగల ఉద్ధరణ! ఏం లేదు... వాళ్ల బొట్టు చెరిపి, మొలతాళ్లు తెంపి, కొత్త చీర, కొత్త ధోవతి ఇచ్చి పేర్లు మారుస్తారు. గులామ్ రసూల్, గులామ్ నబీ, హాజిరా, కుల్సుంబీ.... ఊళ్లో అంతా అబ్బడ దిబ్బడగా ఉంది. కిరస్తానీలు కూడా ఈ పని చేస్తున్నారుగానీ వాళ్లకు రాజ్యబలం లేదు. రాజ్యబలం ఉన్నవారి మాటను కాదనడానికి లేదు. ఊళ్లో అందరికీ బాధగా ఉంది. ఒక అంగం ఏదో కోల్పోతున్న బాధ. మాల మాదిగలందరూ తమతోనే ఉండాలి. ఊరికి దూరంగా ఉండాలి. అంటరానివాళ్లుగా ఉండాలి. తమ పనులేవో చేస్తుండాలి. వాళ్లు మతం మారి అందరితో సమానం అయితే అదో నొప్పి. మరి దీనిని ఎదిరించేవారే లేరా? ఉన్నాడు. కంఠీరవం!

 

 ‘ఇది అన్యాయం’ అని అడ్డుపడ్డాడతడు. నీలకంఠం మాటకు ఊళ్లో విలువ ఉంది. కొద్దోగొప్పో చదువుకున్నవాడు. లోకజ్ఞానం తెలిసినవాడు. పైగా అందరూ గౌరవించే  వైష్ణవ మతస్తుడు.

 

 ‘అంటరానివాళ్లను ఉద్ధరిస్తానంటే నీకెందుకు బాధ’ అన్నాడు అంజుమన్ నాయకుడు.

 ‘ఇదిగో. ఈ ఊళ్లో దొర ఉన్నాడు. ఆ దొరకు పెద్ద గుమాస్తాగా, ప్రభుత్వ ప్రతినిధిగా హైదరలీ అనే పెద్దమనిషి ఉన్నాడు. మీ మతంలో అందరూ సమానమైతే అతడు కూడా దొరతో కలిసి మాల మాదిగలను ఎందుకు హింసించాడు?’ అన్నాడు. సూటి ప్రశ్న. జవాబు లేదు. ఇక్కడ మతం ఏమిటన్నది ముఖ్యం కాదు. అధికార ప్రాబల్యం ఎవరికుంది అన్నది ముఖ్యం. దొరలూ, దొరలతో పాటు మిలాఖాత్ అయిన నిజాం బంట్లు అందరూ కలిసి పీడించేది బీదా బిక్కి జనాలనే... కాపులనూ.... అంటరానివాళ్లనే. ‘మరి పరిస్థితిలో ఏ మార్పూ లేనప్పుడు వారు మతం మారి మాత్రం ఏమిటి ప్రయోజనం’ అన్నాడు కంఠీరం. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారిని సాధారణంగా బయట తిరగనీయరు. జైల్లో పెడతారు. కంఠీరవంను కూడా నిజామాబాద్ జైల్లో వేశారు. కాని కంఠీరవం రగిల్చిన స్ఫూర్తి- ఆ ఊరు- దిమ్మెగూడెంలో రగులుతూనే ఉంది.

 

 జైల్లో అసలైన లోకాన్ని చూశాడు కంఠీరవం. నోరు లేని వాళ్లందరూ అక్కడ ఖైదీలు. దొరలను ఎదిరించి, దొరల బంట్లను ఎదిరించి దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్నారు. అన్యాయం అని అరిచిన ప్రతి ఒక్కడికీ అదే గతి. మరో వైపు బషీర్‌లాంటి అనాధలను దొంగలుగా చేసి వారిని దొంగ బతుకు బతికేలా చేసి దారుణంగా హింసించే పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థలో ఉన్నది ముస్లింలే. బషీర్ కూడా ముస్లిమే. ఏమిటి ప్రయోజనం? వ్యవస్థలో అనుభవించేవాడికి మతం లేదు. అవమానాలు పొందేవాడికీ మతం లేదు.

 

 కంఠీరవం ఇంకోటి కూడా గ్రహించాడు. ఆచారాలు, విశ్వాసాలు అంటూ కులాలు, గోత్రాలు అంటూ ఆర్య సంస్కృతి వృద్ధి చేసిన విష పరంపర. ఇంత చదువు చదివీ ఇంత లోకం చూసిన తనే సాటి మనిషితో కలిసి భోం చేయ నిరాకరిస్తున్నప్పుడు సంప్రదాయవాదులు చేసే దౌర్జన్యాలు, చూపే నీచత్వం ఎంత తీవ్రంగా ఉంటాయి? ‘ఆర్య సంస్కృతి మంచిదే. కాని దానికి ఇంకా పూర్ణత్వం రాలేదు’ అని అనుకున్నాడు కంఠీరం. పరివర్తన అనేది తన నుంచే మొదలవ్వాలి. తన సంస్కృతిని చక్క దిద్దుకోవాలంటే తనలోని ప్రతివారూ తనతో సమానం అనుకోవాలి. అలానే అనుకోవడం మొదలుపెట్టాడు కంఠీరం. బషీర్ తన స్నేహితుడు. కాపుల కుర్రవాడు కొమరయ్య తల్లే తన తల్లి. ఊరంటే పరస్పరం ప్రేమగా ఉండే ఒక సమూహం.

