ఆడడం ఆనందం...గెలవడం బోనస్!

ఆడడం ఆనందం...గెలవడం బోనస్! - Sakshi

ఒక తరానికి ఆయన ప్రయోగాత్మక నాటక రచయిత... మరో తరానికి పాపులర్ నవలా రచయిత... అటుపైన పేరుతెచ్చుకున్న సినీస్క్రిప్ట్ రైటర్... ఇవాళ్టి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస బోధకుడు, జీవన విధానపు కౌన్సెలర్... కాలానికి తగ్గట్లుగా ఆలోచననూ, అక్షరాన్నీ మలుచుకొని, ప్రతి విషయంలో పదేళ్ళు ముందుండడం యండమూరి వీరేంద్రనాథ్ ప్రత్యేకత. 1980ల నుంచి తెలుగు సాహిత్యంలో లక్షల కొద్దీ కాపీలు... కోట్ల రూపాయల అమ్మకాలు జరిగిన ‘మోస్ట్ పాపులర్ రైటర్’గా అభిమానుల ప్రశంసలూ ఆయనకే!

మూడు దశాబ్దాల క్రితం సీరియల్ పాఠకులను ఊపేసిన ‘తులసిదళం’, ‘తులసి’నే దృష్టిలో పెట్టుకొని ‘క్షుద్ర సాహిత్య రచయిత’గా గిట్టనివర్గాల ఈసడింపులూ ఆయనకే! విజేతగా కీర్తించినా, విమర్శించినా - విస్మరించలేని విశిష్ట పాళీ, అక్షరాల మోళీ యండమూరిది. స్వయంకృషితో నిజజీవితంలో ‘విజయానికి అయిదు మెట్లు’ వేసుకున్న ఎవర్‌గ్రీన్ యండమూరి 66వ పుట్టినరోజు సందర్భంగా విజయం వైపు పయనించిన ఆయన అంతరంగంలోకి ‘సాక్షి ఫ్యామిలీ’ ప్రయాణం... మీ కోసం...
 
ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అరవై ఆరేళ్ళు నిండిన ఈ సమయంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసుకుంటే కలుగుతున్న భావాలు?
(నవ్వేస్తూ...) మనిషి గెలుపు నిరంతరం. అంతే తప్ప, ఒక మజిలీలో ఆగి, వెనక్కి తిరిగి చూసుకోవడమనేది నేను నమ్మను. చాలామంది 30 - 40 ఏళ్ళకే తృప్తిపడిపోతారు. జీవించడం మానేసి, బతకడం మొదలుపెడతారు. అది తప్పు. పని చేస్తున్నకొద్దీ రాటుదేలేది ఒక్క మెదడే. ‘ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎంత తొందరగా ప్రారంభించామన్నది ముఖ్యం’ అంటా.

తొందరగా ప్రారంభించడమంటే...? దాని అంతరార్థం కొద్దిగా వివరిస్తారా?
జీవితంలో డబ్బు, కీర్తి, జ్ఞానం - వీటి సముపార్జన తొందరగా ప్రారంభించాలి. నా దృష్టిలో మనిషికి కావాల్సినవి షడ్గుణ ఐశ్వర్యాలు. ఆ 6 ఏమిటంటే - ఆరోగ్యం, కీర్తి, డబ్బు, జ్ఞానం, ప్రేమ, ఉత్సాహం. ఈ ఆరూ ఉంటే, జీవితం సఫలమైనట్లే. వీటి కోసం ఎంత చిన్న వయసులో ప్రయత్నం ప్రారంభిస్తే, అంత తొందరగా జీవితంలో విజయం వైపు పయనిస్తాం.
 
మీ జీవితం గమనిస్తే, చిన్నప్పుడే మీరు ఆ ప్రయత్నం ప్రారంభించినట్లున్నారు.
అవును. జీవితంలో కృషి చేయడమంటే ఏమిటో మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఆయనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే మా తాత గారు చనిపోయారు. మా నాన్న గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. అమ్మానాన్న, నలుగురు పిల్లలం చిన్న ఇంట్లో సర్దుకొన్న రోజులు నాకింకా గుర్తే. అందుకే, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో పైకి వచ్చేందుకు కృషి చేశా.
 
మీరు చాలా కష్టపడి చదువుకున్నారట!
(మధ్యలోనే అందుకుంటూ...) కష్టం అనకండి... కృషి అనండి! జీవితంలో ఏ పని చేసినా, ఆ పని ఆనందంగా చేయాలి. దాన్ని ఆస్వాదించాలి. అప్పుడు కష్టం, బాధ ఉండవు. అందుకే, ‘ఆడడం ఆనందం. గెలవడం బోనస్’ అని చెబుతుంటా! చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగా. బంధువుల దగ్గర వాళ్ళ ఇళ్ళలో ఉంటూ, వేర్వేరు ఊళ్ళలో చదువుకున్నా. ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి, స్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిన్న తరగతులకు ట్యూషన్లు చెప్పి, సంపాదించా. నా తొలి సంపాదనతో మా అమ్మకు చిన్న ట్రాన్సిస్టర్ కొనివ్వడం, ఆమె ఆనందం - ఇప్పటికీ మర్చిపోలేను.
 
అప్పట్లో మీ జీవితం ఎలా గడవాలనుకొనేవారు?
కాకినాడ పి.ఆర్. కాలేజ్‌లో బి.కామ్ చదువుతున్న రోజుల్లో నెలకు వెయ్యి సంపాదిస్తే చాలనుకున్నా. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. రచయితనయ్యాక కూడా లక్షరూపాయలు సంపాదించి, బ్యాంకులో వేస్తే వచ్చే వెయ్యి రూపాయల వడ్డీతో దర్జాగా బతికేయాలని భావించా. మా పబ్లిషర్‌కు చెబితే, ఆయన నవ్వేసి, ‘మీరు ఒకటి కాదు మూడు బిల్డింగ్‌లు కడతారు... చూడండి’ అన్నారు. నిర్ణీత మొత్తం సంపాదించాలని ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. కాకపోతే, సౌకర్యంగా బతకాలని అనుకున్నా. అంతే!
 
అసలు, తొలి రోజుల్లో మీకు రచన వైపు ఆసక్తి ఎలా కలిగింది?
మా నాన్న గారు యండమూరి చక్రపాణి మంచి కవి. మూడు, నాలుగు పుస్తకాలు కూడా రాశారు. మా తాతయ్య (అమ్మ గారి నాన్న గారు) రావిపాటి సత్యనారాయణ రచయిత. మా మేనమామ వేణుగోపాలరావు కూడా రాసేవారు. ఆ జీన్స్ నాకు వచ్చినట్లున్నాయి. మేనమామ ప్రోత్సాహంతో ‘చందమామ’లో కథలు రాయడంతో నా రచనా జీవితం మొదలైంది.
 
నవలల కన్నా ముందు నాటకాల్లో కృషి చేసిన రోజులు గుర్తుచేసుకుంటారా?
సి.ఏ. చదువుతున్నప్పుడు 1969లో రాసిన ‘గులకరాళ్ళు - గులాబీముళ్ళు’ నా తొలి నాటిక. నన్ను రచయితగా తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు, నేను, నటుడు సుబ్బరాయశర్మ కలసి ఒక బృందంగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళం. నాటకం రాయడం, వేయడం ఒక ఉద్యమంలా సాగేది.  

‘మరో మొహంజొదారో’ లాంటివి మినహా, తెలుగు రంగస్థలంపై ప్రయోగాలు తక్కువైన రోజుల్లోనే మీరు రాసిన ‘కుక్క’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు.
(నవ్వుతూ...) ‘కుక్క’ నాటకం ఓ సంచలనం. అలాగే, ‘రుద్రవీణ’ ఆధునిక యక్షగానం. ‘మనుషులొస్తున్నారు జాగ్రత్త’, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ లాంటివన్నీ పేరు తెచ్చినవే. ఎగ్జిబిషనిజమ్ మీద, బ్రెహ్ట్ చెప్పిన ఏలియన్ థీరీ మీద, అలాగే అబ్‌సర్డ్ నాటికలు - ఇలా రకరకాల ప్రయోగాలు చేశా. అప్పట్లో రంగస్థలంపై మెలోడ్రామాగా నాటకాలు నడిచేవి. వాటికే బహుమతులూ వచ్చేవి. ఇవన్నీ చూసి ‘చీమ కుట్టిన నాటకం’ పేరుతో మెలోడ్రామా మీద పూర్తి వ్యంగ్యంగా నాటకం రాశా. అదీ చర్చ రేపింది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’ నాటకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డొచ్చింది.

