నాన్నకూ అమ్మే నేర్పింది

నాన్నకూ అమ్మే నేర్పింది


కారంచేటు వెంకట రమణాచారి అనే పేరుతో ఆయన మన స్ఫురణకు రావడానికి కొంత సమయం పట్టవచ్చేమో కానీ, కె.వి. రమణాచారి అనగానే తక్షణం ఆయన ఐఎఎస్ అధికారిగా గుర్తొస్తారు. ‘మా అమ్మ’ శీర్షిక కోసం ఆయన్ని కలిసినప్పుడు తన జీవన ప్రస్థానంలో తల్లి వేయించిన అడుగులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ జ్ఞాపకాలను సాక్షి ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.


‘‘మాది కరీంనగర్ నారాయణపురం. మా ఊరి రామాలయంలో అర్చకులు మా నాన్న రాఘవాచార్యులు. ఆయన యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. సంస్కృత, ఆంధ్ర, తమిళ భాషల్లో పండితులు. పాశురాల పఠనం, దైవారాధన ఆయన లోకం. అలాంటి నాన్నగారి జీవనశైలిని ఆధునికంగా మార్చేశారు మా అమ్మ పద్మావతి. అమ్మ పెళ్లి నాటికి ఏడవ తరగతి చదివింది. అప్పట్లో... అంటే 1950లలో మా ప్రాంతంలో ఆడపిల్లను అంత వరకు చదివించడం ఓ విప్లవమే.


 ఆమెకు తొలి శిష్యుడు మా నాన్న!

అమ్మకు ఇంగ్లిష్ వచ్చు, నాన్నకు రాదు. ఇక ఆమె రోజూ నాన్నకు ఇంగ్లిష్ పాఠాలు నేర్పించేది. నేర్పించడమే కాదు. ఆయన స్కూల్ టీచరుగా ఉద్యోగంలో చేరడానికి ఆమె పాఠాలే ప్రేరేపించాయి. ఆధ్యాత్మిక బాటలో జీవించాల్సిన నాన్నగారిని అభ్యుదయ, లౌకిక ప్రపంచంలోకి తెచ్చింది మా అమ్మ. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన జీవనపథాన్నే మార్చేశారావిడ. ఆమె తన బిడ్డల తొలి గురువు హోదా కంటే ముందు మా నాన్ననే శిష్యునిగా చేసుకున్నారు. తర్వాత మా చిన్నాన్నలకు, ఆ తర్వాత మా అందరికీ గురువయ్యారు.


 సమన్వయం నేర్చుకున్నాను!

మా నాన్న మెదక్‌లో స్కూల్ టీచరుగా 250 రూపాయలు తెచ్చేవారు. ఆ డబ్బుతో మా నానమ్మ, తాతగారు, అమ్మానాన్న, చిన్నాన్నలు నలుగురు, మేము ఐదుగురు పిల్లలం... ఇంత కుటుంబాన్నీ నడిపించింది మా అమ్మ. అందరికీ గురువు అయినట్లే... అందరికీ తల్లి అయింది. చిన్నాన్నలు జీవితంలో స్థిరపడేవరకు వెన్నుదన్నుగా ఉందామె. ఎవరికి ఏ పని చెప్పాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! కీలకమైన , జటిలమైన పనుల్లో ఎవరు దేనిని అవలీలగా చేయగలరో వారికే ఆ పని అప్పగించేది. ఎదుటి వారిలో నైపుణ్యాన్ని గుర్తించి పని తీసుకోవడం, అందరికీ సమానంగా ఆత్మీయత పంచడం ఆమెలో నాకు కనిపించిన గొప్ప లక్షణం. అది ఆమె నాకు మాటల్లో చెప్పకుండా, ఆచరించి చూపిన పాఠం. నాన్న నాకు అర్థం కాని సంగతులను విడమరిచి చెప్తే, అమ్మ జీవితాన్ని నేర్పించింది.



అమ్మ నన్ను ‘ధనుంజయా’ అని పిలిచేది... ఆమె అలా ఎందుకు పిలిచేదో అడగనే లేదు. అసలు నాకింత వరకు సందేహమే రాలేదు. అది అమ్మ పిలుపు అని నా నరనరంలో జీర్ణించుకుపోయింది. అందుకే సందేహం రాలేదు కావచ్చు.


