తాడేపల్లిగూడెం : వెంకట్రామన్నగూడెంలో 1800 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. బిల్ట్ అండ్ అపరేట్(బీవోటీ) పద్ధతిలో దీని నిర్మాణం చేపట్టనున్నట్టు సమాచారం.
1800 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
Sep 20 2016 10:37 PM | Updated on Mar 19 2019 6:15 PM
తాడేపల్లిగూడెం : వెంకట్రామన్నగూడెంలో 1800 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. బిల్ట్ అండ్ అపరేట్(బీవోటీ) పద్ధతిలో దీని నిర్మాణం చేపట్టనున్నట్టు సమాచారం. వెంకట్రామన్నగూడెంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ పరి«ధిలో సుమారు 3600 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఈ భూమిని డీనోటిఫై చేసి ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పదిహేనుళ్లుగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఈ యత్నాలు సాగాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేశారు. దీనిలో భాగంగానే తాడేపల్లిగూడెం పట్టణంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రహస్య కార్యకలాపాల కోసం నిర్మించిన విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలనే యత్నాలు ఊపందుకున్నాయి. ఈ భూమిలో 172 ఎకరాల వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కి కేటాయించారు. దీంతో విమానాశ్రయ పునరుద్ధరణ అవకాశాలు సన్నగిల్లాయి.
ఇజ్రాయెల్‌కు చెందిన ఒక సంస్థ సహకారంతో పైలట్ రహిత విమానాల విడి భాగాల తయారీ కేంద్రాన్ని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేసి, దానికి అనుబంధంగా నిర్మించే రన్‌వేలను విమానాల రాకపోకలకు వినియోగించుకోవాలని, నిర్వహణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున భరించాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చాయి. వీటన్నింటినీ కాదని తాజాగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం అంశం తెరమీదకు వచ్చింది. విమానయానం పెరగడం, దానికనుగుణంగా రాష్ట్రంలో గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను విస్తరించే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం డొమెస్టిక్, కార్గో విమానాశ్రయాలుగా, షాపింగ్ మాల్స్ , శీతల గిడ్డంగులు వంటి సౌకర్యాలతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను నిర్మిస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా వెంకట్రామన్నగూడెంలో 1800 ఎకరాలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో ఉన్న 3,600 ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేశాక , ఎయిర్ పోర్టు నిర్మాణానికి బీఓటీ పద్ధతిలో నిర్మాణానికి ముందుకు వచ్చే సంస్థ రెండు వేల ఎకరాలు కేటాయించాలని కోరినట్టు మంత్రి చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి 500 ఎకరాల భూమిని పరిశోధన , విస్తరణల కోసం కేటాయించాల్సి ఉన్నందున 1800 ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. శీతల గిడ్డంగులతో సహా, టెర్మినల్స్ , ఆధునిక సదుపాయాలను ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులో ఏర్పాటుచేస్తారు. ఎయిర్‌పోర్టుతో పాటు జిల్లాకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉన్న ఆంధ్రాయూనివర్సిటీ క్యాంపస్‌ను యూనివర్సిటీగా మార్చే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా గూడెంలో డిఫెన్సు ఫ్యాక్టరీ నిర్మాణానికీ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement