ఫేస్‌బుక్ సీఈవో సంచలన నిర్ణయం

ఫేస్‌బుక్ సీఈవో సంచలన నిర్ణయం - Sakshi


99 శాతం షేర్ల దానం

జుకెర్‌బెర్గ్, భార్య ప్రిసిల్లా సంయుక్త నిర్ణయం

ప్రస్తుతం ఆ షేర్ల విలువ రూ. 2,99,200 కోట్లు

కూతురు పుట్టిన వేళ భారీ దాతృత్వం




వాషింగ్టన్

కూతురు పుట్టిన వేళా విశేషం ఏమోగానీ, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెర్‌బెర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న షేర్లలో 99 శాతాన్ని దానం చేసేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తమ కూతురు మాక్సిమాకు రాసిన లేఖలో తెలిపారు. ఆ లేఖను జుకెర్‌బెర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు ఈ దానం చేస్తున్నానన్నాడు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరి కోసం ఈ చిన్న సాయం చేస్తున్నట్లు తెలిపాడు. ఫేస్‌బుక్‌లో తమకున్న షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ఇస్తామన్నాడు. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 3 లక్షల కోట్లు. భావి తరం కోసం ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు ఈ మొత్తాన్ని ఇస్తామన్నాడు.



ఈ ప్రపంచంలోకి తమ కూతురు మాక్స్‌ను స్వాగతించేందుకు భార్య ప్రిసిల్లా, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్‌బెర్గ్ ఆకాంక్షించాడు. మీ తరం కోసం మా ఆశలు ప్రధానంగా రెండు అంశాల మీద ఉంటాయని, అవి మానవ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడమని తెలిపాడు. తాను ఫేస్‌బుక్ సీఈవోగా ఇంకా చాలా ఏళ్ల పాటు పనిచేస్తానని చెప్పాడు. చాన్ జుకెర్‌బెర్గ్ ఇనీషియేటివ్‌ను ప్రారంభిస్తున్నామని కూడా ఈ లేఖలోనే ప్రకటించాడు.



తాను పైన పేర్కొన్న అంశాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న వ్యక్తులు, అందుబాటులో ఉన్న వనరులతో పోలిస్తే తాము ఇచ్చింది చాలా చిన్న మొత్తమని, కానీ.. తాము చేయగలిగింది ఏదో చేద్దామని అనుకుంటున్నామని అన్నాడు. రాబోయే కాలంలో మరిన్ని వివరాలు చెబుతానని, తామిద్దరం తల్లిదండ్రులుగా కాస్త స్థిరపడిన తర్వాత వీటిని వేగవంతం చేస్తామని తెలిపాడు. తాము ఇదంతా ఎందుకు, ఎలా చేస్తున్నామన్న ప్రశ్నలు ఉండొచ్చని, తల్లిదండ్రులుగా తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాలను ప్రారంభిస్తుండటంతోనే ఇలా చేస్తున్నామని అన్నాడు. తమతో పాటు ప్రపంచవ్యాప్తంగా బలమైన సైన్యం ఉండటం వల్ల మాత్రమే తాము ఇలా చేయగలమన్న నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. తాను చేస్తున్న ఈ కృషిలో ఫేస్‌బుక్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడూ తన వంతు పాత్ర పోషిస్తున్నట్లేనని వివరించాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top