కాళిదాసంటే పులకించేవారు! - తనికెళ్ళ భరణి

కాళిదాసంటే పులకించేవారు! - తనికెళ్ళ భరణి


ఎమ్మెస్ సారస్వత ప్రియుడు. మేము ఎప్పుడు కలిసినా, సాహిత్యం గురించే మాట్లాడుకొనేవాళ్ళం. కొత్తగా ఏం చదివావంటే, ఏం చదివావని పరస్పరం చర్చించుకునేవాళ్లం. ఆయనకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలన్నా, సంస్కృత సాహిత్యమన్నా అపారమైన అభిమానం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సంస్కృతం చదువుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా మహాకవి కాళిదాసు ప్రస్తావన వస్తే, ఆయన పులకించిపోయేవారు. ‘కాళిదాసు పుట్టిన భూమిలో మనం పుట్టడం అదృష్టం సార్!’ అనేవారు.



‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థాంకం, తత్ర శ్లోక చతుష్టయమ్’ అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. కావ్యాల్లో నాటకం... ఆ నాటకాల్లో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’... అందులోనూ నాలుగో అంకం... అందులోని కీలకమైన నాలుగు శ్లోకాలు అతి రమ్యమైనవని దాని అర్థం. ఆ మాట చెబుతూ, ఆ నాలుగు శ్లోకాలనూ ఎమ్మెస్ అప్పజెప్పేవారు. సంస్కృతం చదువుకున్న నాకు కూడా ఆ శ్లోకాలు నోటికి రావని సిగ్గుపడి, స్కూలు పిల్లాడిలా ఒక వారం రోజులు కష్టపడి, ఆ శ్లోకాలు కంఠతా పట్టి, ఆయనకు అప్పజెబితే, ఆయన ఆనందంతో కౌగలించుకున్నారు.

 

ఆ మధ్య కలిసినప్పుడు ‘నేను మీకు బాకీ తెలుసా?’ అన్నారు ఎమ్మెస్. అదేంటి అన్నా. ‘ఇంకా నటుడిగా స్థిరపడని రోజుల్లో 1994 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఒకసారి నాకు బాగా డబ్బు అవసరమైంది. అప్పుడు మీరున్న డబ్బింగ్ థియేటర్ దగ్గరకు వచ్చి అడిగితే, జేబులో నుంచి 2 వేలు తీసి నా చేతిలో పెట్టారు. ఆ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోయా. ఆ తరువాత మీకు ఇవ్వలేదు’ అని ఎమ్మెస్ చెప్పారు.



ఆ సంగతి నాకు గుర్తే లేదు. ఆ మాటే ఆయనతో అన్నా. ‘డబ్బు ఇచ్చిన మీరు కాదండీ, తీసుకున్న నేను గుర్తుపెట్టుకోవాలి!’ అన్న ఎమ్మెస్, ‘ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఎందుకంటే, అది నా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని చెప్పారు. అంత స్నేహం మాది.

 

ప్రాథమికంగా జీవితాన్ని ప్రేమించే తత్త్వం ఆయనది. ప్రతి చిన్నవిషయానికీ స్పందించే సాహితీపరుల లక్షణం ఆయనలో పుష్కలం. అలాగే, ఆయన చక్కటి ఛలోక్తులు విసురుతారు. ఎవరేమన్నా దానికి చక్కటి రిటార్ట్‌లు ఇస్తారు. అలాగే, ఎంత కష్టం ఎదురైనా ఎదుర్కొనే మొండితనం కూడా ఉండేది. ‘కొడుకు’ సినిమా తీసినప్పుడు ఆయన చాలా నష్టపోయారు. మధ్యవర్తిగా నేనుండగా, ఆయన కొన్ని లక్షల డబ్బు అవతలవాళ్ళకు చెల్లిస్తుంటే, నేను కదిలిపోయాను.



‘పైసా పైసా కష్టపడి సంపాదించినది అలా ఇచ్చేస్తుంటే, నాకే దుఃఖం వస్తోంది’ అంటూ నేను బాధపడ్డా. ఆయన మాత్రం ‘ఏం ఫరవాలేదు సార్! మళ్ళీ సంపాదిద్దాం’ అని నిబ్బరం ప్రదర్శించారు. అలాగే, ‘దూకుడు’ నుంచి మళ్ళీ నటుడిగా పుంజుకొని, మంచి స్టార్ కమెడియన్‌గా వెలిగారు. మంచి నటుణ్ణే కాకుండా మంచి స్నేహితుణ్ణీ, సాహితీప్రియుణ్ణీ, అంతకు మించి మంచి మనిషిని కోల్పోవడం బాధగా ఉంది.

 

ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, కాళిదాసు,

MS Narayana, Tanikella Bharani, Kalidasa

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top