ఏపీలో అధికార పార్టీ వైపరీత్యం

ఏపీలో అధికార పార్టీ వైపరీత్యం - Sakshi


ఒకేఒక్క ప్రతిపక్షం ఉన్నా ఆ పార్టీ శాసన సభాపక్ష నేతకు మాట్లాడేందుకు దొరకని అవకాశం

 శాసనసభలో సాధారణంగా ప్రతిపక్షానికే ఎక్కువ సమయం

 విపక్షంపై ఉండే గురుతర బాధ్యత దృష్ట్యా కొనసాగుతున్న సంప్రదాయం

 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్ష నేతలకన్నా ఎక్కువ మాట్లాడిన చంద్రబాబు    

 ముందెన్నడూ చూడని పరిణామాలపై పార్లమెంటేరియన్ల విస్మయం

 

 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతకే అవకాశం లేక మీడియా ముందు చెప్పుకోవలసిన పరిస్థితి.  విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వని పరిస్థితి. ప్రస్తుతం ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలు సీనియర్ పార్లమెంటేరియన్లను విస్మయపరుస్తున్నాయి. శాసనసభలో అధికారపక్షం కన్నా ప్రతి పక్షానికే ఎక్కువ ప్రాధాన్యముండడం సహజమని గుర్తు చేస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్షానికి సంఖ్యా పరంగా సీట్ల సంఖ్య తక్కువ ఉన్నా సభలో దాని బాధ్యత గురుతరమైనదిగా గుర్తించి సాధారణంగా ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు. టీడీపీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత గా చంద్రబాబు అధికారపక్ష నేతలకన్నా ఎక్కువ సమయం మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

 


ఒక్క సభ్యుడున్న పార్టీకి కూడా ఆయా సందర్భాలను అనుసరించి సభలో సమయం కేటాయింపులో సముచిత స్థానం లభించేంది. టీడీపీ బలం 47 స్థానాలకు పడిపోయినప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బలం 26 స్థానాలకు దిగజారినప్పుడు కూడా శాసనసభలో ప్రతిపక్షానికే సముచితమైన అవకాశాలు దక్కాయి. సభా నిబంధనల ప్రకారం కాకుండా ఆయా పరిస్థితులను అనుసరించి సభాపతులు తమంతట తాము నిర్ణయాలు తీసుకొని చర్చలు సజావుగా సాగించేందుకు ఇలాంటి సంప్రదాయాలను నెలకొల్పారు. ప్రస్తు త శాసనసభకు తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడే ప్రాతినిధ్యం వహిస్తున్నారుు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో పాలు పంచుకొంటూ అధికారపక్షంగా ఉన్నాయి.

 ఇక 67 మంది సభ్యులతో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ ఒక్కటే ప్రతిపక్షంలో ఉంది. గతంలో మాదిరిగా అనేక పార్టీలతో కూడిన ప్రతిపక్షం ప్రస్తుతం లేకపోవడంతో ప్రజాసమస్యలను ప్రభుత్వానికి గుర్తుచేయాల్సిన గురుతర బాధ్య త ఆ పార్టీపైనే ఉంది. కానీ ప్రతిపక్షానికి అవకాశమే ఇవ్వరాదన్న రీతిలో అధికార పక్షం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

 

 సభాపతిపై అధికార పక్షం ఒత్తిళ్లు!

 

 ఇటీవలి పరిణామాలు చూసినవారు సభాపతిపై అధికారపక్షం ఒత్తిడి ఎక్కువగా ఉందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)లో గతంలో అధికారపక్షం నుంచి అయిదారుగురుండగా ప్రతిపక్షం నుంచి ఏడెనిమిది మందికి అవకాశముండేది. ఒకరిద్దరున్న పార్టీల నుంచి కూడా ఒక్కొక్కరు బీఏసీ సభ్యులుగా ఉండేవారు. కానీ ఈసారి సభ్యుల సంఖ్య ఏడుకు కుదించుకపోగా అందులో 67 మంది సభ్యులున్న ప్రతిపక్షం నుంచి ఇద్దరికే పరిమితం చేశారు. కీలకమైన బడ్జెట్ సమావే శాల్లో బడ్జెట్‌పై కానీ, పద్దులపై కానీ చర్చల్లో ప్రతిపక్షానికి ఇతోధిక సమయం ఇస్తుంటారు. ఈసారి బడ్జెట్లో ప్రతిపక్షాన్ని గంటన్నరకు పరిమితం చేయడం చర్చనీయాంశం కాగా, సభలో ప్రతిపక్షనేత వైఎస్ జగ న్‌మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై చర్చను ప్రారంభించి ముగించేలోపు 17 సార్లు అంతరాయాలు కల్పించారు. రెండున్నరగంటల్లో గంటా ఆరు నిమిషాలు అంతరాయం తప్పలేదు. నిబంధనల ప్రకారం కేటాయించిన సమయం కూడా ప్రతిపక్షనేత మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు. చివరకు తాను చర్చను ముగించడానికి మరో 30 నిమిషాలు సమయం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత విజ్ఞప్తి కూడా అరణ్య రోదనగానే మిగిలింది. చివరకు ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై తన అభిప్రాయూన్ని బయట మీడియా ద్వారా ప్రజలకు వివరించాల్సి వచ్చింది.  చివరకు ప్రతిపక్షం వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడానికి కూడా సభలో అవకాశం దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 గందరగోళంలోనూ సభ కొనసాగింపా?

 

 సభలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు కొన్ని సందర్భాల్లో శ్రుతిమించినప్పుడు.. సాధారణంగా సభలోని సీనియర్ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని అధికార, ప్రతిపక్షాల మధ్య సర్దుబాటు చేసి సభను తిరిగి నడిపిస్తుంటారు.

 

 కానీ ప్రస్తుత సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా సభ కొనసాగిపోతూనే ఉండడంపై మాజీ సభాపతులు విస్తుతున్నారు. పైగా ప్రతిపక్షానికి మైక్ కట్ అయిన సమయంలో అధికారపక్షం నుంచి వరుసపెట్టి మంత్రులు, ఇతర సభ్యులు సుదీర్ఘంగా విమర్శలు గుప్పించడం సాధారణ ప్రక్రియగా మారిపోరుుంది.  పైగా ప్రతిపక్షం వాకౌట్ చేసినా ఆ విషయం టీవీల్లో ప్రసారం కాని పరిస్థితిపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top