మరి, నాటకాల్లో అంత కృషి చేసి, నవలల వైపు ఎందుకు మళ్ళారు?
‘చీమ కుట్టిన నాటకం’ రాశాక, ఇక నాకు ఎప్పటిలా మామూలు నాటకాలు రాయాలనిపించ లేదు. పైగా నేను, రచయితలు జంధ్యాల, పరుచూరి బ్రదర్స్ పరిషత్తు నాటకాల్లో పోటీలు పడుతుండేవాళ్ళం. రాజమండ్రి ‘లలిత కళానికేతన్’లో మా మధ్య గట్టిపోటీ ఉండేది. వాళ్ళిద్దరూ సినిమా రంగానికి వెళ్ళిపోయాక నవలా రచన వైపు మొగ్గా. 500 మంది చూసే నాటకం కోసం ఇంత శ్రమ పడే కన్నా, అదే శ్రమతో అంతకన్నా ఎక్కువ మందికి నవల ద్వారా చేరవచ్చనిపించింది. ‘నాటకం కన్నా నవల రాయడం కష్టమ’ని ఎవరో చేసిన విమర్శతో 1977లో ‘ఋషి’తో నవలా రచన మొదలుపెట్టా.
 
ప్రొఫెషనల్ రైటరై, ‘తులసిదళం’తో కీర్తీ, అపకీర్తీ కూడా మూటగట్టుకున్నారు!
(కొద్దిగా హెచ్చు స్వరంలో...) నా పుస్తకాన్ని పది మంది కొంటే ప్రొఫెషనల్ రైటర్ అంటారు. ఎవరూ కొనకపోతే సీరియస్ రైటర్ అంటారు. నలుగురూ కొని, చదివే పుస్తకాలు రాస్తే, వెంటనే ‘కమర్షియల్ రైటర్’ అనే ముద్ర వేసేస్తారు. చాలామంది ఆర్ట్ సినిమాల్లో చేసే వారి కన్నా అమితాబ్ మంచి నటుడు. కానీ, ఏం లాభం? అతనికి కమర్షియల్ చిత్రాల నటుడనే ముద్ర వేసేస్తాం. నా మీదే అంతే! ‘అంతర్ముఖం’ నవల యండమూరి కాకుండా, మరొకరు రాసి ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగేవాళ్ళు. నేను రాశా కాబట్టి, మాట్లాడరు. నా 50 నవలల్లో ఒక్కటైన ‘తులసిదళం’ గురించే ప్రస్తావిస్తారు.
 
‘ఎస్! యండమూరి ఎరైవ్డ్’ అని మీకెప్పుడనిపించింది? ‘తులసిదళం’తోనా?
ఆ మాట అప్పుడు, ఇప్పుడు - ఎప్పుడూ అనుకోను. వారం వారం పాఠకులు ‘తులసిదళం’ సీరియల్ కోసం ఊగిపోతున్నారనీ, అది అంత సంచలనమనీ అప్పట్లో నాకు తెలీను కూడా తెలీదు. ‘తులసిదళం’కి నాకిచ్చిన పారితోషికం రూ. 3 వేలు. ‘తులసి’కి 5 వేలు. అంతే! సీరియల్ వల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతోందని తెలుసు కానీ, ఇంత సంచలనం సృష్టిస్తోందని తెలియదు. తెలిస్తే పారితోషికం భారీగా అడిగి ఉండేవాణ్ణి కదా!
 
చేతబడుల గ్రామాలు నిజంగా చూసి, రిసెర్చ్ చేసి మరీ అవి రాసినట్లున్నారు?
‘తులసిదళం’ కన్నా ముందే ‘పర్ణశాల’లో రొయ్యల వ్యాపారం గురించి, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’లో సంగీతం గురించి తెలుసుకొని రాశా. క్యాన్సర్‌పై రాసిన ‘ప్రార్థన’కూ అంతే! ఆ మాటకొస్తే, ప్రతి రచనకూ రిసెర్చ్ చేస్తా. (వ్యంగ్యంగా...) అప్పుడు అడగలేదేం ఈ ప్రశ్న. ఒక్క ‘తులసిదళం’కే అడుగుతారేం? నా కన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ ‘బాణామతి’ రాశారు. అదింత ప్రాచుర్యం పొందలేదు. నాది పాపులరయ్యేసరికి గొడవ!
 
