నువ్వా..నేనా?

నువ్వా..నేనా? - Sakshi


తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్‌ఎస్ హోరాహోరీ

నీల్సన్-ఎన్‌టీవీ సర్వేలో వెల్లడి

‘అసెంబ్లీ’లో టీఆర్‌ఎస్ హవా ‘లోక్‌సభ’లో కాంగ్రెస్ పైచేయి..

119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 51-57.. కాంగ్రెస్‌కు 46-52 సీట్లు

లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు 7-9,  టీఆర్‌ఎస్‌కు 6-8 స్థానాలు

48 గంటల కిందటి సర్వే ఫలితాలు వెల్లడించిన ఎన్‌టీవీ


సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ గాలి

175 స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 129-133 స్థానాలు




 

 సాక్షి, హైదరాబాద్: అతి త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుందని ఎన్‌టీవీ - నీల్సన్ తాజా సర్వే స్పష్టంచేస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాతిపదికనే ఓట్లు పడనున్నాయని ఈ సర్వేలో వెల్లడయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా టీఆర్‌ఎస్.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందనున్నట్లు స్పష్టమైంది. అయితే.. ఈ పోటీలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్వల్పంగా ఆధిక్యం చూపినా.. ఆ మేరకు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందని స్పష్టమవుతోంది. ఈ సర్వే ప్రకారం.. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 51 నుంచి 57 సీట్లు లభించనున్నాయి.

 

 కాంగ్రెస్‌కు 46 నుంచి 52 సీట్లు వస్తాయి. పార్లమెంటులో తెలంగాణకు మద్దతిచ్చి, బిల్లు పాసయ్యేందుకు సహకరించిన పార్టీగా బీజేపీని భావిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనుందని సర్వే చెప్తోంది. టీడీపీ 4 నుంచి 6 స్థానాల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ముస్లిం ఓటు బ్యాంక్ బలంగా ఉన్న ఎంఐఎం 7 నుంచి 8 సీట్లు గెలుచుకోనుంది. ఎంఐఎంతో కలిపి ఇతరులు 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే.. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 7 నుంచి 9 సీట్లలో.. టీఆర్‌ఎస్ 6 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించనున్నాయని సర్వే ఫలితాల సారాంశం. ఎంఐఎం, ఇతరులు కలిసి 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశముంది. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఒక్కో స్థానం సాధించే అవకాశముంది. ఈ మూడు పార్టీలు బోణీ కొట్టని పరిస్థితి కూడా తలెత్తొచ్చని సర్వే తేల్చింది. ఇక.. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని.. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 31 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని సర్వే లెక్కకట్టింది.

 

 తెలంగాణ ఏర్పాటుతో పుంజుకున్న కాంగ్రెస్...

 

 2013 అక్టోబర్ - నవంబర్ నెలల్లో చేసిన సర్వేకి, ప్రస్తుత సర్వేకి మధ్య పార్టీల బలాబలాల్లో వచ్చిన తేడాను, ప్రజాభిప్రాయంలో వచ్చిన తేడాను కూడా ఎన్‌టీవీ వెల్లడించింది. గత సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ 19 నుంచి 24 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్‌కు ఇప్పుడు 46 నుంచి 52 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. గత సర్వేలో కాంగ్రెస్ 1 నుంచి 3 ఎంపీ స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తే.. తాజా సర్వేలో ఆ సంఖ్య 7 నుంచి 9 ఎంపీ స్థానాలకు పెరిగింది. ఇక టీఆర్‌ఎస్ విషయానికి వస్తే గత సర్వేలో 59 నుంచి 63 ఎమ్మెల్యే స్థానాలు, 8 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలో తేలగా.. ప్రస్తుత సర్వేలో ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 51 నుంచి 57 ఎమ్మెల్యే స్థానాలు, 6 నుంచి 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. టీడీపీ గత సర్వేలో 14 నుంచి 17 ఎమ్మెల్యే, 1 నుంచి 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తేలగా.. తాజా సర్వేలో 4 నుంచి 6 ఎమ్మెల్యే సీట్లు, 0-1 ఎంపీ స్థానానికి పడిపోయింది.




 సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం...

 

 సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుందని ఎన్‌టీవీ - నీల్సన్ సర్వేలో వెల్లడైంది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాల్లో 129 నుంచి 133 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుని తిరుగులేని విజేతగా నిలుస్తుందని తేలింది. అలాగే.. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ 19 నుంచి 21 స్థానాలు సొంతం చేసుకుని విజయదుందుభి మోగిస్తుందని స్పష్టమైంది. మొత్తం మీద 48 శాతం ఓట్ల షేరుతో వైఎస్సార్ కాంగ్రెస్‌కు విపరీతమైన ప్రజాదరణ లభిస్తుందని సర్వే అంచనా కట్టింది. ఇక తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో కేవలం 42 నుంచి 46 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని సర్వే స్పష్టంచేస్తోంది. ఈ పార్టీకి 4 నుంచి 6 లోక్‌సభ సీట్లు వస్తాయని సర్వే అంచనా. మొత్తం మీద సీమాంధ్రలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని.. అయితే వైఎస్సార్ కాంగ్రెస్‌దే స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని సర్వే ఫలితం సారాంశం.

 

 రాష్ట్ర విభజన ప్రభావం సీమాంధ్రలో కాంగ్రెస్‌ను తుడిచిపెడుతుందని.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్న ఆగ్రహం ప్రజల్లో పెల్లుబుకుతోందని.. కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర నుంచి అసెంబ్లీలో కానీ, లోక్‌సభలో కానీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కదని సర్వే తేల్చిచెప్పింది. ఆ పార్టీకి దక్కే ఓట్ల శాతం కూడా అత్యంత దారుణంగా 5 శాతానికి పడిపోతుందని సర్వేలో స్పష్టమైంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర సహా ఇతర పార్టీలు 1 నుంచి 4 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశముందని సర్వే ఫలితాల సారాంశం. ఓట్ల శాతం విషయానికి వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 48 శాతం, టీడీపీకి 40 శాతం, కాంగ్రెస్‌కు 5 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు లభించనున్నట్లు సర్వే చెప్తోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 48 శాతం ఓట్లతో 19 నుంచి 21 స్థానాల్లో విజయం సాధించనుంది. టీడీపీ 37.5 శాతం ఓట్లతో 4 నుంచి 6 స్థానాల్లో గెలుపొందనుంది. కాంగ్రెస్ పరిస్థితి అసెంబ్లీ స్థానాల మాదిరిగా జీరోగానే ఉంది.

 

 ‘విభజన’తో సీమాంధ్రలో కాంగ్రెస్ ఖతం...

 

 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, సీమాంధ్రల్లోని 180 నియోజకవర్గాల్లో 40 వేల సాంపిల్ సైజ్‌తో రెండు రోజుల కిందట ఎన్‌టీవీ - నీల్సన్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. గత సర్వేలో కాంగ్రెస్ 7 నుంచి 11 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తుందని సర్వేలో తేలగా తాజాగా ఆ సంఖ్య సున్నాకు పడిపోయింది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గత సర్వేలో 132 నుంచి 139 స్థానాల్లో గెలుస్తుందని తేలగా.. తాజాగా అది స్వల్పంగా తగ్గి 129 నుంచి 133 స్థానాలు గెలుస్తుందని సర్వే చెప్తోంది. టీడీపీ గతంలో 32 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందని తేలగా.. అదిప్పుడు 42 నుంచి 46కి పెరిగింది.

 

 15 రోజుల్లో మరో సర్వే...

 

 తాజాగా చేసిన సర్వే ప్రస్తుత పరిస్థితి ప్రకారం చేసిందని ఎన్‌టీవీ చెప్పింది. పొత్తులు, అభ్యర్థుల ప్రకటనల అనంతరం ఈ పరిస్థితిలో కాస్తంత మార్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ సర్వేలపై చర్చలో పాల్గొన్న టీడీపీ నాయకుడు సి.ఎం.రమేష్ ఇదంతా తప్పుడు సర్వే అని, కుట్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు.




 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top