రాయదుర్గం రైలు మార్గానికి రూ.100కోట్లు మంజూరు


సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం-తుమకూరు రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర వాటా కింద రూ.100 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అనంతపురం జిల్లాలో రాయదుర్గం నుంచి కళాణదుర్గం, మడకశిర మీదుగా కర్ణాటకలోని తుమకూరుకు రైలు మార్గాన్ని నిర్మించడానికి 2008-09 బడ్జెట్లో రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించేలా ఒప్పందం చేసుకున్నాయి. రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి 2013-14, 2014-15 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసాను కేటాయించ లేదు. దాంతో రైల్వే శాఖ కూడా ఆ మార్గానికి నిధులను కేటాయించ లేదు.



2015-16లో రాష్ట్ర వాటా కింద రూ.వంద కోట్లను మంజూరు చేస్తే రైలు మార్గం పనులను కొనసాగిస్తామని.. లేదంటే ఆపివేస్తామని మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే శాఖ లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించిన ప్రభుత్వం 2015-16లో రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి రాష్ట్ర వాటా కింద రూ.వంద కోట్లను మంజూరు చేయడానికి అంగీకరిస్తూ మే 22న రైల్వే శాఖకు లేఖ రాసింది. ఆ మేరకు ఆ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటాగా రూ.వంద కోట్లను మంజూరు చేస్తూ రహదారులు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.శ్యాంబాబ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top