అసలు ‘తులసిదళం’ నవలలకు ప్రేరణేంటి?
బ్యాంక్ పని మీద ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రామంలో చూసిన సంఘటనలు, అక్కడ తెలుసుకున్న విషయాలు నాలో ఆలోచన రేపాయి. అప్పటికే వచ్చిన ‘ఎగ్జార్సిస్ట్’, ‘ఓమెన్’ లాంటి హారర్ చిత్రాల ప్రేరణతో అప్పుడీ నవలలు రాశా. అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళనూ చూశా. అదంతా వట్టి బూటకమని గ్రహించా. అదే రాశా. కాకపోతే, ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే.
 
ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ అలాంటి నవలలు రాయమంటే రాస్తారా?
కోట్లిస్తానన్నా సరే, రాయను. అప్పట్లోనే ‘రెండు లక్షలిస్తా.. అలాంటి నవల రాయ’మని సంపాదకుడు కందనాతి చెన్నారెడ్డి అడిగినా, నిరాకరించా. వాటికి అప్పట్లో క్రేజ్ కానీ, నా బెస్ట్ సెల్లర్స్ ‘వెన్నెల్లో ఆడపిల్ల’ లాంటివే!
 
కానీ, ‘తులసిదళం’ ప్రేరణతో చాలా వచ్చాయి. మీ ‘వేపమండలు’ కూడా!
(నవ్వుతూ...) నిజమే. ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన. ఒక్క ముక్కలో, ‘తులసిదళం’ చందమామ కథ. రాకుమార్తె, రాక్షసుడు బదులు పసిపాప, మాంత్రికుడు పాత్రలు పెట్టా.
 
మీరేమన్నా, అప్పట్లో మీపై ‘క్షుద్ర సాహిత్యకారుడ’నే ముద్ర బలంగానే పడింది.
చాలామంది రచయితలకున్న ‘కంఫర్ట్ జోన్’ను బద్దలు కొట్టడంతో, అసూయతో నా మీద వేసిన ముద్ర అది. ‘తులసిదళం’ బాగా సక్సెస్ కావడంతో అందరూ దుమ్మెత్తిపోశారు. దాంతో, రకరకాల నవలలు రాసి, విమర్శకుల నోళ్ళు మూయించా. ‘అంతర్ముఖం’ లాంటివి రాసింది అందుకే!
 
ఆ పాపులర్ నవలా శకంలో ఆఖరు యోధుడు మీరే అనుకోవచ్చా?

పాపులర్ నవలా రచనా శకం ఆగిపోయింది. ఇప్పుడు ఎవరి నవలలూ మునుపటిలా అమ్ముడవడం లేదు. అయితే, నవలా శకం యోధుల్లో ఆఖరువాణ్ణి నేను కాదు కానీ, ఆఖరు వాళ్ళలో నేనూ ఒకణ్ణి! ఒకప్పుడు కొవ్వలి లాగా నా రచనలూ తెలుగునాట కొత్త పాఠకుల్ని సృష్టించాయి. పాపులర్ సాహిత్యంతో కాకపోతే, నవలల ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘పవిత్ర’ లాంటి చిత్రాల్లో నటించడం ద్వారా వచ్చింది ఎక్కువ. జనం నన్ను చూడగానే గుర్తుపట్టడం పెరిగింది.
 
మీ నవలలు చాలా సినిమాలుగా వచ్చాయి. మీరు స్క్రిప్టులూ రాసేవారు. ఇటీవల అవి రావడం, మీరు రాయడం కూడా తగ్గిందే?
రచయితకు అభిప్రాయాలు, సిద్ధాంతాలు నిర్దిష్టమై, స్పష్టమవుతున్న కొద్దీ సామాన్య పాఠకుల్ని కోల్పోతాడు. ఒకప్పటిలా ప్రేయసీ ప్రియుల కబుర్ల లాంటి స్టుపిడ్ చెత్త రాయలేడు. అందుకే, నేను నవలల నుంచి వ్యక్తిత్వ వికాస రచనల వైపు మళ్ళాను. బి.వి. పట్టాభిరావ్‌ు ప్రోత్సాహంతో వ్యక్తిత్వ వికాస బోధకుణ్ణయ్యా. ఇక, మృణాల్‌సేన్ ‘ఒక ఊరి కథ’కు మాటల రచయితగా మొదలైన నా సినిమా ప్రస్థానం మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ అవుతుంది. నిర్మాత కె.ఎస్. రామారావు లేకపోతే, సినిమాల్లో యండమూరి లేడు. మారిన కాలంలో ఇప్పటి దర్శక, నిర్మాతలు పిలవడమూ లేదు. నేను రాయడమూ లేదు. ‘అనామిక’ లాంటి వాటికి అరుదుగా పనిచేస్తున్నా.
 