 మబ్బు తెరను తొలగించిందామె!

నేను బిఎస్‌సీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. అప్పటి వక్తృత్వ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంతో సంతోషంగా మా ఊరికొచ్చి నాన్నకు చెప్పాను. ఆయన ఏ భావమూ లేకుండా నిర్లిప్తంగా చూశారు. నేను ఊహించని రెస్పాన్స్ అది. నా మనసు చివుక్కుమంది. నా నిష్ఠూరాన్ని అమ్మతో చెప్పాను. అప్పుడామె చిన్నగా నవ్వి... మహాకవి భారవి సంఘటన చెప్తూ... మీ నాన్న కూడా తన సంతోషాన్ని నీ ముందు ప్రకటించరు. నీ పరోక్షంలో ప్రస్తావించి మురిసి పోతుంటారని చెప్పింది.


అమ్మ కళ్లలో సంతోషం!

చదువు పూర్తయి 1973 నుంచి 77 వరకు కెమిస్ట్రీ లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. అప్పటి వరకు నేను సాధించిన లక్ష్యాలను నా జీవనప్రస్థానంలో ఒక్కో మెట్టుగానే భావించిందామె. 1977లో డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు ఖరారయ్యాయి. ఆ సంగతి చెప్పినప్పుడు ఆమె కళ్లు మెరవడాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అది నాకు మరపురాని సంఘటన.


 అమ్మ హెచ్చరిక!

నేను డిప్యూటీ కలెక్టరు అయినందుకు ఆమె సంతోషపడి ఊరుకోలేదు. హెచ్చరిక వంటి కొన్ని మాటలు చెప్పింది. ‘అధికారం చాలా శక్తిమంతమైనది. అది మనిషిని అహంకారిని చేయగలదు. ఎంతటి సౌమ్యులనైనా సరే అధికార దర్పం ఎంతో కొంతయినా మారుస్తుంది. ఆ దర్పాన్ని తలకెక్కించుకోకుండా ఉండగలిగిన వాళ్లే విజ్ఞులు. లంచాలకు తలవొగ్గితే జీవితంలో ధైర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త’ అంటూనే... అలా నిబద్ధతతో ఉండలేనప్పుడు లెక్చరర్ జీవితమే హాయిగా ఉంటుంది’ అని కూడా అన్నారామె. ఆ మాటలు నేను సర్వీస్‌లో ఉన్నంత కాలం గుర్తు పెట్టుకున్నాను.


 అమ్మ ప్రేమ!

అమ్మకు 1973లో క్యాన్సర్ సోకింది. పాతికేళ్లు ఆ మహమ్మారితో పోరాడుతూ కూడా ఆమె ఏనాడూ ధైర్యాన్ని కోల్పోలేదు. మంచం మీద ఉండి కూడా ఇంటి నిర్వహణ చూసుకుందామె.


 నేను పదేళ్లపాటు ముఖ్యమంత్రుల దగ్గర పని చేశాను. ఎన్టీఆర్ హయాంలో ఉదయం నాలుగున్నరకు వెళ్తే రాత్రి తొమ్మిదిన్నరకు రిలీవ్ అయ్యేవాడిని. ఇక నేదురుమల్లి, చెన్నారెడ్డి కాలంలో ఉదయం ఎనిమిదింటికి వెళ్లి, అర్ధరాత్రి రెండు గంటలకు బయటపడాల్సి వచ్చేది. అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చే వరకు ఆమె నిద్రపోయేది కాదు. ‘‘ఇంకా నిద్రపోలేదా అమ్మా!’ అని నేను అడగడం, ‘నువ్వింకా రాలేదుగా నాన్నా!’ అని ఆమె అనడం మాకు రోజూ ఉండేదే. అప్పుడు పది నిమిషాల సేపు ఆమె దగ్గర కూర్చుంటే అదే ఆమెకు కొండంత ఆనందం. నాకు అలాంటి సంతోష క్షణాలు 1999 వరకే దక్కాయి. తర్వాత ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి.

సంభాషణ:  వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top