
ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు!
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారు.
► అంతా సంపన్న కులాల్లోనే పుట్టాలనుకుంటారు
► కులం ఓట్లతో ఎవడూ గెలవలేడు
► మంద కృష్ణకు ఎన్ని ఓట్లొచ్చాయి?
► కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
► నేను చెప్పిన మాటలే చెప్పి మంత్రులు
► ముద్రగడ దీక్ష విరమింప చేశారు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుల వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. కులం, ప్రాంతం, మతం ఒకరు కోరుకుంటే రావని, కానీ వాటిని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కులాలను బట్టి ఓట్లు రావని, వాటితో ఎవడూ గెలవలేడని వ్యాఖ్యానించా రు. ప్రపంచంలో ఉన్నది ధనిక, పేద రెండే కులాలన్నారు.
కేసీఆర్‌ది ఏ కులమని ప్రజలు గెలిపించారని ప్రశ్నించిన ఆయన... నరేంద్రమోదీ, మమతా బెనర్జీ, నవీన్‌పట్నాయక్ వం టి వాళ్లెవరూ కులాలను బట్టి గెలవలేదని తెలి పారు. మంద కృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయాడని, ఆర్.కృష్ణయ్యకు సీటు ఇస్తే మెజారిటీ తగ్గిపోయిందని చెప్పారు. కాపుల రిజర్వేషన్లపై తాను చెప్పిన మాటలనే తన మంత్రులు ముద్రగడతో చెప్పి దీక్ష విరమింపజేశారని తెలిపారు. బీసీలకు ఎటువంటి అన్యా యం జరక్కుండా కాపుల్లో ఉన్న పేదలకు మే లు చేస్తామన్నారు. వారికి బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని, రుణాల దరఖాస్తులన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు.
ముద్రగడ అరెస్టుపై అస్పష్టత
ముద్రగడతో చర్చలు సఫలమైన నేపథ్యంలో తుని ఘటనలో ఏ1గా ఉన్న ఆయన్ను అరెస్టుచేస్తారా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పలేదు. దీనిపై విచారణ జరుగుతోందని, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన సమావేశాన్ని నిర్వహించినా... కొందరు రాయలసీమ నుంచి మనుషుల్ని పంపించారని, వారే అసలు దోషులని ఆరోపించారు. కాపుల గురించి పార్టీ పెట్టి, వారి గురించే దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశానని చెప్పి, ఒక్కరోజు కూడా ఆ విషయం గురించి మాట్లాడని చిరంజీవి.. ముద్రగడను పరామర్శించడానికి వెళతారా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ సమీక్ష ఒక అద్భుతమన్నారు.
విలేకరులపై చంద్రబాబు చిందులు
తుని ఘటనలో కెమెరాలు దెబ్బతిన్న వారికి సాయం చేయాలని పలువురు జర్నలిస్టులు మీడియా సమావేశం తర్వాత కోరగా... తాను చేయనని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంటే దాన్ని వదిలేసి తనపై ఎవరో (ముద్రగడ) చేసిన ఆరోపణలను చూపించడం ఏమిటని విరుచుకుపడ్డారు. నెగిటివ్ వార్తలకే ప్రాధాన్యం ఇస్తారని, విలేకరులు మైండ్‌సెంట్ మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం
ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుసోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. సమావేశం అనంతరం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతోపాటు పోలవరం, రైల్వేజోన్ ఏర్పాటు, విభజన హామీల అమలు వంటి పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయన్ను కూడా మంగళవారం కలిసే అవకాశం ఉంది.