టీవీ దర్శకుడిగా అవార్డులందుకున్న మీరు సినీ దర్శకుడిగా ఫెయిలయ్యారే?
సినీ దర్శకత్వానికి చాలా ఓర్పు ఉండాలి. చాలా అంశాలు లెక్కలోకి తీసుకోవాలి.  

నాకు పోటీదారులు ఎవరూ లేరు!
- యండమూరి

కానీ, టీవీలో మనకు నచ్చినట్లు తీసుకోవచ్చు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘తులసిదళం’, ‘ప్రియురాలు పిలిచె’, ‘భార్యా గుణవతీ శత్రుః’ నవలలకు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం ఆనందాన్నిచ్చింది.

మీ నవలలకూ, మీకూ కన్నడంలో బ్రహ్మరథం పడతారని విన్నాం?
నిజమే. దక్షిణాది భాషలన్నిటిలోకీ నా రచనలు వెళ్ళినా, కన్నడంలో నాకు మరీ క్రేజ్. ఇంకా చెప్పాలంటే, తెలుగులో కన్నా ఎక్కువ. ‘లోయ నుంచి శిఖరానికి’ రచన పది రోజుల క్రితమే కన్నడంలో వచ్చింది. ఈ వారం టాప్10 కన్నడ బుక్స్‌లో మొదటి స్థానంలో ఉంది.
 
మీ నవలల్లో సిడ్నీ షెల్డన్ లాంటి వారు అంతర్లీనంగా ఎంత ఉన్నారు?
జేమ్స్ హ్యాడ్లీ ఛేజ్ నాకూ, నా శైలికీ ప్రేరణ. ఆంగ్ల నవలల ప్రేరణతో రచన చేసినప్పుడు ఆ సంగతి నా నవలల ముందు పేజీలోనే చెప్పేశా.
 
మరి, మీ వ్యక్తిత్వ బుక్స్‌లో మీ పాలెంత? కార్నెగీ వగైరాల భాగమెంత?

స్టీఫెన్ కోవే ప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస రచన ‘7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ ప్రేరణతో ‘విజయానికి 5 మెట్లు’ అని పేరుపెట్టా. అంతే!
 
విజయవాడలో మీ అభిమాని జ్యోతి అనుమానాస్పద మరణం...
(మధ్యలోనే అందుకుంటూ) అది ముగిసిన కథ. ఆ సంగతి తెలిసిన వాళ్ళు ముసలివాళ్ళయిపోయారు. నా ప్రమేయం లేని మరణం గురించి కొందరు చేసిన రచ్చను ఇవాళ్టికీ ప్రస్తావించడం సెన్సేషన్ కోసమే!
 
ఇంతకీ, మీ జీవన సిద్ధాంతం ఏమిటి?
ఇంకొకరికి నష్టం లేకుండా నాకు నచ్చిన విధంగా నేను బతకడం! అదే నా ఫిలాసఫీ. మనం ఏం చేసినా అందరికీ నచ్చం. కాబట్టి, ఇతరులకు నచ్చేలా బతకాలనుకోవడం వృథా.
 
మరి, మీ రచనా సిద్ధాంతం మాటేమిటి?
మొదట కమ్యూనిస్టు భావాలతో ఉండేవాణ్ణి. పోనూపోనూ అది ఒక ఊహాస్వర్గం అనిపించింది. ఆ తరువాత క్రమంలో అతి బీదరికం స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరడమనే (ర్యాగ్స్ టు రిచెస్) భావన, ఆ ఉదాహరణలు ప్రేరణనిచ్చాయి. అప్పటి నుంచి నా రచనలు దాని మీదే నడుస్తున్నాయి. ‘బీదవాడిగా పుట్టడం తప్పు కాదు. కానీ, బీదవాడిగానే మరణించడం తప్పు’ అని నేను అనేది అందుకే! డబ్బు లేకపోవడం ఒక రకంగా వరం. జీవితంలో పైకి రావడానికి కసితో పనిచేస్తాం.
 
