
రాజధాని ప్రాంతంలో అద్దెలు రెట్టింపు
రాజధాని ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తుల భవనాలకు అద్దెల రూపంలో ప్రభుత్వం భారీయెత్తున ఆదాయం సమకూర్చనుంది.
♦ ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేసే ప్రైవేటు భవనాల అద్దెలు పెంపు
♦ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
♦ మార్చి 1 నుంచే అమల్లోకి..
♦ ఇళ్ల అద్దెలు మాత్రం పెంచొద్దంటున్న చంద్రబాబు
♦ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తుల భవనాలకు అద్దెల రూపంలో ప్రభుత్వం భారీయెత్తున ఆదాయం సమకూర్చనుంది. రాజధాని ప్రాంతంలో ఇళ్ల అద్దెలు పెంచవద్దని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ నిమిత్తం అద్దెకు తీసుకునే ప్రైవేటు భవనాలకు చెల్లించే అద్దెలను మాత్రం భారీగా పెంచడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చే జూన్ 1వ తేదీ నాటికి హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి తరలివెళ్లాలని ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు ఐదేళ్ల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భవనాల అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి అద్దెలను పెంచాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు సిఫారసు చేయడానికి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి ఆమోదించడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ అద్దెలను పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెరిగిన అద్దెలు మార్చి 1 నుంచి వర్తిస్తాయని, రెండు సంవత్సరాలకోసారి 5 శాతం మేర అద్దె పెంచనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన అద్దెలు 2011 ఏప్రిల్‌లో నిర్ధారించిన అద్దెలకు రెట్టింపు ఉండటం గమనార్హం.అప్పటికీ ఇప్పటికీ భూమి, భవనాల ధరలు బాగా పెరిగాయని, అందువల్లనే అద్దెలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీడీపీ నేతలకు సంబంధించిన భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.