 ఈ ఎరుకతో శిక్షాకాలం తర్వాత ఊరు చేరుకున్నాడు కంఠీరవం. అప్పటికే అక్కడ భూమిక సిద్ధం అయి ఉంది.

 

  మతాంతీకరణలకు వ్యతిరేకంగా పని చేయడానికి వచ్చిన ఆర్యసమాజ్ కార్యకర్త విజయ్‌దేవ్- అసలు మతాంతీకరణలకు కారణం మతం కాదనీ వ్యవస్థలోని పీడన అని గ్రహించాడు. ఊరి దొర- రామ భూపాల్‌రావు బర్రె ఉన్నవాడి దగ్గర బర్రె లాక్కుంటూ, ఎడ్లు ఉన్నవాడి దగ్గర ఎడ్లు లాక్కుంటూ, భూమి ఉన్నవాడి దగ్గర భూమి లాక్కుంటూ, ఏమీ లేనివాడి దగ్గర మిరపకాయలో మంచి నెయ్యో లాక్కుంటూ ఉంటే జనం ఏం చేస్తారు? గాలికి పోయే గడ్డిపోచనైనా గట్టిగా పట్టుకుందామనుకుంటారు. ముందు ఈ దొరను కూల్చాలి అని గ్రహించాడు విజయ్‌దేవ్. కంఠీరవం వచ్చి అసలు ఈ నిజాము సర్కారునే కూల్చాలి అన్నాడు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం వస్తే మన బాధలన్నీ తొలగి పోతాయి అని పిలుపు ఇచ్చాడు. కాంగ్రేసు ఉద్యమంలోకి సమరోత్సాహంతో దూకితే విజయం ఖాయం అనే నిశ్చయానికి వచ్చాడు. అతడి కల అదే.

 

 నిజంగా ప్రజాప్రభుత్వం రావాలి. ప్రతి పాలకుడు ప్రజల మనిషి కావాలి. అప్పుడే ఈ సమాజంలో ఆకలి కోసం అరిచేవాళ్లు ఉండరు. అవమానాలతో బాధపడేవారు ఉండరు. అన్యాయంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించేవాళ్లు ఉండరు. ద్వేషంతో రగిలేవాళ్లు ఉండరు. అంతా ఒక అద్భుతమైన సమాజం. అదే ప్రజారాజ్యానికి అసలైన నిర్వచనం. మొదట అందరూ కలిసి దొరను జైలుకు పంపారు. ఇక నిజాం ప్రభుత్వాన్ని కూల్చే పనే మిగిలింది. కంఠీరవం బృందం ఉద్యమంలోకి బయలు దేరింది. నవల ముగిసింది.

 

 మహా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి తెలుగు సాహిత్యానికి ఇచ్చిన గొప్ప కానుక, ఈ నవల, ‘ప్రజల మనిషి’. తెలంగాణలో కవులేం ఉన్నారు, రచయితలేం ఉన్నారు అంటే ఉన్న వాళ్లందరూ ఉన్నారు. చేయవలసిన పనంతా చేశారు. నిజాం కాలపు సమాజాన్ని అంటే 1935 నాటి సమాజాన్ని నవలలో చూపాలని అనుకోవడం మామూలు విషయం కాదు. అంతవరకూ అలాంటి ప్రయత్నం జరిగి దారీ దోవా లేకపోయినా ఒక గొప్ప పరిణితరూపంలో రాయడం మామూలు విషయం ఎంత మాత్రం కాదు. ఈ పనంతా చాలా నిరాడంబరంగా చేసిన  గొప్ప తేజస్వి వట్టికోట ఆళ్వారుస్వామి. కొద్దోగొప్పో చదువుకున్న పామరులు కూడా సులభంగా అర్థం చేసుకునే శైలిలో, శిల్పంలో, కళ్లకు కట్టినట్టుండే పాత్రలతో, సంభాషణలతో ఆయన ఈ నవలను నడిపిస్తాడు. ఇది ఒక రకంగా ఆయన పర్సనల్ జర్నీ కూడా. అందులోని కంఠీరవం పాత్ర దాదాపుగా ఆయన అంతరాత్మ. ఆ పాత్ర పడే పరివర్తన అంతా ఆయన పడిందే. ఆ పాత్ర కార్చే ప్రతి కన్నీటి చుక్కా వట్టికోట నిష్కల్మష హృదయం కార్చిన దయామయ అశ్రువే.

 

 చాలా చిన్న వయసులో (జ.1915 - మ.1961) మరణించిన వట్టికోట మరికొంత కాలం జీవించి ఉంటే మరెన్నో గొప్ప రచనలు చూసి ఉండేవాళ్లం.

 విషాదం ఏమిటంటే ఆయన ఇంత గొప్ప రచనలు చేసినా కొంతమంది దశాబ్దాల తరబడి చీకటిలో పెట్టడం. ఆయన పేరే ప్రస్తావించకపోవడం.

 కడుపు మండమంటే మండదా?

 చూపుడు వేలు ఆడించమంటే ఆడించరా?

 

 ప్రజల మనిషి; రచయిత: వట్టికోట ఆళ్వారుస్వామి; రచనాకాలం: 1955; తెలంగాణ తొలి నవలగా వాసికెక్కింది. నిజాం కాలపు తెలంగాణ జీవితాన్ని సమర్థంగా చూపిన నవలగా ఖ్యాతి పొందింది. ఈ నవల ఒక దారి చూపించడం వల్లే దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్లు’ వంటి అద్భుత నవలను రాయగలిగారు. మార్కెట్‌లో లభ్యం. వెల: రూ. 70

 

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top