‘భగవద్గీత’ను ప్రస్తావిస్తున్నారు. కానీ, ఇది మెటీరియలిస్టిక్‌గా లేదూ!
నన్నడిగితే, అసలు భగవద్గీత చెప్పిందే పెద్ద మెటీరియలిజమ్. ‘భవబంధాలు తెంచుకో! చంపాల్సి వస్తే చంపెయ్! కర్తవ్యం నిర్వర్తించడం ముఖ్యం’ అనేగా భగవద్గీత చెప్పింది. అందుకే, పిల్లలకు నేనెప్పుడూ చెప్పేది - ‘చదవడమనేది ఆనందం. దాన్ని ఆస్వాదించండి. పాసవడం, ర్యాంక్ రావడం బోనస్. దానంతట అది జరుగుతుంది.’
 
మీ ఇల్లు, సౌండ్ ప్రూఫ్ స్టడీరూమ్, బెడ్ రూమ్ కళాత్మకంగా ఉన్నాయే!
1982లో ఈ ఇల్లు కట్టుకున్నా. ఈ డిజైనింగ్, కలర్‌‌స అంతా నా ఆలోచనే! జీవితంలో చాలా చిన్న విషయాలకు కూడా ఆనందిస్తుంటా. (పక్కనే ఉన్న పార్కులో చెట్లు చూపిస్తూ...) చెట్లంటే నాకిష్టం. ఈ పార్కులోని చెట్లు, ఈ సందులోకి వస్తుంటే రోడ్డుపై కనిపించే చెట్లు నేను నాటినవే. ఇంట్లో పక్షులు, అక్వేరియమ్‌లో చేపలు పెంచుతా.

స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ బేసిక్ ఫోన్ దగ్గరే ఉన్నారేం?
అవసరం తీరాలి. అదే సమయంలో సౌకర్యం ఉండాలి. అంతకు మించి ఎందుకు? పెద్ద కారు, సొంత ఇల్లు, ఏసీ, అవసరాలు తీర్చేంత ఆదాయం ఉన్నాయి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నాకు... ఫోన్ మాట్లాడుకోవడానికే! దానికి ఇది చాలు కదా! అవసరాలు తీరగా మిగిలిన డబ్బుతో 2006లో కాకినాడ దగ్గర ‘సరస్వతీ విద్యాపీఠం’ పెట్టింది అందుకే! పేద స్కూళ్ళలో చదివే విద్యార్థుల్ని రప్పించి, ఆత్మవిశ్వాసం పెంచి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆనందం ఉంది.
 
మీ జీవితంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు...
నా మీద ప్రభావం చూపిన మా నాన్న గారు. నాలో ఒక రచయిత ఉన్నాడని గుర్తించి, తొలి రోజుల్లోనే నా నాటికలు, రచనలు వేసిన అప్పటి పత్రికా సంపాదకుడు, ప్రతిభ ఎక్కడున్నా పసిగట్టి ప్రోత్సహించే వ్యక్తి - పురాణం సుబ్రహ్మణ్యశర్మ. నాటకాలు ప్రదర్శించే రోజుల్లో వెన్నంటి ఉండి, నన్ను తీర్చిదిద్దిన దేశిరాజు హనుమంతరావు.
 
కానీ, స్టార్ రచయితగా మీకు, అలాగే మరికొందరు కాలమిస్ట్‌లకు పేరు రావడానికి ‘ఆంధ్రభూమి’ వీక్లీ సంపాదకుడు సి.క.రాజు కారణమేమో?

నిజమే. సి. కనకాంబరరాజు ఆ పని చేశారు. అయితే, అది నా వల్ల పత్రికకూ, పత్రిక వల్ల నాకూ పరస్పర ప్రయోజనం ఉందని చేపట్టిన పని. ఇద్దరం లాభపడ్డాం. కానీ, పురాణం గారికి అది లేదు. మంచి రచయిత ఎక్కడున్నా, ప్రతిభను ప్రోత్సహించేవారు. నా తొలి నాటిక ‘గులకరాళ్ళు- గులాబీముళ్ళు’ను ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఆయనే వేశారు.
 
మీ తోబుట్టువుల సంగతి ...
మేము నలుగురు అన్నదమ్ములం. నేను అందరి కన్నా పెద్ద. సాహిత్యాభిమానం, బెంగాలీ సాహిత్య ప్రభావంతో మా నాన్న గారు మా అందరికీ ఆ తరహా పేర్లు పెట్టారు. పెద్ద తమ్ముడు - రాజేంద్రనాథ్. ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో పనిచేసి, రిటైరయ్యాడు. రెండో తమ్ముడు మణేంద్రనాథ్. బల్బుల తయారీ చేస్తుంటాడు. ఆఖరు తమ్ముడు డాక్టర్ కమలేంద్రనాథ్. కాకినాడలో ఫిజీషియన్. వాడూ కథలు రాస్తుంటాడు.
 
