Breaking News

Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!

Published on Fri, 01/31/2025 - 13:02

అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే  అభ్యంతరం అవుతుంది. 

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు  చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను   కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్  హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన  పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత  వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా  ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున  వ్యయం చేయడం ఏమిటి? అనే  ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. 

తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు  పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్‌లో భవనాలను, డిజైన్ లను గతంలో  ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు.  

చంద్రబాబు  నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్  నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు.  ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో  ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.

అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే  ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్‌లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు  భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో  ప్రయోజనం దక్కడం లేదు. పైగా  రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు  ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. 

ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర  ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే  టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.

టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా  ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో  అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ..  సూపర్ సిక్స్‌లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్‌లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో  ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి  ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు.  గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు   ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. 

ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్  ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు  విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను  అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము  అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని,  పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు  చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.

అయితే వైఎస్‌ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన  ప్రకారం దాదాపు అన్ని హామీలు  నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు  ఆశించిన  రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం  దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన  భవనాలు నిర్మించితే సరిపోతుందా?.  

జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు,  ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు  నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్‌ను త్యాగం చేసి  ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. 

ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని  గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో  అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు  ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)