ఎమోషన్స్‌ను అక్షరాల్లో పండించే మీకు బయట ఎమోషన్స్ ఉండవట!
నాన్న గారంటే అమిత గౌరవం. కానీ, బయటకు ప్రదర్శించలేకపోయా. ఆయన పోయాక, ఆ బాధతో ‘అంతర్ముఖం’ రాశా. ఆయన పోయిన మంచం మీదే ఇవాళ్టికీ పడుకుంటా. స్నేహితులన్నా, బంధువులన్నా మనసులో ప్రేమ లేదని కాదు. అవసరానికి ఆదుకుంటా కానీ, ప్రేమను బాహాటంగా ప్రదర్శించడం నాకు తెలియదు. ‘ఎటాచ్‌మెంట్ విత్ డిటాచ్‌మెంట్’ అనే భగవద్గీత సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటాను.
 
భావోద్వేగాల మీద అదుపున్న మీరు బాధపడే సందర్భాలుంటాయా?

ఎందుకుండవు? ఒక పచ్చని చెట్టును ఎవరైనా కొట్టేసినా, రోడ్డు మీద చిన్నపాపకు దెబ్బ తగిలినా బాధపడతా. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అతివేగంతో వాహనాలు నడిపి, నా మిత్రుల కొడుకులు అయిదారుగురు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. నాకు బాధ అనిపించింది. పెద్దల పెంపకం సరిగ్గా లేదేమని బాధపడ్డా.
 
మీ మనసు బాగా లేనప్పుడు ఏం చేస్తుంటారు?
నిజం చెప్పాలంటే... అంతకు ముందు మాటెలా ఉన్నా, గడచిన 20 ఏళ్ళుగా నాకు వ్యక్తిగతంగా మనసు బాగా లేకపోవడమనేది లేదు.
 
మరి, మీ ఏకైక కుమారుడి పెంపకంలో మీ పాత్ర ఏమిటి?
 మా అబ్బాయి ప్రణీత్ పెంపకంలో, సక్సెస్‌లో మా ఆవిడ అనుగీత పాత్ర 95 శాతం. నా పాత్ర 5 శాతం. అయితే, చిన్నప్పటి నుంచి తెలివైన ప్రశ్నలు వేయించి, వాడి ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దడంలో నా పాత్ర ఉంది. ఇంటర్ పాసవగానే, వాడు ఉద్యోగంలో చేరాడు. సంపాదించుకుంటూనే, సి.ఏ చదివి, పెద్ద చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఇవాళ సింగపూర్‌లో స్థిరపడ్డాడు. ఇప్పుడు వాడి జీతం ఏటా 2 కోట్ల 70 లక్షలు.
 
మీ అబ్బాయి పెళ్ళి విషయంలో కూడా మీ పాత్ర చాలా ఉందట!
అవును. పిల్లలు లవ్ మ్యారేజ్, కులాంతర వివాహం అనగానే చాలామంది పెద్దలు బిగుసుకుపోతారు. అది తప్పు. మా అబ్బాయి, కోడలిది కులాంతర, రాష్ట్రాంతర వివాహం. సంప్రదాయబద్ధమైన, సామాన్య తమిళ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి సి.ఎలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్. వాళ్ళు ప్రేమించుకున్నారు. అబ్బాయి కన్నా ఆమె కొన్ని నెలలు పెద్దది. అయినా సరే, కులాలు, ఆర్థిక అంతరాలన్నీ పక్కనపెట్టి, నేనే మద్రాసు వెళ్ళి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి వచ్చా. వాళ్ళదీ, మాదీ ఒకటే గోత్రం. పెళ్ళి కోసం మా కులం, గోత్రం అబద్ధమాడి, వాళ్ళ పెళ్ళి జరిపించా. నాకు ఇద్దరు మనుమళ్ళు. చిన్నప్పటి నుంచి దేనికీ భయపడకుండా తీర్చిదిద్దుతున్నారు. జీన్స్ మాత్రమే కాక పెంపకం కూడా పిల్లల్ని ఎంతో మారుస్తుంది.
 
తొలినాళ్ళ ‘కుక్క’ నాటి వీరేన్‌కూ, ఇవాళ పాపులర్ ‘లోయ నుంచి శిఖరానికి’ నాటి యండమూరికీ మీరు గమనించిన తేడా?
అప్పట్లో ఉండే పొగరు ఇప్పుడు తగ్గిపోయింది. గడచిన 15 ఏళ్ళుగా కోపం బాగా తగ్గింది. కాకపోతే, ఎవరో ఫోన్ చేసి, ఏదో అర్థం పర్థం లేనివి అడిగినప్పుడు మాత్రం చిరాకు వస్తుంటుంది.
 
ఏ రంగంలోనైనా సమకాలికులతో పోటీ, ఈర్ష్య ఉంటాయి కదా...
అతి చిన్న వయసులోనే అత్యధిక జీతం తీసుకొనేవాణ్ణి. నా రచనల వల్ల పాఠకుల్లో పెద్ద క్రేజ్. ఉత్తరాలు, ఆటోగ్రాఫ్‌లు సరేసరి! అవన్నీ చూసి, ఆఫీసులో అసూయపడ్డవాళ్ళున్నారు. పట్టించుకోలేదు. ఇక, రచయితగా వస్తే, నేనేప్పుడూ ఎవరినీ నాకు పోటీ అనుకోను. నాకన్నా పై స్థాయి రచయితలు - విశ్వనాథ, జాషువా లాంటి వాళ్ళున్నారు. నా కన్నా కింది స్థాయి వాళ్ళున్నారు. నాతో సమాన స్థాయి వాళ్ళు, పోటీదారులు ఎవరూ లేరు. ఒక్కమాట... ‘నీ గురించి నీ శత్రువు ఎక్కువ ఆలోచిస్తున్నాడంటే... వాణ్ణి నువ్వెప్పుడో గెలిచావు’!

నవలా సాహిత్యానికి మళ్ళీ మునుపటి వైభవం వస్తుందంటారా?
పాఠకులలో వచ్చిన మార్పు వల్ల ఆ రకం పుస్తకాల అమ్మకాలు తగ్గాయి. అయితే, కథ ఉంటూనే వ్యక్తిత్వ వికాసాన్ని కూడా జొప్పించేలా చేసే రచనలకు ఆదరణ ఉంటుందని నా భావన. అందుకే, అలాంటి రచనలు చేస్తున్నా. ఏదైనా మనకు మనం మార్కెట్ సృష్టించుకోవాలి. దానికి కష్టపడాలి. అంత కృషి చేసేవారు ప్రస్తుతం తక్కువ.

మీకు తగినంత గుర్తింపు, అవార్డులు రాలేదని భావిస్తున్నారా?
యాదృచ్ఛికంగా రచయితనైన నాకు ఎక్కువ గుర్తింపే వచ్చింది. అవార్డులు రాలేదన్న బాధ నాకు లేదు.
 
కొన్నేళ్ళుగా మీ మనసులో సుడులు తిరుగుతున్న మీ కలల ప్రాజెక్ట్?
అలాంటిదేమీ లేదు. ఏకకాలంలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లు మనసులో ఉంటాయి. ప్రస్తుతం కథనూ, వ్యక్తిత్వ వికాసాన్నీ జొప్పించే రీతిలోనే ‘దున్నపోతులు’ అనే రచన చేయాలనుకుంటున్నా. ‘పిల్లలకు పదివేల పేర్లు’ ప్రాజెక్ట్ చేస్తున్నా. త్వరలోనే అది బయటకు రానుంది.  
 
ఇంతకీ భవిష్యత్తు మిమ్మల్నెలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు?
తరువాతి తరాలు గుర్తుపెట్టుకోవడానికీ, గుర్తుపెట్టుకోకపోవడానికీ చాలా కారణాలే ఉంటాయి. శ్రీశ్రీ గురించి ఇవాళ్టికీ గుర్తుపెట్టుకుంటున్నారు. అంతకన్నా గొప్ప రచయితలున్నా, ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండబట్టే, ఆయన జనంలో గుర్తున్నారు. రేపు నన్నెలా, ఎంతమంది గుర్తు చేసుకుంటారన్నది ఇప్పుడు చెప్పలేం. అయితే, జనం నన్ను పాపులర్ నవలా రచయితగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటా!
 
ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ

Read latest Literature News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top